క్షమించమని రాఘవేంద్రరావు కాళ్లకు దండం పెట్టిన పూరి
on Mar 13, 2020
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్షమాపణలు చెప్పారు. తనకు క్షమించమని ఆయన కాళ్లకు దండం పెట్టారు. ఈ సన్నివేశం అనుష్క 15 సంవత్సరాల కెరీర్ ఈవెంట్‌లో చోటు చేసుకుంది. అనుష్క గురించీ, ఆమె మంచితనం గురించీ, తనకూ ఆమెకూ ఉన్న పోలిక గురించీ మొదట రాఘవేంద్రరావు మాట్లాడారు. అప్పుడు తనంతట తాను మాట్లాడటానికి స్టేజి పైకి వచ్చిన పూరి జగన్నాథ్, "నేను 'సూపర్' సినిమా తీసేటప్పుడు, దానికీ, నా ఫస్ట్ సినిమాకీ క్లాప్ కొట్టి ఆశీర్వదించింది రాఘవేంద్రరావు గారే. అప్పుడు 'నీ పేరేంటయ్యా?' అని అడిగారు. 'నా పేరు జగన్ సార్' అన్నాను. 'ఈ గడ్డం ఉండేసరికి తమిళోడనుకున్నానయ్యా' అన్నారు. 'సార్.. మీకూ గడ్డం ఉంది, మేం అలా అనుకోవట్లేదు కదా' అన్నాను. 'నీకు వెటకారం ఎక్కువైంది' అని ఆయన తిట్టారు" అని అప్పటి ఘటనను గుర్తు చేసుకున్నారు.
"ఆ తర్వాత మళ్లీ 'సూపర్' సినిమా అప్పడు కలిశాం. 'ఎందుకొచ్చారు సార్?' అనడిగాను. 'నాగార్జున డేట్స్ కోసం వచ్చాను' అని ఆయన చెప్పారు. 'సార్.. నా చిన్నప్పుడెప్పుడో ఐదో క్లాసులో ఉన్నప్పుడు అడవిరాముడు సినిమా చూశాను. ఇప్పడు నాగార్జునగారి డేట్స్ ఎందుకు సార్. మీరు రిటైర్ అయిపోండి' అని అన్నాను.. నేనేదో యూత్, ఆయనేదో వెటరన్ లాగా. ఆయన నవ్వి, నా భుజంతట్టి, నాగార్జునగారి డేట్స్ తీసుకుపోయారు. అదే నాగార్జునగారితో నేను తుస్‌మని తీస్తే, ఆయన 'అన్నమయ్య' అనే బ్లాక్‌బస్టర్ తీశారు. నేను వాగిన వాగుడుకి అందరి ముందూ ఆయనకు సారీ చెప్తున్నా" అంటూ రాఘవేంద్రరావు పాదాలకు నమస్కరించాడు జగన్. రాఘవేంద్రరావు నవ్వుతూ అతనిని కౌగలించుకున్నారు. 'ఐ లవ్ యూ సార్' అని చెప్పి స్టేజి దిగిపోయాడు జగన్.
అయితే తన మాటల్లో ఒక తప్పు చెప్పాడు జగన్. అతను రాఘవేంద్రరావు 'అన్నమయ్య' అనే బ్లాక్‌బస్టర్ తీశారని చెప్పాడు. అందులో నిజం లేదు. 'అన్నమయ్య' మూవీ వచ్చింది 1997లో. జగన్ 'సూపర్' తీసింది 2005లో. నాగార్జున డేట్స్ కోసం రాఘవేంద్రరావు వచ్చింది 'శ్రీరామదాసు' సినిమా కోసం. ఆ సినిమా 2006లో వచ్చింది. అంటే 'శ్రీరామదాసు' పేరు చెప్పబోయి 'అన్నమయ్య' పేరు చెప్పాడు జగన్.