కోర్టు దృష్టిలో ఆయన దోషి కానీ ప్రజల దృష్టిలో...

 

జీవితంలో అందరూ తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. కానీ వారిలో రామలింగ రాజులా పశ్చాతాపం చెంది, తన తప్పులను నిర్భయంగా ఒప్పుకొనేవారు ఎక్కడో గాని కనబడరు. ఆర్ధిక నేరాలకు పాల్పడినందుకు రామలింగ రాజును కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ళ జైలు శిక్ష, రూ.5 కోట్ల జరిమానా కూడా విధించి ఉండవచ్చును. కానీ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు దేశంలో అత్యంత నీతివంతుడయిన రాజకీయ నాయకుడు కూడా చేయలేడని ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

రామలింగ రాజు గత ఏడాది బెయిలుపై జైలు నుండి విడుదలయయి బయటకు వచ్చినప్పుడు, ఈ కేసుల నుండి ఏవిధంగా తప్పించుకొందామాని ఆలోచించలేదు. గతంలో తను ప్రవేశ పెట్టిన 108 ఉచిత అంబులెన్స్ సేవలను ఏవిధంగా మరింత విస్తరించాలా అని ఆలోచించారు. ఆ ఆలోచనలో నుండి పుట్టినదే ‘కాల్ హెల్త్’ సేవలు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఆయన ఇరువురు కుమారులు రామరాజు, తేజ రాజు ‘కాల్ హెల్త్ సర్వీసస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఉచిత విద్యసేవా సంస్థను స్థాపించారు.

 

హైదరాబాద్, జీడిమెట్ల వద్ద గల తమ బైర్రాజు ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంగా పనిచేసే ఈ సంస్థ ద్వారా జంట నగరాలలో మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూడా ద్విచక్ర త్రిచక్ర వాహనాల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సంస్థకు మరో రెండు కార్యాలయాలు ఒకటి ఫిలిం నగర్ వద్ద మరొకటి జూబిలీ హిల్స్ వద్ద ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సంస్థలో ఇప్పటికే సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంస్థ ఏర్పాటుకి, నిర్వహణకు సుమారు నెలకు ఒకటిన్నర కోట్లు వరకు రాజు సోదరులు తమ స్వంత నిధుల నుండి ఖర్చు చేస్తున్నారు. మరొకటి రెండు నెలలలో ఈ సంస్థ మొదటగా జంట నగరాలలో తన సేవా కార్యక్రమాలు ప్రారంభించబోతోంది. రామలింగ రాజుకి కోర్టు దోషిగా నిర్ధారించి జైలుకి పంపినా ఈ సేవా కార్యక్రమాలు ఆపబోమని ఆయన సన్నిహితులు చెపుతున్నారు.