కేతిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు.. చెరువు భూమి ఆక్రమణపై నోటీసులు
posted on Apr 5, 2025 4:20PM

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువతీరిన తరువాత వైసీపీ హయాంలో ఇష్టారీతిగా చెలరేగిపోయిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ వరుసగా కేసుల్లోనూ, భూవివాదాల్లోనూ ఇరుక్కొంటున్నారు. తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు అధికారలు సిద్థమయ్యారు. చెరువులు ఆక్రమించి గుర్రాట కోట నిర్మించి తోట సాగు చేస్తున్నట్లు కేతిరెడ్డిపై గతంలో ఆరోపణలు వచ్చాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్మవరం శక్తివడియార్ చెరువును చెరపట్టిన కేతిరెడ్డి అక్రమాల నిగ్గును తేలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పడు అధికారులు కేతిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలపై దృష్టి సారించారు. ఆక్రమించిన చెరువు వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు కేతిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో చెరువు భూములను కేతిరెడ్డి ఆక్రమించి బినామీలుగా బంధువులు, అనుచరుల పేర్లతో రికార్డులు సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మవరం మండలంలోని శక్తివడియార్ చెరువు, దాని పరీవాహక ప్రాంత భూమికి సంబంధించి దశాబ్దాలనాటి రికార్డులను అధికారులు బయటకు తీస్తున్నారు.
చెరువు భూమి, అక్రమ నిర్మాణాలను నిగ్గు తేల్చడానికి రెవెన్యూ, చిన్ననీటి పారుదలశాఖ అధికారులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతికి నోటీసులు ఇచ్చారు. ఆక్రమిత భూములను బినామీ పేర్లతో రికార్డులు సృష్టించిన వైనంపై రికార్డులు వెలికితీసిన అధికారులు, బినామీదారులకు కూడా నోటీసులు ఇచ్చారు. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులు ఆక్రమిస్తున్నారని గత వైఎస్సార్సీపీలో ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని అధికారులు, ప్రభుత్వం మారగానే చెరువును ఆక్రమించారంటూ నోటీసులిచ్చారు.
చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్లో 7.90 ఎకరాలు, 910లో 2.50, సర్వే నెంబర్ 661-1లో 0.91 సెంట్లను ఆక్రమించారని గాలి వసుమతి, తదితరులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమిత భూమి వివరాలను సమగ్రంగా నోటీసులో చూపుతూ 20.61 ఎకరాల భూమిని వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. నోటీసులు నేరుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి చిరునామాకు పంపించారు. అయితే ఆ సమయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి ఇంట్లో లేకపోవడంతో, వెంకట్రామిరెడ్డి పీఏ ముకేష్ నోటీసులు తీసుకున్నారు. చెరువుతో పాటు చుట్టూ పరీవాహక ప్రాంతంలోని నీటిపారుదలశాఖతో పాటు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని నోటీసులో చూపించారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెరువును ఆక్రమించారని గతంలో జంగా రమేష్ అనే సామాజిక వేత్త అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా అప్పటి వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు.
అధికారుల అవినీతిని, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆక్రమణలను ఎండగడుతూ రమేష్ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. హరిత ట్రైబ్యునల్‌లో కేసు విషయాన్ని కూడా తహసీల్దార్ నోటీసులో పేర్కొన్నారు. గుర్రాలకోటను బద్దలు కొట్టి, భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు.