కేసీఆర్ మౌనం.. ప్రభావం చూపని కేటీఆర్ నాయకత్వం.. జారుడుబండ మీద బీఆర్ఎస్!

తెలంగాణ సాధించిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2024 సంవత్సరం అత్యంత గడ్డుకాలంగా మిగిలిపోతుంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, ఆ తరువాత ఇప్పటి వరకూ కోలుకోలేదు సరికదా రోజు రోజుకూ దిగజారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినడానికి ప్రధాన కారణం ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోవడం, మరో వైపు ఆయన స్థానంలో పార్టీని ముందుండి నడిపిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎటువంటి ప్రభావం చూపలేకపోవడమేనని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరింత అధ్వానంగా పెర్ ఫార్మ చేసింది. ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ ఓటు బ్యాంకును కూడా భారీగా పోగొట్టుకుంది. కొన్ని స్థానాలలో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఇంత జరిగినా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగలేదు. అంతెందుకు ఆయన కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్టై చాలా రోజుల పాటు జైలులో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. పూర్తిగా తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ఈ కష్ట కాలంలో పార్టీని నడిపించిన కేటీఆర్ ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన ప్రకటనలు, ఆందోళనలు, విమర్శలు పెద్దగా ప్రజలను కదిలించలేదు.

ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో కూడా సఫలీకృతుడు కాలేకపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ఠ కోసమే ఈ ఫార్ములా రేస్ అంటూ చెప్పుకువచ్చిన కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము బదలాయింపు విషయంలో మాత్రం తన తప్పు లేదని అధికారులపై నెట్టేసి తప్పుకోవడానికి చూడటం పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రైతులను కదిలించడంలో విఫలమయ్యాయి. ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా కేసు నమోదు చేసి కేటీఆర్ కు నోటీసులు పంపింది. ఈ కేసులో ఫెమా, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, నిబంధనలను తుంగలో తొక్కి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వాహకులకు అక్రమ చెల్లింపులు జరిగాయనీ ఆధారాలు ఉన్నాయనీ ఈడీ చెబుతోంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని పార్టీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతోంది.