జీవిత సత్యాలు - ఈ యక్షప్రశ్నలు!
పిల్లలు నిరంతంరం ఏవో ఒక ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటే వాటిని యక్షప్రశ్నలు అంటారు. మహాభారతంలోని అరణ్యపర్వంలో ఈ యక్షప్రశ్నల మూలం ఉంది. పాండవులు వనవాసంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకి సాయం చేయమని అడుగుతాడు. తన అరణి ఒక జింక కొమ్ముల మధ్య చిక్కుకుందని, ఆ జింక ఎటో పారిపోవడంతో యాగం చేసుకోలేకపోతున్నానని చెబుతాడు ఆ బ్రాహ్మణుడు. యాగంలో అగ్నిని ప్రజ్వలింపచేయడానికి వాడే పరికరమే `అరణి`. `ఓస్ అంతేకదా!` అనుకుంటారు పాండవులు. ఆ జింకను వెతికి తెచ్చేందుకు ధర్మరాజు, నకులుడిని పంపుతాడు. నకులుడు ఆ జింకను వెతుక్కుంటూ ఒక కొలను దగ్గరకు చేరుకుంటాడు.
కొలనుని చూడగానే నకులునికి ఎక్కడలేని దప్పికా వేస్తుంది. తీరా తన దోసిట్లోకి నీరు తీసుకోగానే `నకులా! ఈ నీటిని తాగాలంటే ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పు!` అన్న మాటలు వినిపిస్తాయి. `ఈ నీటిని తాగకుండా నన్ను అడ్డుకునే మొనగాడు ఎవడు!` అనుకున్న నకులుడు ఆ నీటిని తాగిన వెంటనే చనిపోతాడు. నకులుడు ఎంతసేపటికీ రాకపోవడంతో, సహదేవుని పంపిస్తాడు ధర్మరాజు. సహదేవునికీ అదే పరిస్థితి ఎదురవుతుంది. సహదేవుని తరువాత తమ వంతుగా బయల్దేరిని భీముడు, అర్జునులు కూడా ఆ మాటలను ఉపేక్షించి విగతజీవులుగా మారతారు.
తన తమ్ముళ్లను వెతుక్కుంటూ బయల్దేరిన ధర్మరాజుకి కొలను దగ్గర వారి శవాలు కనిపిస్తాయి. వారు యుద్ధంలో చనిపోయారనుకోవడానికి ఒంటి మీద గాయాలు కనిపించవు. పోనీ విషపూరితమైన నీరు తాగారనుకోవడానికి ఒంటి మీద విషఛాయలు లేవు. ముందు కాస్త దప్పిక తీర్చుకుని అసలు ఏం జరిగిందో విచారిద్దామనుకుని, తాను కూడా దోసిట్లోకి నీటిని తీసుకుంటాడు ధర్మరాజు. `ధర్మనందనా! నా హెచ్చరికను విస్మరించిన నీ తమ్ముళ్ల పరిస్థిని చూశావు కదా! నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీటిని తాగితే నీకు కూడా అదే గతి పడుతుంది` అన్న మాటలు వినిపించాయి. `మహానుభావా! నువ్వు అడగదల్చుకున్న ప్రశ్నలను అడుగు. నాకు తోచినంతవరకూ జవాబుని చెప్పేందుకు ప్రయత్నిస్తాను` అని బదులిస్తాడు ధర్మరాజు. అప్పుడు ఒక కొంగ ప్రత్యక్షమై `ధర్మరాజా నేను ఈ కొలనుని కాపాడే యక్షుడిని. నేను అడిగే ప్రశ్నలకు బదులిచ్చిన తరువాతే నీకు ఈ నీటిని తాగే అర్హత లభిస్తుంది` అంటూ కొన్ని ప్రశ్నలను సంధిస్తాడు.
యక్షప్రశ్నలు ఏవో ఒక్క అంశానికి చెందినవి కావు. వీటికి ధర్మరాజు చెప్పిన సమాధానాలు శుష్కమైనవీ కావు. ధర్మం, వ్యక్తి, వ్యక్తిత్వం, ఆధ్యాత్మికం... ఇలా మానవజీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎన్నో వీటిలో తారసపడతాయి. వాటిలో ముఖ్యమైనవి...
ప్రశ్న: సూర్యుడు ఎలా అస్తమిస్తున్నాడు?
జవాబు: సూర్యుడు ధర్మాన్ని అనుసరించి అస్తమిస్తున్నాడు. (మనిషికే కాదు ప్రకృతికి కూడా తనదైన ధర్మం ఉంటుందని దీని భావం)
ప్రశ్న: మనిషికి సాయం ఎవరు? అతను గొప్పవాడు ఎలా అవుతాడు?
జవాబు: మనిషికి అతని ధైర్యమే సాయం. పెద్దలను సేవించి, అనుసరించడం వల్ల అతను గొప్పవాడు అవుతాడు.
ప్రశ్న: బతికున్నా చనిపోయినవాడు ఎవరు?
