ఫటాఫట్.. పూరి
on Sep 28, 2015
పూరి జగన్నాథ్‌ని చూడండి... గడ్డం పెంచుకొని కాస్త రఫ్‌గా కనిపిస్తాడు.
అతని మాటలు వినండి... ఆధునికతకు కమర్షియల్ టచ్ ఇవ్వడం ఏంటో చూపిస్తాడు.
కనిపించింది, వినిపించిందీ కొంతే.. లోపలున్న పూరి అలాంటిలాంటోడు కాదు. అంతకు పదింతలో, వందింతలో. నిజంగా నిజమైన పూరి బయటకొస్తే తట్టుకోలేరు!
నిజం.. పూరి ఫటాఫట్‌లాంటోడు. అతని సినిమాలూ, మాటలు, జీవితం అంతా అలానే ఉంటాయ్.
కథ గురించి నెలల తరబడి ఆలోచించి, స్ర్కిప్టుపై సంవత్సరాల తరబడి కూర్చుకొని, యేళ్లకు యేళ్లు సినిమా తీయడం అతనికి బొత్తిగా నచ్చదు. పాయింట్ అనుకొన్నమా.. బ్యాంకాక్ వెళ్లి వారంలో రాసుకొచ్చామా, నెల రోజుల్లో తీసేశామా.. అంతే! చాంతాడంత డైలాగులు రాసుకొని, అందులో సెంటిమెంట్ బలవంతంగా ఇరికించి, భారీ ఎమోషన్ పండించడం చేత కాదు. ఓ నిజాన్ని వెండి తెరపై కథగా అల్లడం మాత్రమే తనకు తెలుసు. హీరో పాత్రలో మాత్రమే ఫాంటసీ ఉంటుంది. అతని చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం వాస్తవితకు కిలో మీటరు దగ్గరలో ఉంటుంది. తనలోని స్పీడు సినిమాలోనూ కనిపిస్తుంది. హీరో... హీరోలకే హీరోలా కనిపిస్తాడు. మాటలు బుల్లెట్ల వేగం తలపిస్తాయ్. చేతలు.. ఇక చెప్పక్కర్లెద్దు. రన్ వే పై దూసుకొచ్చే విమానంలా రయ్ మంటుంటాయ్.
చూస్తుండగానే పూరి పాతిక సినిమాలు తీసేశాడు.
మీరింకా చూస్తామంటే మరో పాతిక అవలీలలా ఊదేస్తాడు.
తనకింకా సినిమాలపై ఇదే పిచ్చి ఉంటే.. సెంచరీ చేసినా చేస్తాడు.
ఎందుకంటే తను పూరి.. ఫటాఫట్ పూరి!
ఒకప్పటి గొప్ప దర్శకులంతా సినిమా పిచ్చోళ్లే. వాళ్లకు సినిమా తప్ప మరో లోకం లేదు. వ్యక్తిగత జీవితాల్ని పట్టించుకొన్నారా అన్నదీ అనుమానమే. కానీ పూరి అలా కాదు. సినిమాకి 12 గంటలు, తన కోసం మరో 12 గంటలూ అన్నట్టుంటుంది పూరి వ్యవహారం.తన కోసం తాను బతకడం అంటే ఏమిటో పూరికి బాగా తెలుసు. ఏ పనిలో కిక్కు వస్తుందో ఇంకా బాగా తెలుసు. ఆ కిక్ కోసం పరితపిస్తుంటాడు పూరి.
పుస్తకంతో కిక్ వస్తుందనుకొంటే.. ఆ పుస్తకమే ప్రపంచంగా బతుకుతాడు పూరి.
ప్రపంచమే కిక్ అనుకొంటే... ఓసారి అలా చుట్టొచ్చేస్తాడు పూరి.
తనకు తానే కిక్ అనుకొంటే... ఒంటరిగా ఉంటూ ఆస్వాదిస్తాడు పూరి.
హైదరాబాద్‌లోని పూరి జగన్నాథ్ ఆపీసులోకి అడుగుపెట్టండి. ఓ హాలీవుడ్ స్టూడియోలోని ఫ్లోర్ చూసినంత అనుభూతి కలుగుతుంది. తన టేస్ట్ కి తగ్గట్టు రిచ్‌గా ఆఫీసుని తీర్చిదిద్దుకొన్నాడు పూరి. అంతా కాదంటే.. పొద్దస్తమానం సినిమాల్లోనే మమేకమై గడిపేస్తుంటాడు.
పడడం, మళ్లీ లేవడం పూరికి అలవాటు. డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు, తన ఫాలోయింగ్ ఏమిటో తనకు తెలుసు. మళ్లీ హిట్ కొట్టినప్పుడు నిర్మాతల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే హిట్టయినా, ఫ్లాప్ అయినా సినిమా తీయడంలో ఉన్న కిక్ ఆస్వాదిస్తుంటాడు పూరి. అందుకే సినిమాల మీద సినిమాలు తీసుకొంటూ వెళ్తుంటాడు.
వరుసగా హిట్లిచ్చుకొంటూ పోతే పూరిని నిర్మాతలు వదలరు.
వరుసగా ఫ్లాపులిచ్చినా పూరి సినిమాల్ని వదలడు.
ఎందుకంటే... నేనింతేలో డైలాగ్ గుర్తుంది కదా?
హిట్టొచ్చిందని సినిమాలు తీయడం మానేస్తామా, ఫ్లాప్ వస్తే ఆపేస్తామా అన్నట్టు..పూరి స్పీడు ఇలానే కొనసాగుతుంది. యాభై దాటి.. వంద వరకూ... తధాస్తు.
(ఈరోజు పూరి జన్మదినం సందర్భంగా)