Facebook Twitter
నన్ను కాపాడిన పిల్లి

నన్ను కాపాడిన పిల్లి

 

 

ఒకరోజున మేం అందరం బంతి ఆట ఆడుతుంటే ఎవరో కొత్త పిల్లాడు ఒకడు కనిపించాడు. నేరుగా మా దగ్గరికి వచ్చి, అడిగాడు- "నేను కూడా మీతో ఆడచ్చా" అని.

 

వాడిని చూడగానే నాకు గుర్తొచ్చింది- ఆ రోజునే మా అక్క మాకో పని ఇచ్చింది: "చెప్పిన పదాలతో కథ రాయండి" అన్నది. ఇప్పుడు ఇంక "వీడి చేతే కథ చెప్పిద్దాం" అనుకున్నాను. 

 


"ఇదిగో, నువ్వు మాతో‌ ఆడుకోవచ్చు: అయితే ముందు నీ‌ కథ చెప్పాలి. ఆ కథలో 'సముద్రం, అమ్మమ్మ ఇల్లు, దొడ్డి కంపు, పిల్లి, నాగు పాము'- ఈ ఐదు సంగతులూ తప్పకుండా రావాలి" అన్నాను.  

 

వాడు ఏమాత్రం‌ ఆలోచించకుండానే చెప్పటం మొదలెట్టాడు:

"నేను ఇంకో దేశం నుంచి వచ్చాను. ఒక చిట్టి పడవలో సముద్రం దాటి వచ్చాను- విన్నారుగా, సముద్రం!" "సరే- సరే- ముందుకు పో!" అన్నాను నేను.

వాడు కొనసాగించాడు- "సముద్రం దాటి వచ్చాక, కొన్నాళ్ళ పాటు ఉండి పోదామని మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చాను. అర్థమైంది కదా, అమ్మమ్మ ఇల్లు!'" 

"సరిగ్గా ఆ సమయానికే వాళ్ల మరుగుదొడ్డికి ఉండే గొట్టం విరిగింది. ప్లంబరు వచ్చి మొత్తం కడిగి రిపేరు చేస్తున్నాడు. అక్కడ అంతా ఒకటే దొడ్డి కంపు! అర్థమైంది కదా, దొడ్డి కంపు!" ఆగాడు వాడు. "బలే ఉందిరా, నీ కథ- చెప్పు ఇంకా" అన్నాం. 

"ఇక్కడ, ఈ ఊళ్ళో మా పిన్ని ఉంటుంది. అందుకనే మేము ఇక్కడికి వచ్చాం. వచ్చీ రాగానే నాకు- ఉం..- ఒక పిల్లి కనిపించింది. అది కొంచెం కుంటే పిల్లి. అందుకని నాకు అది ఏమంత నచ్చలేదు. బాగా తరిమాను దాన్ని. అయినా అది నన్ను వదలక, నా చుట్టూనే తిరుగుతూ వచ్చింది" ఆపాడు వాడు. "ముందుకు పో!" అన్నాను నేను.  

"అయితే ఇందాక, మధ్యాహ్నం ఏం జరిగిందో మీరు ఊహించను కూడా ఊహించలేరు" అన్నాడు వాడు.

"ఏమైంది?" అన్నాం అందరం, ఉత్సాహంగా. 

"నేను తలుపు తీసుకొని తోటలోకి నడిచానా, అంతలోనే పిల్లి నా ముందుకి దూకి, కాళ్లకు అడ్డంగా తిరుగుతూ అరవటం మొదలెట్టింది. నేను దాన్ని అదిలిస్తూ కాళ్ళు ఇట్లా విసిరానో లేదో- 'బుస్' మని పెద్దగా శబ్దం! చూసే సరికి నా కాళ్ల ముందే ఓ‌ పెద్ద నాగు పాము! దాని మీదికి దూకి పోరాడుతూ ఆ కుంటి పిల్లి! ఒక్క అడుగు ముందుకు వేసినా ఆ పాము నన్ను కరిచేది; నేను ఇట్లా మీతో ఈ సంగతి చెప్పగలిగేవాణ్ణి కాదు!" అన్నాడు వాడు కథని ముగిస్తూ.

మేమందరం వాడి దగ్గరికెళ్ళి "నువ్వు బలే కథలు చెబుతావురా! నిజంగా జరిగినట్టే చెబుతావు!" అన్నాం.

"కాదు!‌ ఇది కథ కాదు- నిజం!" అన్నాడు వాడు. అది చెబుతుంటే వాడి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మేం‌ వాడిని ఓదార్చాం. ఆ తర్వాత అందరం కలిసి ఆడుకున్నాం...