జవాబు: తన చుట్టుపక్కలవారి బాగోగులను పట్టించుకోనివాడు, బతికున్నా చనిపోయినట్లే లెక్క!
ప్రశ్న: భూమికంటే బరువైనది ఏది? ఆకాశంకంటే ఉన్నతమైనది ఏది? గాలికంటే వేగంగా ప్రయాణించేది ఏది? గడ్డికంటే వేగంగా పెరిగేది ఏది?
జవాబు: భూమికంటే భారాన్ని మోయగలిగేది తల్లి. ఆకాశంకంటే ఉన్నతమైనవాడు తండ్రి. గాలికంటే వేగంగా ప్రయాణించేది మనస్సు. గడ్డికంటే వేగంగా పెరిగేది మనసులోని చింత.
ప్రశ్న: మనిషి దేన్ని వదిలిపెడితే అందరికీ ఆమోదయోగ్యుడు, దుఃఖం లేనివాడు, ధనవంతుడు, సుఖవంతునిగా మారతాడు?
జవాబు: మనిషి గర్వాన్ని వదిలిపెడితే అందరికీ ఆమోదయోగ్యంగా నిలుస్తాడు. కోపాన్ని వదిలితే దుఃఖం కలుగదు. ఉన్నదాంతో తృప్తిచెందేవాడు అసలైన ధనవంతుడు. అత్యాశని వదిలిపెడితే సుఖాన్ని పొందుతాడు.
ప్రశ్న: గొప్ప పురుషుడు ఎవరు? అధిక ధనవంతుడు ఎవరు?
జవాబు: చిరకాలం నిలిచిపోయే కీర్తిని సాధించినవాడు గొప్ప పురుషుడు. సుఖదుఖాలను; మంచిచెడులను; లాభనష్టాలను; గతాన్నీ, భవిష్యత్తునీ సమంగా చూడగలిగేవాడే అధిక ధనవంతుడు.
ఇలా 70కి పైగా ప్రశ్నలకు విచక్షణతో, వివేకంతో సమాధానాలు చెప్పి ఆ యక్షుడిని మెప్పించాడు ధర్మరాజు. వాటన్నింటికీ ఆ యక్షుడు సంతృప్తిపడి `ధర్మరాజా నీ మేథ అమోఘం. నీ సోదరులలాగా నా మాటను పెడచెవిన పెట్టకుండా నా ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధపడగానే నువ్వు సగం విజయాన్ని సాధించావు. నీ జవాబులకి తృప్తి చెంది నీ సోదరులలో ఎవరో ఒకరిని బతికించే అవకాశం కల్పిస్తే నువ్వు ఎవరిని ఎంచుకుంటావు.` అని అడగ్గానే ధర్మరాజు తడుముకోకుండా `యక్షుడా! దయచేసి నా తమ్ముడైన నకులుడిని జీవింపచేయి` అని కోరుకుంటాడు.
`అదేంటి రాజా! పరాక్రమవంతులైన భీమార్జునులను కాదని నువ్వు అందరిలోకీ చిన్నవాడు, మీ అందరిలోకీ సామాన్యుడైన నకులుడి ప్రాణాన్ని కోరుకుంటున్నావు` అని అడిగాడు యక్షుడు ఆశ్చర్యపోయి.
`యక్షా! నాతోపాటు, భీమార్జునులం కుంతీదేవి పుత్రులం. ఇక నకులసహదేవులు మాద్రి కుమారులు. నా సోదరుల పట్ల నా బాధ్యత ఎంతగా ఉందో, నా సవతి సోదరుల పట్ల కూడా అంతే బాధ్యత ఉంది. కుంతీదేవి తరఫున నేను జీవించి ఉన్నప్పుడు, నా సవతి తల్లి తరఫున కూడా ఒక వారసుడు మిగిలి ఉండాలి కదా!` అన్నాడు.
ఆ మాటలు వింటూనే యక్షుడు తన నిజరూపాన్ని పొందాడు. అతను ఎవరో కాదు! ధర్మరాజుని పరీక్షించేందుకు వచ్చిన యముడే! ధర్మరాజు అనుసరించిన నిబద్ధతనూ, నీతినీ మెచ్చుకుంటూ యముడు.... పాండవులందరూ తిరిగి జీవించేలా చేసి. వారిని ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు.
అదీ సంగతి. యక్షప్రశ్నలు అంటే కేవలం ఉబుసుపోని ప్రశ్నలు, ఊకదంపుడు జవాబులు కాదన్నమాట. వాటిని ఎదుర్కొనేందుకు ధర్మరాజు చూపిన దైర్యం, జవాబు చెప్పేందుకు అతను చూపించిన సమయస్ఫూర్తి, వాటికి బదులుగా వరాన్ని కోరుకోవడంలో అతను అనుసరించిన న్యాయం... అన్నీ ఈ ప్రశ్నలకు నేపథ్యంగా కనిపిస్తాయి. ఇక ఈ ప్రశ్నలకు ధర్మరాజు అందించిన జవాబులలో అయితే జీవిత సత్యాలే కనిపిస్తాయి.
- నిర్జర.