Home » కథలు » పిసినారి పుల్లయ్యFacebook Twitter Google
పిసినారి పుల్లయ్య

పిసినారి పుల్లయ్య

 

 

ఒక ఊళ్లో ఓ పిసినారి పుల్లయ్య ఉండేవాడు. అతను ఎవ్వరికీ ఏదీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ 'ఎట్లా పైసలు మిగల బెట్టాలా' అనే ఆలోచించేవాడు. అతని పిసినారితనం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. అట్లాంటి పిసినారి పుల్లయ్య కూడా సంవత్సరానికి ఒకసారి పండగరోజున దేవుడికి ఒక టెంకాయ కొట్టేవాడు. ఒకసారి అట్లాంటి పండుగ వచ్చింది. టెంకాయ కావాలి. పుల్లయ్య తమ ఊళ్ళోని దుకాణానికి వెళ్ళి "టెంకాయ ఎంత?" అని అడిగాడు. "నాలుగు రూపాయలు" అన్నాడు దుకాణదారు. "మూడు రూపాయలకు ఇస్తావా?" అడిగాడు పుల్లయ్య. పుల్లయ్య తత్వం తెలిసిన దుకాణదారు నవ్వాడు. "మన ఊళ్ళో అంతటా నాలుగు రూపాయలేనయ్యా! ప్రక్క ఊర్లో మూడు రూపాయలకు దొరకచ్చు చూడు" అన్నాడు. పుల్లయ్యకు ఆ ఆలోచన నచ్చింది. తను నడుచుకుంటూ ప్రక్క ఊరికి వెళ్ళాడు- "టెంకాయ ఎంత?" అంటే అక్కడి దుకాణదారు "మూడు రూపాయలు" అన్నాడు. "రెండు రూపాయలకు ఇచ్చెయ్యరాదూ?" అన్నాడు పుల్లయ్య, అలవాటుగా.

దుకాణంవాడు పుల్లయ్యకేసి వింతగా చూస్తూ-"ఆ ధరకి ఇక్కడ రాదు- మూడు ఊళ్ళ అవతల రామాపురంలో ఉంది ఆ రేటు" అన్నాడు. పుల్లయ్యకు డబ్బులు ఎక్కువ పెట్టేందుకు మనసు రాలేదు. రామాపురం బయలు దేరాడు. తీరా రామాపురం చేరే సరికి మధ్యాహ్నం దాటింది. "రెండు రూపాయలకు ఒక టెంకాయ!" అరుస్తున్నారు అక్కడి వ్యాపారులు. పుల్లయ్య వాళ్ల దగ్గరికి వెళ్ళి- "ఒక రూపాయికి ఇవ్వరాదూ?" అని అడిగేశాడు."నువ్వెవరో పిసినారి పుల్లయ్యలాగే ఉన్నావే!? ఇంతకంటే‌ తక్కువ ధరకి కావాలంటే లక్ష్మీపురం తోటకి పోవాల్సిందే" అన్నారు వాళ్ళు. పుల్లయ్య అక్కడి నదిని దాటి, సాయంత్రంకల్లా లక్ష్మీపురానికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న తోటకు చేరుకున్నాడు. అతను అక్కడికి వెళ్ళేసరికి తోట యజమాని క్రింద నిలబడి ఉన్నాడు. పనివాళ్ళు చెట్లెక్కి కొబ్బరికాయలు కోసి, క్రింద కుప్ప చేస్తున్నారు. 

"ఒక రూపాయికొక కొబ్బరికాయట కదా, మీ దగ్గర?" అడిగాడు పుల్లయ్య. "అవును-మీకు ఎన్ని కావాలి?" అడిగాడు తోట యజమాని. "ఊరికే ఇవ్వచ్చుకదా, ఒక కొబ్బరికాయకు ఒక రూపాయా, మరీ దురాశ కాకపోతే?!" అన్నాడు పుల్లయ్య. "మీదే ఊరు?" అని అడిగి తెలుసుకుని, "మీ ఊళ్ళో పుల్లయ్యగారని ఎవరో ఉన్నారటనే?" అన్నాడు తోట యజమాని. "నేనే ఆ పుల్లయ్యని!" అన్నాడు పుల్లయ్య, 'తన ఖ్యాతి ఇంత దూరం వ్యాపించిందే' అని సంతోషపడుతూ. తోటయజమాని నవ్వాడు. "ఓహో మీరేనన్నమాట! మీఅంతటివారు శ్రమపడి ఇంత దూరం నడిచి వచ్చారు; అందులోనూ దేవుడికి అంటున్నారు; ఊరికే కావాలంటున్నారుగా, చెట్టెక్కి కోసుకోండి ఎన్ని కావాలంటే అన్ని! క్రిందివి కావాలంటే మటుకు రూపాయికొకటి!" అన్నాడు.

