సంగీత విద్వాంసులు ముత్తుస్వామి దీక్షితుల గురించి తెలుసా??


జయదేవుని తర్వాత సంస్కృతంలో చక్కటి కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు - ముత్తుస్వామి దీక్షితులు. ఆయన కీర్తనలు శబ్దానికీ, నాదానికీ అనుకూలంగా ఉంటాయి. ఆయన రచనాశైలి నారికేళపాకం. దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతంలో  'త్రిమూర్తులు'గా పేరుగాంచిన త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ - ఈ ముగ్గురూ తంజావూరులోని తిరువాయూర్ లో జన్మించడం విశేషం. ముగ్గురూ అలౌకిక జ్ఞానసంపన్నులు. త్యాగయ్యకు నారద మహర్షి 'స్వరార్ణవం' అనే సంగీత గ్రంథాన్ని ప్రసాదించగా, దీక్షితుల వారికి సుబ్రహ్మణ్యస్వామి నోటిలో కలకండ వేసి కండచక్కెర లాంటి కీర్తనలు వ్రాసేలా ఆశీర్వదించారు. ఈయన సాధనకు మెచ్చి అమ్మవారు దివ్యమైన వీణను ప్రసాదించింది. అమృత వర్షిణి రాగం ఆలపించి కుంభవృష్టి కురిపించిన గొప్ప వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్. ఆయన సోదరులు బాలస్వామి, చిన్నస్వామి కూడా సంగీతంలో మంచి విద్వాంసులు. ముత్తుస్వామి రచించిన కీర్తనలను గానం చేస్తూ లోకంలో బాగా ప్రచారంలోకి తెచ్చారు.

ముత్తుస్వామికి ఎప్పుడూ సంగీత ధ్యానమే తప్ప సంసారం పట్టేది కాదు. లౌకిక సుఖాల పట్ల వ్యామోహం లేని ముత్తుస్వామిని చిదంబర నాదయోగి కాశీ నగరానికి తీసుకువెళ్ళి, శ్రీవిద్యా మంత్రం ఉపదేశించాడు. నిరంతర మంత్రజపంతో, ఉపాసనతో ఆయనలో దివ్యతేజస్సు ఆవరించింది. మంత్రసిద్ధి కలిగింది. గంగానదిలో నిలబడి మంత్రోపాసన చేసి అమ్మవారిని వరం కోరాల్సిందిగా చిదంబర యోగి తన శిష్యుడికి చెప్పాడు. అలాగే చేసిన ముత్తుస్వామి, వీణను ప్రసాదించాల్సిందిగా అమ్మవారిని కోరాడు. మరుక్షణం అతని చేతుల్లో పవిత్రమైన వీణ ప్రత్యక్షమైంది.

తిరుత్తణిలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ధ్యాన మగ్నుడైన ముత్తుస్వామిని అనుగ్రహించి, స్వామి ఒక సాధువు రూపంలో వచ్చి అతని నోటిలో కలకండ వేసి 'విజయోస్తు' అని దీవించి అదృశ్యుడయ్యాడు. నాటి నుంచి ముత్తుస్వామి పలుకులో మాధుర్యం, క్రొత్తదనం అందరినీ ఆశ్చర్యపరిచాయి. అక్కడి దేవాలయంలో త్రికోణాకృతిలో, ప్రణవస్వరూపంగా విలసిల్లే గణపతిని ఉద్దేశించి ముత్తుస్వామి రచించిన కీర్తన 'వాతాపి గణపతిం భజే...' సంగీత కచ్చేరీలలో ప్రారంభ కీర్తనగా నేటికీ సుప్రసిద్ధం.

ముత్తుస్వామికి ఎందరో శిష్యులు ఉండేవారు. వారంతా ఎంతో గురుభక్తితో ముత్తుస్వామిని ఆరాధించేవారు. ఒకసారి ఒక శిష్యుడికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. జ్యోతిష్కులు అతని జాతకం చూసి, గురు, శనిగ్రహాలు సరిలేవనీ, దాని ఫలితమే ఈ రోగమనీ తేల్చారు. ముత్తుస్వామి ఆయా గ్రహాల పరంగా కీర్తనలు రచించి ఇచ్చి, నిష్ఠగా గానం చేయాల్సిందిగా అతణ్ణి ఆదేశించారు. అలా చేసేసరికి, పది రోజులలో శిష్యుడి బాధలన్నీ తగ్గిపోయాయి. సంగీతానికి అంతటి మహిమ ఉందని లోకానికి చాటిచెప్పిన మహానుభావుడు దీక్షితార్.

కొంతకాలానికి తమ్ముడు చిన్నస్వామి కాలధర్మం చెందగా, మనోవ్యధతో బాల స్వామి తీర్థయాత్రలు చేస్తూ ఎట్టయాపురం చేరి, అక్కడి మహారాజుల సంస్థానంలో విద్వాంసునిగా స్థిరపడ్డాడు. చిన్నస్వామి మరణం, బాలస్వామి జాడ తెలియక పోవడంతో దీక్షితుల వారు తీవ్రమైన మనోవేదనకు లోనయ్యారు. బాలస్వామి ఎట్టయాపురంలో ఉన్నాడని తెలిసి అతని కోసం ఎట్టయాపురం వెళ్ళారు. మార్గమధ్యంలో ఒక గ్రామంలో వర్షం లేక ఎండిపోయిన పంటపొలాలు చూసి, ముత్తుస్వామి హృదయం ద్రవించింది. అమృతేశ్వరిని ధ్యానించి, అమృతవర్షిణి రాగంలో కీర్తన అందుకొని కరుణరస భరితంగా గానం చేశారు. వెంటనే ప్రకృతి పులకించి, వర్షం ధారగా కురిసింది. నేల తడిసింది. ఆ గ్రామ ప్రజల ఆనందానికి అంతు లేదు.

బాలస్వామికి ఎట్టయాపురంలో వివాహం జరిపించి, ముత్తుస్వామి తిరువాయూరు తిరిగివచ్చారు. త్యాగయ్య, శ్యామశాస్త్రి మొదలైన సంగీత విద్వాంసులతో శాస్త్ర చర్చలు చేస్తూ కాలం గడిపేవారు. చివరకు, నాదజ్యోతిగా పేరు గాంచిన ముత్తుస్వామి దీక్షితులు 1835వ సంవత్సరంలో తన శిష్యులను పిలిచి, 'మీనలోచని పాశమోచని... అనే కీర్తనను గానం చేయాల్సిందిగా చెప్పి, ధ్యానమగ్నులయ్యారు. 'శివే పాహి' అంటూ తన చివరి శ్వాస వదిలారు. నాదజ్యోతి ఆ పరమాత్మలో లీనమైంది. ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలను దేశమంతటా వ్యాపింపజేసి, ఆయన శిష్యులు గురు ఋణం తీర్చుకున్నారు.  ఇదీ ముత్తుస్వామి గారి కథనం.

                                     *నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories