నాలుక్కరుచుకున్న న్యూయార్క్ టైమ్స్

 

భారతదేశం అంగారక గ్రహం మీదకి ఉపగ్రహాన్ని ప్రయోగించడం చాలా దేశాలకు కడుపు మండేట్టు చేసింది. మనం చేయలేని పని ఇండియా చేసేసిందే అనే మంట బాగా పెరిగింది. ముఖ్యంగా అమెరికా వాళ్ళకి ఈ మంట బాగా ఎక్కువ వున్నట్టుంది. అందుకే అమెరికా పత్రికలో వాళ్ళ కడుపుమంట కార్టూన్ రూపంలో కనిపించింది. భారతదేశ మంగళ్ యాన్ మీద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ వెకిలి కార్టూన్ ప్రచురించింది. ఎలైట్‌ స్పేస్‌ క్లబ్‌లో ఇద్దరు వ్యక్తులు కూర్చుని మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (మామ్) ద్వారా ఇండియా సాధించిన విజయం గురించి చదువుతూ వుంటారు. అదే సమయంలో ఓ భారతీయ రైతు తన ఆవుతో కలిసి ఎలైట్‌ స్పేస్‌ క్లబ్‌లో ప్రవేశించేందుకు తలుపు తడుతూ వుంటాడు. సింగపూర్‌కు చెందిన కార్టూనిస్ట్‌ హెంగ్‌ కిమ్‌సాంగ్‌  ఈ కార్టూన్ని గీశారు. అయితే ఈ కార్టూన్ భారతదేశాన్ని అవమానించేలా వుందని పలువురు ఇండియన్లు ఫిర్యాదు చేయడంతో న్యూయార్క్ టైమ్స్ పత్రిక యాజమాన్యం బిత్తరపోయి నాలుక కరుచుకుంది. వెంటనే పేజ్ ఎడిటర్ ఆండ్రూ రోసెంథాల్ భారతీయులను క్షమించాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు. తమకు ఇండియాని అవమానించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఇలాంటి పొరపాటు మరోసారి జరగదని హామీ ఇచ్చారు.