ఏడాది పాలనలో కానరాని రేవంత్ ముద్ర!

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీని విజయపథంలో నడిపించి, విజయం తరువాత అధిష్ఠానం ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలకు దాదాపుగా చరమగీతం పాడేశారు. సీఎంగా ఆయనకు పార్టీ నుంచీ, మంత్రివర్గ సహచరుల నుంచీ సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సాధించిన అతి గొప్ప విజయాలలో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. చివరి క్షణం వరకూ ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ తో పోటీ పడిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేవంత్ కేబినెట్ లో కీలక పదవులలో ఉన్నారు. రేవంత్ నాయకత్వంలో వారు అరమరకలు లేకుండా పని చేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించి పని చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర కాంగ్రెస్ లో ఐకమత్యం కనిపిస్తోంది. ఇంతటి సానుకూల వాతావరణంలో రేవంత్ తనదైన దూకుడుతో పాలనలో తనదైన ముద్ర వేస్తారని అంతా భావించారు. 

అయితే తన ఏడాది పాలనలో రేవంత్ అటువంటి ముద్ర వేయడంలో విఫలమైనారన్నదే పరిశీలకుల విశ్లేషణ. రేవంత్ ఏడాది పాలనలో పెద్దగా ఘనతలు ఏమీ లేవని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయారు. 

అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూడా  ఆయన అడుగులు తడబడుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ పూర్తిగా సక్సెస్ కాలేదు.  కొన్ని పథకాలు ప్రారంభమయ్యాయి కానీ లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని, చాలా మంది ఇబ్బందులు పడ్డారని విమర్శలు వచ్చాయి. అలాగే ఎన్నికలకు ముందు దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం, అత్యంత ఖరీదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం నిరుపయోగంగా మారడం కూడా రేవంత్ పై విమర్శలకు తావిచ్చింది.

 ఇక మేడిగడ్డ, కాళేశ్వరంలు పూర్తిగా నిరుపయోగంగా మారడానికి, తద్వారా కేసీఆర్ ను బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వాటిని పక్కన పెట్టేయడమే కారణమన్న విమర్శలూ గట్టిగా వినిపిస్తున్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రికి, హైదరాబాద్‌కు మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పెట్టుబడుల ఆకర్షణ చాలా ముఖ్యమైనవి. ఆ దిశగా ముందుకు సాగాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులలో కొనసాగింపు ఉంది కానీ రేవంత్ రెడ్డి ముద్రను సూచించే కొత్త ప్రాజెక్టులు ఏవీ ఈ ఏడాది కాలంలో ప్రారంభం కాలేదు. ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కూడా లేవు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా రేవంత్ పాలనా పగ్గాలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో పెద్దగా కదలిక లేదు. 

ఇక పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఆ సినిమా హీరో అల్లు అర్జున్ పై కేసు, అరెస్టు విషయంలో రేవంత్ దూకుడుపై మిశ్రమ స్పందన వచ్చింది.   మొత్తం మీద 2024లో రేవంత్ పాలనలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.