రేవంత్ ఎఫెక్ట్.. సోషల్ అవేర్ నెస్ వీడియోలు చేస్తున్న సినీ స్టార్స్!
posted on Jan 1, 2025 9:43AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్ కు తన స్థానం ఏమిటో చూపించారు. ఆయన దెబ్బకు స్టార్లు దిగి వచ్చారు. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుతో రాత్రికి రాత్రి సినిమాకు పెట్టిన ఖర్చంతా రాబట్టేసుకోవడమే వ్యాపారం అనుకుంటూ వస్తున్న టాలీవుడ్ స్టార్లకు సామాజిక బాధ్యత మరిస్తే సహించేది లేదన్న స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆయన దెబ్బకు టాలీవుడ్ పరిశ్రమ కాళ్లు నేల మీద ఆన్చింది. రేవంత్ రెడ్డి ఇలా చెప్పారో లేదో అలా ఇద్దరు స్టార్లు సోషల్ అవేర్ నెస్ కలిగేలా వీడియోలు చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
వారిలో ఒకరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ వీడియో చేశారు. దాదాపు 28 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ప్రభాస్ ప్రజలు, ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిసలు కావద్దంటూ పిలుపు నిచ్చారు.
మరో స్టార్ అప్ కమింగ్ హీరోయిన్ శ్రీ లీల. ఆమె కూడా దాదాపు 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయవద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. వ్యూస్, లైక్ ల కోసం మరొకరిపై బురద జల్లోదని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాన్ని సమాజానికి మేలు జరిగేందుకు మాత్రమే వినియోగించుకోవాలని, అందరూ సామాజిక బాధ్యతను అలవరచుకోవాలని శ్రీలీల తన వీడియోలో పిలుపునిచ్చారు.
ఇంత హఠాత్తుగా సీనీజనంలో పరివర్తన రావడానికి కారణం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు, సినీ ప్రముఖులు సమాజంలో అవేర్ నెస్ పెంచే దిశగా ప్రకటనలు చేయాలని ఇచ్చిన పిలుపే అనడంలో సందేహం లేదు. పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు సంధ్యా ధియేటర్లో ప్రీమియర్ షో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, అదే తొక్కిసలాటలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్ళి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత మధ్యంతర బెయిలుపై ఆయన బయటకు వచ్చారు అది వేరే సంగతి. ఈ ఘటనపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తాను సీఎంగా ఉన్నంతవరకు బెనిపిట్ షోలు, ప్రీమియర్ షోలుండవని, సినిమా టికెట్ల రేట్లు పెంపు కూడా ఉండదని ప్రకటించారు. రేవంత్ ప్రటకనతో సినిమాపరిశ్రమ ఒక్కసారిగా షేక్ అయిపోయింది.
ఆ తరువాత ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో కొందరు సినీ ప్రముఖులు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. రేవంత్ ను ప్రసన్నం చేసుకుని ప్రీమియర్ షోలు, టికెట్ల పెంపునకు అనుమతి ఇచ్చేలా ఆయనను ఇన్ ఫ్లుయెన్స్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగింది. అయితే ఆ భేటీలో సినీ ప్రముఖులు తాము కోరుకున్నది సాధించుకోలేకపోవడం అటుంచి, వారికి రేవంత్ గట్టిగా క్లాస్ పీకారు. టాలీవుడ్ స్టార్లకు సామాజికబాద్యత లేదా అని నిలదీశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ కు వ్యతిరేకంగా హీరోలు ఎందుకు నోరు విప్పటంలేదని ప్రశ్నించారు. డ్రగ్స్ కంట్రోల్ కు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సినీపరిశ్రమ మద్దతుగా నిలబడి తీరాలన్నారు. ఇందుకు భేటీలో పాల్గొన్న సినీ ప్రముఖులు అంగీకరించారు. ప్రభాస్, శ్రీలీలల సోషల్ అవేర్ నెస్ వీడియోలు దానికి ఫాలో అప్ గానే చూడాల్సి ఉంటుంది. ముందు ముందు మరింత మంది స్టార్ హీరోల నుంచి ఇటువంటి వీడియోలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఎటూ లేకుండా పోయింది. రేవంత్ ను మెప్పించి ఆ తరువాతైనా వీటిని సాధించుకోవాలన్న భావనతో టాలీవుడ్ పరిశ్రమ ఉందని అంటున్నారు.