అనుష్కను రాఘవేంద్రరావు తొలిసారి ఎవరి గెస్ట్‌హౌస్‌లో చూశారంటే...
on Mar 13, 2020
అనుష్కను తొలిసారి చూడటమే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు ఒక అనుభవం. ఆయన ఆమెను తొలిసారి ఎక్కడ చూశారో తెలుసా? అక్కినేని నాగార్జున గెస్ట్‌హౌస్‌లో. అవును. ఈ విషయాన్ని రాఘవేంద్రరావే స్వయంగా తెలిపారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో జరిగిన అనుష్క 15 సంవత్సరాల యాక్టింగ్ కెరీర్ ఈవెంట్లో, "తొలిసారి స్వీటీని చూడటం ఒక ఎక్స్‌పీరియెన్స్. నేను 'శ్రీరామదాసు' సినిమా తీయాలనుకున్నప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్‌కు వెళ్లాను. ఆయన 'డైరెక్టర్‌గారూ సరైన టైమ్‌కు వచ్చారు. మీకో కొత్త హీరోయిన్ను చూపించాలి'.. అని చెప్పి, 'స్వీటీ' అని పిలిచాడు. బేస్మెంట్ నుంచి ఒకమ్మాయి మెట్లెక్కుతూ వచ్చింది. మొదట కళ్లు, తర్వాత ముఖం, ఆ తర్వాత మనిషి పైకి వచ్చి నిల్చుంది. అప్పుడు ఆమెతో.. 'నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావ్ స్వీటీ' అని చెప్పాను" అని అప్పటి ఉదంతాన్ని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.
"ఇవాళ నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఆరోజు అక్కడ ఎలాగైతే మెట్లెక్కి వచ్చావో, అలాగే బంగారు మెట్లెక్కుతూ కెరీర్లో ముందుకు వచ్చావు. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఫస్ట్ పిక్చర్ చేశావు. హీరోయిన్లను పూరి ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. 'సూపర్' అనిపించావ్. ఆ తర్వాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కోడి రామకృష్ణ కాంబినేషన్‌తో చేసిన 'అరుంధతి'తో నీకు గజకేసర యోగం పట్టింది. అప్పుడే ఏనుగును ఎక్కేశావ్. ఆ తర్వాత 'భాగమతి', గుణశేఖర్ సినిమా 'రుద్రమదేవి' చేసి, 'బాహుబలి'లో దేవసేనగా హంసవాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్లిపోయావ్. ఆ సినిమాలో 'ఊపిరి పీల్చుకో' అని నువ్వు చెప్పిన డైలాగ్‌తో దద్దరిల్లిపోయింది" అని ఆయన ఆనందపడుతూ చెప్పారు.
ప్రయత్నిస్తే సినిమాలు దొరుకుతాయనీ, కానీ అనుష్క విషయంలో క్యారెక్టర్లే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయని రాఘవేంద్రరావు అన్నారు. "ఈ జనరేషన్లోని మరే హీరోయిన్‌కీ ఆ అదృష్టం దక్కలేదు. నీ కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్లను పొందావు. 'అనుష్క చాలా మంచిది, అందుకే ఆ క్యారెక్టర్లు వచ్చాయి' అని అందరూ చెప్పే విషయమే. అందరినీ నీ కుటుంబంలా చూసుకుంటావ్. తెలుగులోనే కాకుండా తమిళనాడులో, కర్ణాటకలోనూ ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న నీ జన్మ ధన్యం. నీకూ, నాకూ దగ్గర పోలిక ఉంది. నన్ను మౌన ముని అని పిలిచేవారు. నువ్వు ఈ 'నిశ్శబ్దం' సినిమాతో మౌన మునికన్యకగా అయిపోతావ్" అన్నారు రాఘవేంద్రరావు.
కాగా ఆయన కుమారుడు, 'సైజ్ జీరో' మూవీ డైరెక్టర్ ప్రకాశ్ కోవెలమూడితో అనుష్క డేటింగ్ చేస్తోందనీ, ఈ ఏడాదే ఆ ఇద్దరూ పెళ్లాడనున్నారనీ విరివిగా ప్రచారమవుతున్న సమయంలోనే అనుష్క గురించి రాఘవేంద్రరావు ఇలా భావోద్వేగపూరితంగా మాట్లాడటం గమనార్హం.