సజ్జల దారి జైలుకేనా?
posted on Oct 16, 2024 12:08PM
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముంబై విమానాశ్రయంలో సోమవారం ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విదేశాలకు పారిపోకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని భావించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఆయననున అక్కడే అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు రక్షణ ఉన్నందున ఆరెస్టు చేయవద్దంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సమాచారం పంపడంతో సజ్జలను అరెస్టు చేయలేదంటున్నారు. ఇంతకీ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఏ కేసులు జారీ చేశారన్నదానిపై క్లారిటీ లేదు.
మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుల జాబితాలో సజ్జల పేరు కూడా ఉంది. ఆ కేసును సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అధికారుల ఎప్పుడు పిలిస్తే అప్పుడు సజ్జల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోయారు.
సరే అదలా ఉంటే మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కంటే పెద్ద కేసులోనే ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకోవడంపై స్పందించిన సజ్జల తనపై అసలు కేసులే లేవు.. లుక్ ఔట్ నోటీసు ఎలా జారీ చేస్తారంటూ ప్రశ్నించడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. కేసులే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం సజ్జల కోర్టును ఎందుకు ఆశ్రయించారంటున్నారు.
ఇక ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మీడియాతో మాట్లాడుతూ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉందనీ, ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయనీ విస్ఫష్టంగా చెప్పారు. వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారు. ప్రతి కీలక నిర్ణయం వెనుక ఉన్నదీ సజ్జలేనని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు.
పార్టీలో, ప్రభుత్వంలో ఆయన నంబర్ 2గా వ్యవహరించారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పిదానికీ, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులకూ సజ్జలే మాస్టర్ మైండ్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో కూడా స్క్రిప్ట్ మొత్తం ఆయనదేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జలను పోలీసులు అరెస్టు చేసే రోజు ఎంతో దూరంలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు బుధవారం (అక్టోబర్16) నోటీసులు ఇచ్చారు. గురువారం(అక్టోబర్ 17) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.