బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ఇక సల్మాన్
posted on Oct 19, 2024 1:51PM
బెదరింపు కాల్స్ నేపథ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఖతం చేస్తామన్న బెదరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రూ.2కోట్లు విలువైన బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేశారు. గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ రూ. 5 కోట్లు ఇవ్వకుంటే ఖతం చేస్తామంటూ సల్మాన్ ఖాన్ కు బెదరింపులు పంపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సల్మాన్ తన భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఆయనకు భారీ స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఓ వైపు సినీమా షూటింగులున, మరో వైపు బిగ్ బాస్ షూటింగ్ తో యమా బిజీగా ఉన్నారు. వాస్తవానికి సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని తలపెడతామంటూ బెదరింపులు రావడం ఇదే తొలి సారి కాదు. కృష్ణజింకల కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను బెదరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకూ కొందరు ప్రయత్నించారు.
దీంతో సల్మాన్ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. తాజాగా మరోసారి చంపేస్తామని బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సల్మాన్ ఖాన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుగోలు చేశారు. ఆ కారు మరి కొద్ది రోజులలో దుబాయ్ నుంచి ముంబైకి చేరుకుంటుంది.