అలనాటి నటిమణి రాజశ్రీ నగలు చోరీ..!
on Apr 14, 2016
ఎన్టీఆర్, కాంతారావు లాంటి వారి సరసన ఎన్నో సినిమాల్లో రాజకుమారిగా మెప్పించిన నటీమణి రాజశ్రీ. ప్రస్తుతం ప్రశాంతంగా చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్న 71 ఏళ్ల రాజశ్రీ నగలు చోరీకి గురయ్యాయి. మంగళవారం, తన కొడుకుతో కలిసి బ్యాంకు లాకర్లో ఉంచిన ఆభరణాలను తీసుకుని వస్తుండగా ఈ చోరీ జరిగింది. కారులో కూర్చుని కొడుకు రాక కోసం చూస్తున్న రాజశ్రీని ఒక వ్యక్తి, కారు దగ్గర డబ్బు నోట్లు పడేసి మీవేనా చూసుకోండి అని అడిగాడట. వాటిని చూడటానికి ఆమె కారు దిగగానే, నగల బ్యాగును అపహరించుకుని దుండగుడు, కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్న వ్యక్తితో కలిసి బైక్ పై పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ నగల విలువ 15 లక్షల వరకూ ఉంటుందని సమాచారం. అపహరించిన వ్యక్తి ముఖాన్ని బ్యాంకు దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజశ్రీ రాజకుమారి పాత్రల్లో చాలా తెలుగు సినిమాల్లో మెప్పించారు. కేవలం తెలుగే కాక, తమిళ మళయాళ సినిమాల్లో కూడా లెక్కలేనన్ని పాత్రలు వేశారామె. మనుషులు మమతలు, మహామంత్రి తిమ్మరుసు, ఆరాధన, దానవీరశూరకర్ణ, అల్లూరి సీతారామరాజు లాంటి అనేక సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు.