జగన్ - లోకేశ్ యాత్రల ఆంతర్యం ఏమిటి?



ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వర్గాలు నారా లోకేశ్ చేస్తున్న పరామర్శ యాత్ర, జగన్ చేపట్టిన ప్రాజెక్టుల యాత్రల పై ఆసక్తిగా చూస్తున్నాయి. ఇద్దరూ ఒకేసారి  యాత్రలు చేపట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాయి.

 

చంద్రబాబు బాటలోనే నారా లోకేష్ కూడా పయనిస్తున్నారు. ఎలాగైతే చంద్రబాబునాయుడు కార్యకర్తల మనిషిగా పనిచేసి ఇంతటి స్థాయికి ఎదిగారో అలాగే నారా లోకేశ్ కూడా కార్యకర్తల మనిషిగా ఉండి ఎదగాలనుకుంటున్న విషయం అర్ధమవుతోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఓవరాక్షన్ చేయడంతో అతను పార్టీకి దూరమయ్యాడు. బాలకృష్ణ కూడా తన సినిమాలు, ఎమ్మెల్యే పదవితో బిజీగా ఉన్నారు. అందువల్ల బయటి ప్రచారాలలో ఎక్కువగా కనిపించని లోకేశ్ ఈ సమయంలో కార్యకర్తలు, పార్టీ నేతలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బలంతోనే తను 2019న జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవి చేపట్టాలనే చూస్తున్నారని అంటున్నారు. తను దీనిలో భాగంగానే ఆయన కడపజిల్లాలో పర్యటించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు నారా లోకేశ్ కు ఘన స్వాగతం అందించి, ప్రజల మనిషి అయిన చంద్రబాబులాగానే నారా లోకేశ్ కూడా కార్యకర్తలతో కలిసి పోతున్నందుకు చాలా సంతోషం వ్యక్త పరిచారు. తండ్రిలా చురుకైన మాటలు మాట్లాడుతూ, అప్పుడప్పుడు జగన్ పై చురకలు వేస్తుంటే కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలు వేశారు.

 

మరోవైపు ప్రజలలో తన ఉనికి తగ్గిపోతోందని జగన్ భయపడుతున్నాడో ఏమో ప్రాజెక్టుల యాత్ర పేరిట యాత్ర ప్రారంభించాడు. అప్పుడు రాజధాని భూముల మీద పేచీ పెట్టి, నానా రభన చేసి చంద్రబాబు ప్రభుత్వానికి జోరీగ లాగా తయారయిన జగన్ ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులంటూ వాటి మీద పడ్డాడు. పట్టిసీమ ప్రాజెక్టు మీద ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. పట్టిసీమ వద్దంటే ఒకవైపు రాయలసీమ ప్రజల నుండి వ్యతిరేకత, ప్రాజెక్టు కాంట్రాక్టర్ నుండి వ్యతిరేకత ఇలా కక్కలేక మింగలేక అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఉద్దేశ్యంతోనే ఏదో ఒక రకంగా జనాలను రెచ్చగొట్టి వారిలో తన ఉనికిని చాటుకోవడానికి చూస్తున్నాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

అయితే నారా లోకేశ్, జగన్ చేసే యాత్రలు రాజకీయ మైలేజ్ పెంచుకోవడానికే అని అందరికీ తెలుసు. రాజకీయం పరంగా ఎదగాలనుకునే వారు ప్రజలలోకి వెళ్లడం తప్పనిసరి. నారా లోకేశ్ రాజకీయ పరంగా ఎదగడానికి, ప్రజలలో మన్నన పొందడానికి చేస్తుంటే, జగన్ మాత్రం ప్రజలను రెచ్చగొట్టడానికే యాత్ర చేపట్టాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ యాత్ర చేయడం తప్పుకాదు కానీ.. ఇది సరైన సమయం కాదు. ఏదో వాళ్లు యాత్ర మొదలుపెట్టారు కదా అని నేను కూడా యాత్ర చేస్తా అన్నట్లు ఉంది జగన్ వ్యవహారం.