23ఎకరాల్లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు?

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్ నుండి ఉద్యోగులను, ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకి తరలించబోతున్నందున అందుకు అవసరమయిన ఏర్పాట్లను చురుకుగా చేస్తోంది. విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భవనాలను అన్నిటినీ ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకొని, ఉన్నతాధికారుల కార్యాలయాలన్నిటినీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం విజయవాడ-గుంటూరు మధ్య హైవేని ఆనుకొని ఉన్న హరిహాంత్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 23ఎకరాలను స్వాధీనం చేసుకొని అందులో తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్దం అవుతోంది. అందుకోసం ఆ సంస్థ నుండి భూమిని స్వాధీనం చేసుకొంటూ ఒక జి.ఓ.జారీ చేసింది. అందుకు బదులుగా ఆ సంస్థకు నవులూరు వద్ద అంతే మొత్తం స్థలం కేటాయించబోతోంది.

 

ఉన్నతాధికారులు, మంత్రుల కార్యాలయాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణ, రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు అన్నీ ఇక్కడి నుండే చక్కబెట్టడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం కూడా అక్కడే నిర్మిస్తారో లేక వేరే చోట ఏర్పాటు చేస్తారో ఇంకా తెలియదు. ఒకవేళ సచివాలయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తే మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఇక్కడ నుండే పనిచేస్తారు కనుక అదే రాష్ట్రానికి ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంటుంది. త్వరలోనే అక్కడ తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ శాశ్విత భవనాలు కాకుండా ప్రీ-ఫ్యాబ్రికేటడ్ భవనాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా శాశ్విత రాజధానిలో భవనాలు సిద్దం కాగానే, ఈ తాత్కాలిక భవనాలను ఎటువంటి నష్టమూ లేకుండా తొలగించవచ్చును.