పుల్లయ్యకు చెట్టు ఎక్కటం రాదు. అలాగని రూపాయి ఇచ్చి కొబ్బరికాయ కొనుక్కునేందుకు మనసొప్పలేదు కూడాను. "చెట్టెక్కుతాను-ఆమాత్రం‌ నేర్చుకోలేనా?" అనుకున్నాడు. చాలా శ్రమపడి, నిక్కుతూ నీల్గుతూ అంత పొడుగున్న కొబ్బరి చెట్టెక్కేశాడు పుల్లయ్య. ఆలోగా అతని కాళ్ళూ, చేతులూ గీసుకుపోయి రక్తం కారసాగింది. అయినా డబ్బు ఖర్చులేకుండా కొబ్బరి కాయ వచ్చేస్తుందన్న ఆశ అతన్ని చెట్టెక్కించింది. చెట్టెక్కాక పుల్లయ్యకు అనిపించింది- "ఒక్క కాయే ఎందుకు? ఓ బస్తాడు కోసుకుంటే పోలేదూ?" అని. అట్లా ఒక మూడు నాలుగు కాయలు కోసి పంచెలో వేసుకున్నాడు. ఆ హడావిడికో, మరి టెంకాయల బరువు మోయలేకనో, మరి- పుల్లయ్య పంచె కాస్తా జారిపోయింది! అయినా పట్టువదలని పుల్లయ్య చేతులు వదిలి పైన ఉన్న కొబ్బరి కాయను పట్టుకోబోతూ, ఒక్కసారిగా క్రిందికి చూశాడు- ఎప్పుడూ ఎక్కనంత ఎత్తు! అంత ఎత్తునుండి చూసేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయతనికి! అంత ఎత్తునుండి పట్టు తప్పి క్రిందపడిపోయిన పుల్లయ్యకు నడుం విరిగింది! అటుపైన డాక్టరు ఖర్చులు వంద రూపాయలు దాటాయి! 'గోటితో పోయేదానికి గొడ్డలి' అంటే ఇదేనేమో!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 


మంచి ఎండాకాలం ఎండ పెళపెళలాడుతోంది...
Mar 14, 2019
ఇంద్రప్రస్థాన్ని ఒకప్పుడు కీర్తివర్మ అనే రాజు పరిపాలించేవాడు...
Mar 13, 2019
రష్యన్ సైనికులు ముగ్గురు, ఎక్కడో కొండల్లో ఉన్న సైనిక శిబిరంలో‌ తమ పనులు ముగించుకుని...
Mar 9, 2019
తులసి
Mar 8, 2019
చీకటి పడిపోయింది. కాస్త భయంగానే ఉంది కౌసల్యకి ఆ చీకట్లో. వీధి దీపాలు వెలగట్లేదు. దానికి తోడు అమావాస్య. అసలు చిన్నప్పటినించీ భయస్తురాలే...
Mar 7, 2019
రాయల చెరువులో నివసించే లక్ష్మయ్య అదృష్టవంతుడు అనుకునేవాళ్ళు అందరూ.
Mar 4, 2019
వంగదేశాన్ని ఒకప్పుడు అనంగుడు అనే రాజు పరిపాలించే వాడు.
Feb 27, 2019
ఏడో తరగతి చదివే అఖిల్ చాలా తుంటరి పిల్లవాడు. చదువుల్లో మనసు అస్సలు నిలిచేది కాదు..
Feb 25, 2019
రెజిల్‌ దేశంలో ఒక కోటీశ్వరుడి దగ్గర ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన కారు ఒకటి ఉండేది...
Feb 22, 2019
అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ, మనుమడు ఉండేవాళ్ళు.
Jan 18, 2019
TeluguOne For Your Business
About TeluguOne