చంద్రబాబుపై బీబీసీ సంచలన కథనం
posted on Oct 28, 2015 1:36PM
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై జాతీయ అంతర్జాతీయ మీడియా సంచలన కథనాలు ప్రచురిస్తున్నాయి, అమరావతి భూకంప జోన్లో ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కీలక కథనాన్ని ఇవ్వగా ఇప్పుడు ఇంటర్నేషనల్ వెబ్ సైట్ బీబీసీ... ఆందోళన కలిగించే స్టోరీ ఇచ్చింది, అమరావతి పేరుతో చంద్రబాబు... పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, ఇది ప్రకృతి విపత్తు లాంటిదేనని అభిప్రాయపడింది.
రాజధాని కోసం ఇప్పటికే రైతుల నుంచి 33వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం... మరో 50వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరడంపై బీబీసీ పలు అనుమానాలు వ్యక్తంచేసింది. చంద్రబాబు చర్యలు పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, రాజధాని ప్రాంతంలో దాదాపు కోటి చెట్లను నరికివేయనున్నారని బీబీసీ తెలిపింది. అంతేకాదు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే రాజధాని నిర్మాణంపై ముందుకెళ్లడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తప్పుబట్టిందన్న విషయాన్ని గుర్తుచేసింది.
సింగపూర్ కంటే పది రెట్లు పెద్దదైన నగరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడాన్ని మరీ అత్యాశగా అభిప్రాయపడ్డ బీబీసీ... పోలీసులను ప్రయోగించి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తప్పుబట్టింది, అంతేకాదు రాజధాని గ్రామాల్లో రైతులు ఎవరూ గుమిగూడకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని రాసుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాకపోయినా... చంద్రబాబు అనుసరిస్తున్న పద్ధతులపై మాత్రం వ్యతిరేకత వస్తోందని బీబీసీ తెలిపింది.