కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్న కాంట్రాక్ట్ కేసు?
posted on Oct 28, 2015 3:31PM
2006లో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ కాంట్రాక్టును... నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు కాకుండా ఏపీ ఫిషరీష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇచ్చిన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ... మరికొందరు ముఖ్యనేతలను, అధికారులను ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ... అప్పటి పీఎస్, ప్రస్తుతం బీజేపీ లీడరైన దిలీప్ కుమార్ ను కూడా ప్రశ్నించింది. అలాగే ఢిల్లీ తెలంగాణ భవన్ లో అధికార ప్రతినిధిగా ఉన్న సాహ్నిని కూడా సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది, ఎన్బీసీసీకి ఇవ్వాల్సిన కాంట్రాక్టును ఏపీ ఫిషరీష్ కి ఇవ్వడంలో అప్పుడు కేంద్ర కార్యదర్శిగా సాహ్ని కీలక పాత్ర పోషించారని అంటున్నారు.
నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు ఇచ్చిన ఈఎస్ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ కాంట్రాక్టును ఏపీ మత్స్యశాఖకు ఇవ్వాలని కేసీఆర్ కోరుకుంటున్నారని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన ప్రైవేట్ కార్యదర్శి దిలీప్‌కుమార్... ఆనాడు ఈఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ రావు ఇంద్రసింగ్‌కు లేఖ రాయగా, అందుకు ఇంద్రసింగ్ పలు అభ్యంతరాలు తెలుపుతూ కేఎం సాహ్నికి నివేదించారు. అయితే రావు ఇంద్రసింగ్ అభ్యంతరాలను తోసిపుచ్చి మరీ కేఎం సాహ్ని ప్రత్యేక ఫైల్‌ను తయారు చేశారని, దానిని కేసీఆర్ అనుమతి కోసం పంపగా ఆయన సంతకం చేశారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
అయితే కేసీఆర్ ఆదేశాల మేరకే ఎన్‌బీసీసీ తప్పించి ఏపీ మత్స్య శాఖకు కాంట్రాక్టు అప్పగించాలంటూ సాహ్ని ఫైల్‌ను తయారు చేశారని అంటున్నారు. ఈ కేసు విషయంలో దిలీప్‌కుమార్‌ను సీబీఐ ప్రశ్నించగా...కాంట్రాక్ట్‌ను ఎందుకు బదిలీ చేయాలనుకున్నారో కేసీఆర్‌నే అడిగి తెలుసుకోవాలని చెప్పారట, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీబీఐ కలవగా.... సాహ్ని ఫైల్ పంపితేనే సంతకం చేశానని, అంతేతప్ప కాంట్రాక్ట్ బదిలీతో తనకేమీ సంబంధం లేదని చెప్పారట, దాంతో ప్రస్తుతం ఢిల్లీ తెలంగాణ భవన్ లో అధికార ప్రతినిధిగా ఉన్న సాహ్నిని త్వరలో సీబీఐ ప్రశ్నించనుంది, అయితే 2006లో కేంద్ర కార్యదర్శిగా సాహ్నికి ఇప్పుడు ఢిల్లీ తెలంగాణలో కేసీఆర్ పదవి ఇవ్వడం చూస్తుంటే పలు సందేహాలు కలుగకమానదు.