మధ మూవీ రివ్యూ
on Mar 13, 2020
నటీనటులు: రాహుల్ వెంకట్, త్రిష్ణా ముఖర్జీ, అనీష్ కురువిల్లా తదితరులు
ఎడిటింగ్: రంజిత్ టచ్ రివర్
మాటలు: ప్రశాంత్ సాగర్ అట్లూరి
సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్
సంగీతం: నరేష్ కుమరన్
నిర్మాత: ఇందిరా బసవ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీవిద్య బసవ
విడుదల తేదీ: 13 మార్చి 2020
ఒక పది, పదిహేను రోజుల ముందువరకూ 'మధ' గురించి తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులలో పెద్దగా ఎవరికీ తెలియదు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు వచ్చినప్పుడూ పెద్దగా ప్రచారం చేసుకోలేదు. థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పుడు ప్రచారం ప్రారంభించారు. హరీష్ శంకర్, నవదీప్ విడుదల విషయంలో సహకరించడంతో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి, సినిమా ఎలా ఉంది?
కథ:
నిషా (త్రిష్ణా ముఖర్జీ) మూడేళ్ల వయసులో తల్లితండ్రుల్ని, తన వాళ్లు అందర్నీ కోల్పోతుంది. అనాథ ఆశ్రమంలో పెరుగుతుంది. ఒక యాడ్ ఏజెన్సీలో పని చేస్తున్న నిషాకు, ఓ పార్టీలో అర్జున్ (రాహుల్ వెంకట్) పరిచయం అవుతాడు. మెల్లగా అతడితో ప్రేమలో పడుతుంది. కొన్ని రోజులకు తనకో సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా చేసే అవకాశం వచ్చిందనీ, పదిహేను అవుట్‌డోర్‌కి వెళ్లాలని అతడు చెబుతాడు. ఆ పదిహేను రోజులూ అర్జున్ ఫోనులో కూడా అందుబాటులో ఉండడు. ఓ వైపు అతడికి ఏమైందోననే ఆందోళన, మరోవైపు అనుకోని ఘటనలు జరుగుతాయి. నిషాకి పిచ్చి పట్టిందని ఆమెను ఒక మానసిక రోగుల ఆశ్రమంలో చేరుస్తారు. నిషాకి పిచ్చి లేకున్నా ఆమెకు ఉందని ఎందుకు ముద్ర వేశారు? ఆ పదిహేను రోజులూ నిషాని నీడలా అర్జున్ ఎందుకు వెంటాడాడు? 1992లో కొందరి చిన్నారుల మరణానికి కారణమైన మెడికల్ సైంటిస్ట్ రవి వర్మ (అనీష్ కురువిల్లా)కి, నిషాకి సంబంధం ఏంటి? తదితర ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూస్తే తెలుస్తుంది.
విశ్లేషణ:
థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టరీ డ్రామా 'మధ'. థ్రిల్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ... ప్రథమార్థం అంతా మిస్టరీ కొనసాగింది. దర్శకురాలు శ్రీవిద్య పలు చిక్కుముళ్లు వేసుకుంటూ వెళ్లారు. అమ్మాయిని టార్గెట్ చేసి మరీ హీరో ఎందుకు దగ్గరయ్యాడు? ప్రేమలో పడేశాడు? అనేది సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుడి మదిని తొలిచే ప్రశ్న. అక్కడి నుండి పలు ప్రశ్నలు ప్రేక్షకుడిలో కలుగుతాయి. అందుకని, విశ్రాంతి వరకు అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సోసోగా ఉన్నపటికీ, కథనం గజిబిజిగా ఉన్నప్పటికీ... సినిమా పాస్ అయిపోతుంది.
