చిదంబరం దేవుడు తిరిగి వచ్చాడు
తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయం తరువాత భక్తులంతా శ్రద్ధగా దర్శించుకునే ఆలయం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కేవలం అరకిలోమీటరు దూరంలో ఉంది. గోవిందరాజ స్వామి, వేంకటేశ్వర స్వామివారికి అన్నగారు. ఆయన వేంకటేశ్వరునికీ, పద్మావతి అమ్మవారికి మధ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగేందుకు తోడ్పడ్డారట. వేంకటేశ్వరుడు తన కళ్యాణం కోసం కుబేరుని నుంచి అపారమైన ధనాన్ని రుణంగా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే! అలా పొందిన ధనరాశులను లెక్కించేందుకు, సంరక్షించేందుకు, సవ్యంగా వినియోగించేందుకు గోవిందరాజస్వామి బాధ్యత వహించారట. అందుకని లేని ఐశ్వర్యాన్ని పొందాలన్నా, ఉన్నదాన్ని పెంపొందించుకోవాలన్నా గోవిందరాజస్వామి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాదు! వేంకటేశ్వరుని కళ్యాణానికి ముల్లోకాలలోనూ ఉన్న దేవతలందరినీ ఆహ్వానించారట గోవిందరాజులవారు. అందుకని గౌరవనీయులైన వ్యక్తులతో స్నేహబంధాలు కోరుకునేవారికి కూడా ఆయన ఆశీస్సులు ఉపయుక్తంగా ఉంటాయని నమ్ముతారు.
ఆలయ చరిత్ర: ఒకప్పడు ఈ ఆలయంలో ముఖ్య ఇలవేల్పుగా శ్రీ పార్థసారథి స్వామివారు ఉండేవారు. 11వ శతాబ్దంలో చిదంబరంలో ఉన్న శ్రీగోవిందరాజస్వామి విగ్రహాన్ని ముష్కరుల నుంచి తప్పించేందుకు, ఈ ఆలయానికి తీసుకువచ్చారట. పరిస్థితులు చక్కబడిన తరువాత, ఆ విగ్రహాన్ని తిరిగి చిదంబరానికి తీసుకుని వెళ్లిపోయారు. ఒకనాడు రామానుజాచార్యులకి స్వామి స్వప్నంలో కనిపించి తాను ఫలానా చోట ఉన్నాననీ, తనని తిరుపతిలో ప్రతిష్ఠించమని కోరాడట. తనకు స్వప్నంలో కనిపించిన చోటుని గాలించిన రామానుజాచార్యులకి గోవిందరాజస్వామి స్వయంభువు విగ్రహం ఎదురైంది. ఆ విగ్రహాన్నే 1130వ సంవత్సరంలో ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. కుబేరుని నుంచి పొందిన అపార ధనరాశులను లెక్కపెట్టి అలసిపోయిన స్వామి, విశ్రాంతి తీసుకున్న భంగిమలో ఇక్కడ కనిపిస్తారు.
ఆలయ నిర్మాణం: ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎందరో రాజులు ఆసక్తి చూపించారన్నదానికి నిదర్శనంగా శాసనాలు కనిపిస్తాయి. 12వ శతాబ్దానికి చెందిన చోళరాజులు మొదల్కొని, విజయనగర రాజుల వరకూ ఈ ఆలయాన్ని దశల వారీగా నిర్మించారు. ఈ ఆలయానికి ఉన్న ఏడంతస్తుల గోపురం ఎంతో దూరం వరకూ కనిపిస్తుంటుంది. దీనిమీద భాగవత, రామాయణ ఘట్టాలు కనిపిస్తాయి. బాహ్య గోపురం తరువాత ఉన్న మరో చిన్న గోపురం పేరుకే చిన్నదైనా వందలమంది భక్తులను ఎండావానల నుంచి సేదతీర్చేంత విశాలంగా ఉంటుంది. సుప్రభాతం, తోమాలసేవ వంటి రోజువారీ సేవలతో ఈ ఆలయం కళకళలాడుతూ ఉంటుంది. ఇక ఏటా వచ్చే బ్రహ్మోత్సవాలు, రథసప్తమి వంటి పర్వదినాలలో తన తమ్ముని ఆలయానికి దీటుగా సందడిగా మారుతుంది.
- నిర్జర