పాట్నా ఎక్స్ ప్రెస్ లో రఘువీరా రెడ్డి హడావుడి
posted on Oct 27, 2015 3:58PM
“ఆర్నెల్లు గరిడిసాము నేర్చుకొని ఏమి సాధించేవురా కొడుకా? అంటే మూలనున్న ముసలమ్మను ఒక దెబ్బతో కైలాసానికి పంపించానమ్మా” అన్నాడుట వెనుకటికెవడో. అలాగే ఉంది ఈ ఫోటో చూస్తుంటే. ఇంతకీ ఏమిటా ఆ ఫోటో ఏమిటా కధా కమామిషు అంటే... ఈ కధకి బీహార్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అలాగని పూర్తిగా బీహార్ లో సాగదు. దానికి ఆంధ్రా బ్యాక్ డ్రాప్ కూడా ఉంది కానీ బీహార్ లో ఈ కధకి క్లైమక్స్ ఉంటుంది.
అదెలాగంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి 1.65 లక్షల కోట్లు నిధులు మంజూరు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. బీహార్ ప్రజలు అడక్కుండానే అంత డబ్బు ముట్టజెప్పడానికి ఆయన సిద్దపడుతున్నారు. కానీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన అనేక హామీలను వగైరాలు ఇవ్వడం లేదు. మొన్న అమరావతి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా, ప్యాకేజీల ఊసు ఎత్తకుండా వెళ్లి పోయారు.
ఇంతకు ముందు ఆంధ్రాలో ఎన్నికలలో గెలవడానికి హామీలు ఇచ్చినట్లే ఇప్పుడు బీహార్ ప్రజలకు కూడా మోడీ ఒట్టొట్టి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకోవాలని ప్రయతిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి భావిస్తున్నారు. అందుకే బీహార్ వెళ్లి అక్కడి ప్రజలకు మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏవిధంగా మోసపుచ్చారో వివరించాలనుకొన్నారు. కానీ మళ్ళీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని తీరా చేసి అంత దూరంవెళ్ళినా బీహారీ ప్రజలకు అర్ధమయ్యేలాగా ఈ విషయం వివరించగలమా లేదా? వివరించినా వాళ్ళు తమ మాటలను పట్టించుకొంటారా లేదా? అనే అనుమానం వచ్చింది. అందుకే సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా బీహార్ వెళ్ళే పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగినప్పుడు ఆ రైల్లో ప్రయాణిస్తున్న బీహారీ వాళ్ళను పట్టుకొని ఇదిగో..ఇలాగ...క్లాసు పీకుతున్నారు. పాపం ఆ ముసలమ్మ మొహం చూస్తే వాళ్ళు ఏమిచెపుతున్నారో..తనకే ఎందుకు చెపుతున్నారో..అన్నట్లుంది.