సింగపూర్ అనుభవం.. ఏపీలో అద్భుతం
posted on Apr 20, 2015 6:09PM
సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే తొలిదశ ప్లాన్ అందింది. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ జూన్ నాటికల్లా అందే అవకాశం వుంది. పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ అందిన తర్వాత ఏపీ ప్రభుత్వం ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణం పనులను ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో చాలామంది మనసులో వున్న ఒక సందేహానికి సమాధానం ఇవ్వాల్సి వుంది. అది... ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ ప్రభుత్వమే ఎందుకు చేయాలి?
ఆంధ్రప్రదేశ్ రాజధానిని సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సి.ఎల్.సి.) అనే సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సింగపూర్ నగరాన్ని ఈ సంస్థ చేసిన ప్లానింగ్ ప్రకారమే అభివృద్ధి చేశారు. ఇప్పుడున్న సింగపూర్ నగరం రూపొందడానికి యాభై సంవత్సరాల సుదీర్ఘ కాలం పట్టింది. ఒక్కో ఇటుకనూ పేర్చుకుంటూ ఇప్పుడున్న అద్భుత నగరాన్ని సీఎల్‌సి సంస్థ రూపొందించింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో ఈ సంస్థకున్న సుదీర్ఘ అనుభవాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వాన్ని సంప్రదించింది.
రాజధాని నిర్మాణం అంటే ఒక బృహత్కార్యం. ఆ కార్యాన్ని సాధించడంలో సిఎల్.సి. సంస్థ తీరే ప్రత్యేకం. నగరాలను ప్లాన్ చేయడంలో ఆ సంస్థ సాధించిన నైపుణ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడబోతోంది. ఏ నగరాన్నయినా ప్లాన్ చేసే సమయంలో ఈ సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏపీ రాజధానిని కూడా ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రూపకల్పన చేస్తోంది.
రాజధానిని మూడు దశల్లో అభివృద్ధి చేసుకునేలా ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. తొలిదశలో జరిగే అభివృద్ధికి కొనసాగింపుగానే రెండో దశ, మూడో దశలో జరిగే అభివృద్ధి వుంటుంది. ఏ దశలో జరిగే అభివృద్ధి అయినా మరో దశకు ఎలాంటి ఆటంకం కలిగించదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేసే ప్రాంతంలో వ్యవసాయం చాలా విస్తృతంగా జరుగుతోంది. భవిష్యత్తులో రాజధాని ఎంత అభివృద్ధి చెందినా వ్యవసాయ ప్రయోజనాలు దెబ్బతినకుండా వుండే విధంగానే ఈ సంస్థ తన మాస్టర్ ప్లాన్‌ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సంస్థ రాష్ట్రానికి పంపించిన తొలి విడత నమూనా ప్లాన్‌లోనే వ్యవసాయ భూములకు ఈ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టంగా అర్థమైంది. మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి.. సీఎల్‌సి సంస్థ అందించే పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ ‘ఆకుపచ్చగా’ ఉండబోతోందన్న అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి.