మారండి సరికొత్తగా

సరికొత్తగా కనిపించాలంటే ఒకోసారి చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. రెగ్యులర్ గా ఉండే డ్రస్ పేట్రన్ ని మార్చటం, వాడే హ్యాండ్ బ్యాగ్ నుంచి యాక్ససరీస్ వరకు అన్నిటిని అప్పటి వరకు వాడే వాటికి భిన్నంగా ఉండేలా సెలక్ట్ చేసుకుంటే 'వావ్' అనే పొగడ్త పొందడం కష్టమే కాదు. గ్రూమింగ్ ఎక్స్ పర్ట్స్ ఈ విషయంలో చేస్తున్న కొన్ని సూచనలు మీ కోసం

1. మీరు టీవి సీరియల్స్ చూస్తారా? అయితే ఒక విషయాన్ని గమనించే ఉంటారు. సంవత్సరాలపాటు నడిచే డైలీ సీరియల్స్ లో మీకు బాగా నచ్చిన హీరోయిన్, ఇతర లేడీ క్యారక్టర్స్ కొన్నాళ్లు పోయేసరికి వాళ్లు వాడుకునే బట్టలు నుంచి నగలు దాకా అన్నిటిలో భారీ మార్పుని చూపిస్తారు. అంటే అప్పటిదాకా చీర కట్టుకుని తల మీద ముసుగేసుకున్న హీరోయిన్ డ్రస్సులు వేయడం మొదలు పెడుతుంది. భారీ నగల స్థానంలో సన్నటి చైన్లు వేస్తుంది. ఇలా జనాలకి ఆ క్యారక్టర్ బోర్ కొట్టకుండా ఉండటానికి ఆ మార్పు తెస్తారు. మనం మరీ అంతగా కాకపోయినా ఎంతో కొంత చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ని నెమ్మదిగా మార్చుకోవచ్చు.

2. ఇప్పటిదాకా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ని వాడుంటారు. ఈసారి ఒకే రకమైన ఫ్యాబ్రిక్ ని సెలక్ట్ చేసుకోండి. అందులోనే చుడీదార్స్, చీరలు డ్రస్ టాప్స్ వంటివి ఎంచుకోండి. ఉదాహరణకి కంప్లీట్ హ్యాండ్లూమ్స్ తో వాడ్ రోబ్ ని నింపండి. అదీ బోర్ కొట్టకుండా ఉండేలా కాస్త ఓపిక చేసుకొని షాపింగ్ చేయండి. రకరకాల డిజైన్లు, కలర్స్ ని ఎంచుకుంటే సరికొత్తగా కనిపిస్తారు.

3. హై హీల్స్ అలవాటా? ఈసారి ఫ్లొరల్ డిజైన్స్ చెప్పల్స్ కొనండి. అన్ని డ్రస్సులకి మ్యాచయ్యే ఓ నాలుగు కలర్స్ కొనండి లేదా హాఫ్ షూస్ లో కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తున్నాయి. అవి సెలక్ట్ చేసుకోండి.

4. హ్యాండ్ బ్యాగులలో కూడా ఇప్పుడు బోల్టన్ని వెరైటీలు వాటిలో మీకు సూట్ అయ్యే, నచ్చే పేట్రన్ బ్యాగును సెలక్ట్ చేసుకోండి. ఫంకీ కలర్స్ బ్యాగులు సరికొత్త లుక్ ఇస్తాయి.

5. మల్టీ కలర్డ్ బీడ్స్ తో గొలుసులు, నియాన్ కలర్ వాచులు, కాక్ టెయిల్ రింగ్స్ కలర్ ఫుల్ బెల్ట్స్ ఇలా అన్నిటిలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించేలా ఉండాలి మీ సెలక్షన్, కలక్షన్. అందుకు కావలసిందల్లా కాస్త ఓపిక అంతే.. అన్నీ ఒక్కచోట దొరకవు, ఒక్కసారే దొరకవు. కాబట్టి ఓపిగ్గా షాపింగ్ చేసి సరికొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి.

- రమ