తెలంగాణ పంచాయతీ ఎన్నికల బరిలో తెలుగుదేశం?.. చంద్రబాబు వ్యూహమేంటి?
posted on Dec 31, 2024 2:12PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారింది. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డులు సృష్టించింది. జగన్ ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలూ పడిన జనం స్వచ్ఛందంగా తెలుగుదేశం సభ్యత్వం కోసం క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ గతంలో ఎన్నడూ లేనంత అధికంగా తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్పందన లభించింది. దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అంతగా పట్టు లేదని భావించే రాయలసీమ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలంగా మారింది. దీంతో ఆ పార్టీ అధినేత ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఆ రాష్ట్రంలో కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.
ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండీ సీఎం చంద్రబాబు తెలంగాణ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. తెలంగాణలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన లభించింది. వాస్తవానికి తెలంగాణలో పార్టీకి క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ బలం ఉంది. క్యాడర్ ఉంది. రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే దానిని క్రియాశీలంగా మార్చేందుకు అవసరమైన నాయకత్వం మాత్రం కరవైంది. రాష్ట్ర విభజన తరువాత పార్టీని నేతలు వీడికా క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందని పరిశీలకులు పలు సందర్భాలలో సోదాహరణగా విశ్లేషణలు చేశారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలుగుదేశం క్యాడర్ ది చాలా కీలకమైన పాత్ర అని పరిశీలకుల భావన.
ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా తెలంగాణపై దృష్టి సారించడంతో ఇంత కాలం వేరే వేరే పార్టీలలో ఉన్న నేతలు ఒకరి తరువాత ఒకరుగా తెలుగుదేశం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలు ఇప్పటికే బాహాటంగా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే మాజీ మంత్రి బాబూమోహన్ సైతం తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇక తాజా నివేదికల ప్రకారం, ఫిబ్రవరి నెలలో జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయడానికి సమాయత్తమౌతోంది. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, అటు పిమ్మట 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పోటీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందు కోసం త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనం గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మలతో చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కేడర్ బలంగా ఉందని, అయితే క్యాడర్ కు దిశానిర్దేశం చేసే నాయకత్వమే కరవనీ తేలింది. దీంతో ఆ కొరతను తీర్చేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని అంటున్నారు. ఇందు కోసం రాష్ట్ర విభజన తర్వాత వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీల పంచన చేరిన నాయకులను సొంత గూటికి చేరేందుకు తలుపులు బార్లా తెరిచినట్లు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. మాజీలంతా తెలుగుదేశం గూటికి చేరితే రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తథ్యమని అంటున్నారు.