మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. భద్రాదిలో లొంగిపోయిన 86 మంది మావోలు
posted on Apr 5, 2025 6:59PM

చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఇటీవల తెలంగాణ జనగామకు చెందిన మావోయిస్టు అగ్రనేత అరుణక్క ఎన్ కౌంటర్ లో చనిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరిట వచ్చే మార్చి వరకు మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలనిస్తుంది. వందలాది మంది జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. చత్తీస్ గడ్ లో గత వారం 50 మంది మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. శనివారం (ఏప్రిల్ 5)న 86మంది మావోయిస్టులు భద్రాది మునుగుజిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఒక్కోరికి 25 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఐజి చంద్రశేఖరరెడ్డి మావోయిస్టులను ఒప్పించి జన జీవన స్రవంతిలో కలిసేలా చర్యలు తీసుకున్నారు. ఇంత భారీ సంఖ్యలో లొంగిపోవడం మావోయిస్టులకు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. లొంగిపోయిన వారంతా చత్తీస్ గడ్ వాసులే. మరో వైపు కేంద్ర హోంమంత్రి చత్తీస్ గడ్ పర్యటనలో ఉండగానే మావోయిస్టులు లొంగిపోవడం గమనార్హం.