కుబేరుడి గత జన్మ ఏమిటి? ఈయన సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు..?

హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు.  వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు.  కుబేరుడు సంపదలకు అధిదేవత.  తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర  అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు.  అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధి దేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏమిటి? దీని గురించి తెలుసుకుంటే..

కుబేరుడు..

రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తరువాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు.  కుబేరుడు రావణుడి సవతి సోదరుడు.  అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్ష రాజుగా,  సంపదలకు అదిదేవతగా  పిలువబడతాడు.  కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

దొంగతనం..

కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకే అధిదేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు  దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడంటే..

గత జన్మ..

పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి.  పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు.

కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చెస్తున్న పనులను సమర్థిస్తూ, కప్పిపుచ్చుకుంటూ ఉండేది. కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది.  కానీ ఒకరోజు కుబేరుడి తండ్రికి నిజం తెలిసింది.  తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు. ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు.

శివాలయం కు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందిరికీ పంచి పెట్టి ఆ తరువాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు.  పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు.  బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి, దాహం ఎక్కువ అయ్యాయి.  గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో  దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలు పెట్టాడు.  కానీ గాలికి దీపం మళ్లీ మళ్లీ ఆరిపోతూనే ఉంది. కుబేరుడు దీపాన్ని మళ్లీ మళ్లీ వెలిగిస్తూనే ఉన్నాడుయ  ఇదంతా  జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకువ వచ్చింది.  కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు.  అలా అనుకోవడంతోనే పూజారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు.  కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు.

మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి నువ్వు చాలా పాపాలు చేశావు.  కానీ  ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు,  కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరం ఇచ్చాడట.

ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు, దేవవర్ణిని లకు కుమారుడిగా జన్మించాడు.  వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు. వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తరువాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా,  సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇదీ కుబేరుడి కథ.


                                                *రూపశ్రీ.

                            


More Purana Patralu - Mythological Stories