బకాసురుని చంపిన భీముడు

Bhima Killed Bakasura

 

ఏకచక్రాపురానికి దగ్గర్లో ఉన్న అడవిలో, ఓ కొండ గుహలో బకాసురుడు అనే రాక్షసుడు నివాసం ఉండేవాడు. ఆ అసురుడు రోజూ ఊరిమీద పడి జనాలను ఇష్టారాజ్యంగా తింటూ ఉంటే, వారు అలా కాదని ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. రోజుకు ఒక బండినిండా అన్నం, ఒక దున్నపోతు, ఒక మనిషి బకాసురుడికి ఆహారంగా వెళ్ళాలి. దీన్ని చూస్తోంటే సింహం కథ గుర్తొస్తోంది కదూ! అవును ఆ కధకూ, ఈ కధకూ కొంత సారూప్యం కనిపిస్తుంది.

 

లాక్షా గృహం కాలిపోయిన తర్వాత పాండవులు అరణ్యవాసం సాగిస్తూ ఈ ఏకచక్రపురం చేరారు. వాళ్ళు ఆ ఊరు చేరి ఓ చెట్టు కింద విశ్రమిస్తూ ఉండగా దగ్గరలోని ఇంటినుండి పెద్దపెట్టున ఏడుపులు వినిపించాయి. అందరూ ఆశ్చర్యంగా చూశారు. కుంతీదేవి ఆగలేక, ఆ ఇంటికి వెళ్ళి తలుపుకొట్టి, ''ఎందుకు దుఃఖిస్తున్నారు.. విషయం ఏమి''టని అడిగింది.

 

అప్పుడా ఇంటి ఇల్లాలు బకాసురుడి వృత్తాంతం క్లుప్తంగా చెప్పి, ''బకాసురుడికి ప్రతిరోజూ బండెడు అన్నం, ఒక దున్నపోతు, ఒక మనిషిని ఆహారంగా పంపించాల్సి ఉంటుంది.. ఈరోజు మా ఇంట్లోనుంచి ఒకరు వెళ్ళాల్సి ఉంది. రాక్షసుడికి ఆహారంగా నా భర్త వెళ్తానంటున్నాడు.. నేనది భరించలేనని, నేనే వెళ్తానని అంటే వినడంలేదు. మా అమ్మాయేమో ''మీరిద్దరూ వద్దు, నేను వెళ్తాను'' అంటోంది. ఇక మా అబ్బాయి ''అసలు మన ఇంట్లోవాళ్ళే కాదు, ఇకపై ఎవరూ రాక్షసుడికి బలి కావలసిన పని లేకుండా నేను వెళ్ళి బకాసురుడిని చంపేస్తాను'' అంటున్నాడు...'' అంటూ బాధపడ్తూ జీరగొంతుతో చెప్పింది.

 

అదంతా విన్న కుంతీదేవి ''ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదు.. నిశ్చింతగా ఉండు.. నా కొడుకు భీమసేనుడు మహా బలవంతుడు. బకాసురుని చంపడానికి భీముడే తగినవాడు...'' అంది.

 

ఆ కుటుంబీకులు ఎంతగానో సంతోషించారు. అన్నం సిద్ధం చేశారు.

 

భీమసేనుడు అన్నం, దున్నపోతులతో బకాసురుని దగ్గరికి వెళ్ళాడు.

 

భీముడు అడవికి వెళ్ళి, తీసికెళ్ళిన ఆహారపదార్థాలు తానే తిన్నాడు.

 

ఇంతలో బకాసురుడు కోపావేశంతో అక్కడికి వచ్చాడు. ''నేను ఆహారం కోసం ఇంతసేపు ఎదురు చూడాలా? ఏదీ ఎక్కడ?'' అనడిగాడు.

 

భీముడు మహా నిర్లక్ష్యంగా ''నీకు భోజనం తెచ్చేవాడిలా కనిపిస్తున్నానా?" అంటూ ఎదురుప్రశ్న వేశాడు.

 

బకాసురుడికి పిచ్చి కోపం వచ్చి ఒక చెట్టును పెకిలించి, భీముని కొట్టబోయాడు.

 

భీముడు ఆ చెట్టును పూచికపుల్లలా విరిచేసి, తాను మరో చెట్టును పెకిలించి బకాసురుని కొట్టాడు.

 

ఇద్దరూ చాలాసేపు కలబడ్డారు. చివరికి భీముడు, బకాసురుని చంపేశాడు.

 

కుంతీదేవి మాట్లాడిన కుటుంబీకులు భీమునికి, కుంతీదేవికి కూడా పాదాభివందనం చేశారు. వాళ్ళే కాదు, ఏకచక్రపుర వాసులంతా ''మీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేం'' అంటూ చేతులెత్తి దణ్ణం పెట్టారు.

 

Bhimasena and Bakasura in Mahabharat Epic, Bhima killed the demon Bakasura, Bhimasena son of Kuntidevi, Bhimasena in Ekachakrapura, Pandavas Aranyavas, Lakshagruha in Mahabharat


More Purana Patralu - Mythological Stories