ద్వితీయార్థంలో దర్శకురాలు చిక్కుముళ్లు విప్పుకుంటూ వెళుతుంటే సినిమాలో బలం తగ్గుతూ వెళ్లింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'భాగమతి' గుర్తుకు వస్తుంది. కొందరికైనా సరే! 'మధ', 'భాగమతి' నేపథ్యాలు వేరు. పాత్రలు, సన్నివేశాలు వేరు. మొత్తంగా చూస్తే... కథలో మలుపులు, కథా గమనం ఒకే విధంగా ఉన్నట్టు అనిపిస్తాయి. 'భాగమతి' చిత్రాన్ని మరో నేపథ్యంలో తీసినట్టు ఉంటుంది. సినిమాకు అదొక మైనస్ అయితే... ప్రేమకథ మరో మైనస్. పదిహేను రోజులు లవర్ ఫోనులో కూడా అందుబాటులో లేడని అమ్మాయి అంతగా మథనపడుతుంటే... ప్రేమకథ ఎంత గొప్పగా ఉండాలి? అటువంటి ప్రేమకథను ఒక్క పాటలో కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు. ప్రథమార్థంలో ఒక పక్క హీరోయిన్ ట్రాక్, మరోపక్క ఎక్కడో మారుమూల భవంతిలో 'ఆపరేషన్ బ్రహ్మ' జన్యు ప్రయోగం, మరో పక్క సైకలాజికల్ క్లాసులు... ఏదో ఎక్కడ? ఎప్పుడు? ఏ సమయంలో జరుగుతుందో తెలియకుండా కథనం సాగింది. కానీ, మిస్టరీ మాత్రం కంటిన్యూ అయింది. దర్శకురాలి ఊహకు సంగీత దర్శకుడు నరేష్ కుమరన్, సినిమాటోగ్రాఫర్ అభిరాజ్ నాయర్ ప్రాణం పోశారు. లైటింగ్, ఫ్రేమింగ్ ప్రేక్షకుడిని ఒక మూడ్ లోకి తీసుకువెళతాయి. నేపథ్య సంగీతంతో ఏదో జరుగుతుందనే భ్రమను నరేష్ కుమరన్ కలగజేశారు. కొన్నిచోట్ల రీరికార్డింగ్ మరీ లౌడ్ అయింది. ప్రేమకథలో వచ్చే పాట బావుంది.
ప్లస్ పాయింట్స్:
ఛాయాగ్రహణం
నేపథ్య సంగీతం
దర్శకత్వం
నటీనటుల ప్రతిభ
మైనస్ పాయింట్స్:
ద్వితీయార్థం
గజిబిజి కథనం
'భాగమతి'తో పోలికలు
లవ్ ట్రాక్
నటీనటుల పనితీరు: కథలో పాత్రలు మాత్రమే కనిపించేలా త్రిష్ణా ముఖర్జీ, రాహుల్ వెంకట్ నటించారు. ఇంతకు ముందు 'అలియాస్ జానకి'లో హీరోగా నటించిన రాహుల్ వెంకట్, ఈ సినిమాలో పాత్రకు అవసరమైన కన్నింగ్‌నెస్ ఫేస్‌లో చూపించాడు. క్యారెక్టర్‌కి సెట్ అయ్యాడు. పిచ్చి లేకున్నా, ఉందని ఆశ్రమంలో పడేస్తే... అమ్మాయి వేదన ఎలా ఉంటుందో తన నటనతో త్రిష్ణా ముఖర్జీ చూపించింది. అంతకు ముందు సన్నివేశాల్లో పర్వాలేదనిపిస్తుంది. పాత్రకు అవసరమైన రూపంలో అనీష్ కురువిల్లా ఉన్నారు. మిగతా నటీనటుల్లో గుర్తుండే పాత్రలు ఎవరూ చేయలేదు. చోటా మోటా ఆర్టిస్టులు పాత్రలకు తగ్గట్టు నటించారు.
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: దర్శకురాలు శ్రీవిద్యకు ఇదే తొలి చిత్రం అయినప్పటికీ చక్కగా తీశారు. మంచి ప్రయత్నమిది. సాంకేతిక విభాగాల నుండి తనకు కావలసినది రాబట్టుకున్నారు. థ్రిల్లర్స్, మిస్టరీ డ్రామా సినిమాలను విపరీతంగా ఇష్టపడే ప్రేక్షకులు ఓ లుక్ వేయవచ్చు. సగటు ప్రేక్షకులు కొంచెం ఆలోచించుకుని థియేటర్లకు వెళ్లండి.
రేటింగ్: 2.5/5
Also Read