శంకరాభరణం ఆడియో హైలైట్స్
on Oct 31, 2015
నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్, కామెడీ చిత్రం శంకరాభరణం. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్ ఈ చిత్రానికి రచన చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను సమంత కు అందించారు. ఈ సందర్భంగా..
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. సినిమా ఓపెనింగ్స్ రావడానికి ట్రైలర్ అనేది చాలా ముఖ్యం. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే సినిమా చూడాలనే ఆతురత పెరిగింది. ప్రవీణ్ మ్యూజిక్ బావుంది. ఈ చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు.. అని చెప్పారు.
సమంత మాట్లాడుతూ.. కోన గారితో నా మొదటి సినిమా నుండి మంచి పరిచయం ఉంది. గీతాంజలి కంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ప్రవీణ్ గారు సాంగ్స్ లో మంచి కిక్ ఉంది. ఫోటోగ్రఫీ బావుంది. నిఖిల్ కంటిన్యూస్ హిట్స్ అందుకుంటున్నాడు. అంజలి బాగా చేసింది. టీం అందరికి ఆల్ ది బెస్ట్.. అని చెప్పారు.
కోన వెంకట్ మాట్లాడుతూ.. సినిమాకు ఇంత బజ్ రావడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎందరో వచ్చి సపోర్ట్ చేసారు. అంజలికి ఈ పాత్రలో నటించాల్సిన అవసరం లేదు. కాని నేను అడిగిన వెంటనే ఓకే చెప్పింది. నందిత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం సాయి శ్రీరాం. వంద లోకేషన్స్ లో షూట్ చేసాం. ప్రతి విజువల్ అధ్బుతంగా వచ్చేలా చేసాడు సాయి శ్రీరాం. హిందీలో ఫస్ గయా రే ఒబామా సినిమా చూసి ఒక ఐడియా తీసుకొని దాని చుట్టూ కథ అల్లాను. బీహార్ లో కిడ్నాపింగ్ అనేది మేజర్ బిజినెస్. ఎందరో రాజకీయనాయకులు దాని వెనుక ఉన్నారని తెలిసి షాక్ అయ్యాను. ఈ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంటుందని సినిమా చేసాను. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు ఇదొక సమాధానం. తెలుగు చిత్రాలు కూడా బాలీవుడ్ స్థాయిలో తీయగలమని చెప్పడానికే శంకరాభరణం తీశాను. నేను ఫార్ములా సినిమాలు మాత్రమే కాదు. అన్ని రకాలా సినిమాలు చేయగలను. ఉదయ్ ను డైరెక్టర్ చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. ఈ సినిమా లుక్ కు సత్యనారాయణ గారి స్త్రెంగ్థ్ కారణం. ఈ చిత్రానికి హీరోగా నిఖిల్ మాత్రమే న్యాయం చేయగలడని సెలెక్ట్ చేసుకున్నాను. గౌతమ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఓ డెప్త్, సోల్, స్ట్రాంగ్ సెంటిమెంట్ ఈ సినిమాలో ఉంటుంది. ఇందులో పని చేసిన ప్రతి ఆర్టిస్ట్ కు నా థాంక్స్.. అని చెప్పారు.
నిఖిల్ మాట్లాడుతూ.. ఈ వేడుకను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్. కె.విశ్వనాథ్ గారు మా సినిమాను బ్లెస్ చేసినప్పుడే సినిమాపై పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయింది. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. నవంబర్ లో సినిమా రిలీజ్ కానుంది.. అని చెప్పారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. కోన వెంకట్ నాకు బ్రదర్, వెల్ విషర్. తను ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాడు. పోస్టర్స్ తో సినిమా చూడాలనే ఇంటరెస్ట్ క్రియేట్ చేసాడు. కోన కు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అలానే ఉదయ్ కు ఈ సినిమాతో మంచి కెరీర్ ఉండాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
బాబీ మాట్లాడుతూ.. కోన గారు ఈ సినిమా కథ చెప్పగానే డైరెక్టర్ కన్ఫర్మ్ అయ్యారా.. అనడిగాను. అవ్వకపోతే నా ఫ్రెండ్స్ ను ఎవరినైనా సజెస్ట్ చేద్దామనుకున్నాను. కాని ఉదయ్ గారు చేస్తున్నారని తెలిసింది. పదిహేను సంవత్సరాలుగా ఉదయ్ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నారు. ఈ సినిమాతో ఆయనకు మంచి సక్సెస్ రావాలి. సాంగ్స్ బావున్నాయి. ఈ సినిమా టీజర్ పవన్ కళ్యాన్ గారు రిలీజ్ చేసినరోజునే సినిమా హిట్ అని తెలిసింది.. అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ.. శంకరాభరణం టైటిల్ వినగానే మంచి సినిమా చేస్తున్నారని అర్ధమయింది. టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. పాత శంకారాభరణం లానే ఈ శంకరాభరణం కూడా పెద్ద హిట్ కావాలి. నా ఫేవరేట్ కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు.. అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉదయ్ నందనవనం, ప్రవీణ్, సంపత్, రావు రమేష్, దీక్ష పంత్, అనిల్ సుంకర, జీవిత రాజశేఖర్, పృథ్వి, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.