ముందస్తుకు చంద్రబాబు సిద్ధమౌతున్నారా?
posted on Oct 19, 2024 11:40AM
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల ఉనికిని జమిలి ఎన్నికలు ప్రశ్నార్థకం చేస్తాయన్న ఆందోళన ఆయా పార్టీలలో వ్యక్తం అవుతోంది. బీజేపీ శాశ్వతంగా కేంద్రంలో అధికారంలో కొనసాగే వ్యూహంలో భాగంగానే.. జమిలి జపం చేస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పటికే జమిలికి సై అనేశాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం జమిలికి సై అనడమే కాకుండా ఇప్పటి నుంచే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారా అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు, వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఇక జగన్ అయితే రెండేళ్లలోనే ఎన్నికలు వస్తే రాష్ట్రంలో అధికారాన్ని మళ్లీ అందుకోవచ్చన్న ఆశతో జమిలికి సై అనేశారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఐతే ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతో జమిలికి జై అనేసింది. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం జమిలి తథ్యమన్న ఉద్దేశంతో రెండేళ్లలోనే మళ్లీ ఎన్నికలను ఎదుర్కొన వలసి వస్తుందన్న భావనతో పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. మామూలుగా అయితే ఈ ఏడాది జూన్ లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి సర్కార్ కు 2029 వరకూ అంటే ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. కానీ జమిలి కనుక వస్తే ముందుగానే ఎన్నికలు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ప్రకారం 2026 లేదా 2027లో జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో మోడీ సర్కార్ ఉంది. అందుకోసం జమిలి బిల్లును ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనే ప్రవేశ పెట్టి ఉభయ సభల ఆమోదం పొందాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇందు కోసం రాజ్యంగ సవరణలకు సైతం రెడీ అవుతోంది.
బీహార్ లో అధికారంలో ఉన్న నితీష్ మాత్రం జమిలికి నో అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వినా ఎన్డీయే కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలూ జమిలికి రెడీ అంటున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అయితే ఈ విషయాన్ని అంటే ముందస్తు ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంటుందన్న సంగతిని అన్యాపదేశంగానైనా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు చెప్పేశారు. తాజాగా అంటే శుక్రవారం (అక్టోబర్ 18)న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మన టార్గెట్ 2029 కాదు 2026 అని కుండబద్దలు కొట్టేశారు. సమయం తక్కువ ఉంది.. హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అలా చెప్పడం ద్వారా జమిలి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామన్న సంగతిని చెప్పకనే చెప్పేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 100 రోజులలో సాధించిన విజయాలు, అమలు చేసిన వాగ్దానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. స్పష్టంగా 2026లోనే జమిలి ఎన్నికలు జరుగు తాయని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. అందుకు సన్నద్ధులు కావాలన్న విస్పష్ట సంకేతాన్ని అయితే ఇచ్చేశారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు 2027లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయానికే జమిలికి మోడీ సర్కార్ ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తున్నది.