విడదల రజనీకి లభించని ఊరట.. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ వాయిదా
posted on Apr 5, 2025 6:33PM

మాజీ మంత్రి, చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీకి హైకోర్టులో ఊరట లభించలేదు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. స్టోన్ క్రషర్ యజమానిని బెదరించి వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజని, ఆమె మరిది గోపీనాథ్ లపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు.
వారి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం (పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణ వాయిదావ వేసింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. మాజీ మంత్రికి అరెస్టు నుంచి ఎటువంటి రక్షణా కల్పించలేదు. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీ పేరుతో తనను బెదిరించి, రూ.2.20కోట్లు అక్రమంగా వసూలు చేశారని పల్నాడుజిల్లా, యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్ క్రషర్స్ మేనేజింగ్ పార్ట్నర్ నల్లపనేని చలపతిరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎసిబి కేసు నమోదు చేసింది. కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విడదల రజని పీఏ దొడ్డా రామకృష్ణ దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారణ కూడా ఏప్రిల్ 8కే వాయిదా పడింది.