‘కిస్ ఆఫ్‌ లవ్‌’... అరెస్టులు

 

కేరళలోని కొచ్చిలో వివాదాస్పద ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న వారిని, వారి మద్దతుదారులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొచ్చిలోని మెరైన్ డ్రైవ్ మైదానానికి ప్రదర్శనగా వెళ్తున్న వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. సుమారు 50మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి సమస్య తలెత్తినా ఎదుర్కొనేందుకు మైదానంలో, చుట్టుపక్కలా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ కార్యక్రమం గురించి మీడియాలో బాగా ప్రచారం కావడంతో ఈ కార్యక్రమాన్ని తిలకించాలనుకునే వారు, కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వారు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు శివసేన, కేరళ విద్యార్థి సంఘం జిల్లా శాఖ, ఇతర ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం వేర్వేరుగా ప్రదర్శనలు సాగాయి.