సంజె పెదవుల ఎరుపు కడలి అంచుల విరిగి
సంజె పరికిణి చెరగు ఎడద లోతుల మెరసి
ఏటి కొంగుల నిదుర ఎర్రగా ప్రాకింది
బాతురెక్కల నీడ బరువుగా సోలింది
సంజ వెన్నెలచాలు స్వర్ణ స్వర్ణది ధాక
వయసు మైకపు జీర కరగు మబ్బుల తేల
గగనమొక రేకు
కన్నుగవ సోకు
* * *
---1941
ఈ రాత్రి
ఈ రాత్రి
బరువుగా బరువుగా
బ్రతుకు కీళ్ళ సందులలోన
చీకటి కరేల్మని కదిలింది
ఈ రాత్రి
నిలువునా నిలువునా
పరచుకుని అవనిగుండె నెరదలలోని
వింత బాధల విప్పి చూపింది
ఈ రాత్రి
మూగతో సైగతో
మేలుకొన్న నిరాశతో మాటలాడాను
* * *
---1941
పాడువోయిన ఊరు
అది అంతా యిసుక
చరిత్రలో ఒక మసక
ఇది నశించిన ఒక గ్రామం
విశ్వసించే ఒక శ్మశానం
ప్రాణంగల పాడే వేణువు లీ యిసుక రేణువులు
ఈ భూమికింద మేడలు మిద్దెలు కదిలే విచిత్ర శబ్ధం
ఈ గాలివాన పూర్వుల శరీరాల స్పర్శల శైతల్యం
గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర
వర్తమానం నీ కన్నుల గప్పిన ఒక పొర
కారిపోయే యిల్లులా జీవితం ఒరుగుతుంది
ఒక వెగటు ఏదో నన్నావరించుకుంది
కాలం పాడునుయ్యిలా నా కన్నులకు కనబడింది
* * *
---1941
ప్రవాస లేఖ
స్వాగతం:
పగటికి చితిపేర్చిన సంధ్యాజ్వాలలు మాలలుగా
నీ మెడలో---
వెన్నెలను మధించి తీసిన కరాళ గరళం నీ యెదలో
- అబ్బ, ఎంత శక్తి సంపాదించావోయీ!
అనుకున్నాను అప్పుడే! జీవితాల చక్రాల సీల ఊడి
పోతే, బ్రతుకు బురదలోపడి దొర్లుతుందని
అప్పుడు శాశ్వతత్వం పరిహసిస్తుందని
ఆనందానికి మేర విషాదమని నలుదెసలూ కల్సిన
చోట వ్రాయబడి ఉందిటగా!
