ఖిల్లా ఘనపూర్ పొలాల్లో వెయ్యేళ్ల గణపతి
posted on Dec 29, 2024 2:19PM
కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి
తరతరాల చరిత్రకు ఆలవాలమైన ఖిల్లా ఘన్ పూర్ పొలాల్లో వెయ్యేళ్ల నాటి సిద్ధి గణపతి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకులు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామ గ్రామాన గల వారసత్వ సంపదను గుర్తించి స్థానికులకు అవగాహన కల్పించి పరిరక్షించేందుకు దోహదపడే "ప్రిజర్వ్ హేరిటేజ్ ఫర్ పోస్టేరీటి" కార్యక్రమంలో భాగంగా, ఆయన ఆదివారం నాడు ఖిల్లా ఘనపురం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆ క్రమంలో ఘనపూర్ పట్టణానికి పశ్చిమంగా మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో గల ఒక పెద్ద గుండు పై ఐదు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో, రాతిని తొలచి మలచిన పెద్ద గణపతి విగ్రహాన్ని పరిశీలించారు. తలపై జటామకుటం, గజముఖం, ఎడమవైపుకు తిరిగిన తొండం, పై రెండు చేతుల్లో పరశు, పాశం, కింది రెండు చేతుల్లో విరిగిన దంతం, మోదకాలను, పొట్టపై నాగయజ్ఞోపవీతాన్ని ధరించి, లలితాసనంలో కూర్చుని ఉన్న, వనపర్తి జిల్లాలోని అతిపెద్దదైన ఈ గణపతి విగ్రహం క్రీ.శ. 11వ శతాబ్ది నాటి కందూరు చోళుల తొలి కాలపు ప్రతిమా లక్షణాన్ని తెలియజేస్తుందని శివనాగి రెడ్డి చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ విగ్రహాన్ని కాపాడుకోవాలని ఖిల్లా ఘనపూర్ కు చెందిన, వనపర్తి జిల్లా విశ్వహిందూ పరిషత్ సేవా ప్రముఖ బెస్త శ్రీనివాస్, ఆగారం ప్రకాష్, ఆగారం శేఖర్ రెడ్డి, ఎం.డి పాషాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పట్నం కృష్ణంరాజు పాల్గొన్నారని ఆయన చెప్పారు.