కృష్ణా బోర్డు ఛైర్మన్ సన్నాసి: కేసీఆర్
posted on Nov 3, 2014 10:08AM
చిన్నా పెద్దా అంటూ భేదభావం లేకుండా అందర్నీ ‘సన్నాసి’ అని తిట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇప్పుడు కృష్ణా రివర్ బోర్డు ఛైర్మన్ కూడా ‘సన్నాసి’లా కనిపించారు. సర్లే, నరేంద్రమోడీనే సన్నాసిగా కనిపించిన కేసీఆర్‌కి ఇప్పుడు కృష్ణా బోర్డు ఛైర్మన్ సన్నాసిలా కనిపించడంలో పెద్ద వింతేమీ లేదు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై కృష్ణా జలాల యాజమాన్య బోర్డు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడుతూ బోర్డు చైర్మన్‌ను ‘సన్నాసి’ అంటూ తిట్టిపోశారు. మెడమీద తలకాయ ఉన్నవారెవరూ ఆ ఉత్తర్వులను హర్షించరని తెలిపారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ‘ఆ సన్నాసి.. కృష్ణా బోర్డు చైర్మన్ ఇచ్చిన తీర్పేంది..? మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క రోజు కంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేయొద్దా? ఏం తెలంగాణ పంటలు ఎండగొట్టాలని కంకణం కట్టుకున్నారా? మీ తాత, జేజమ్మ వచ్చినా ఎండగొట్టలేడు’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృష్ణా బోర్డు ఆదేశంపైన.. చైర్మన్‌మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.