క్షిపణి మహిళ - టెస్సీ థామస్‌

 

 


రక్షణ రంగం అంటేనే పురుషుల ఆధిపత్యానికి పట్టుగొమ్మ. అందులోనూ క్షిపణులని అభివృద్ధి చేసే విభాగంలో మహిళలు అడుగుపెట్టడమే అసాధ్యం అనుకుంటారంతా! కానీ అడుగు మోపడమే కాదు... తనతోపాటుగా దేశాన్ని కూడా నాలుగడుగులు ముందుకు నడిపించిందో మహిళ. క్షిపణి మహిళగా అంతర్జీతీయ ఖ్యాతినందుకుంది. ఆమే టెస్సీ థామస్‌!

 

 

కేరళలో మొదలు

టెస్సీ 1963లో కేరళలోని అలెప్పీ అనే పట్టణంలో జన్మించారు. తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి (IFS). సాఫీగా సాగిపోయే జీవితం. టెస్సీ తనకి అందుబాటులో ఉన్న సదుపాయాలను పూర్తిగా వినియోగించుకున్నారు. చదువుల రాణిగా, బాడ్మింటన్‌ విజేతగా ఆమె ఎదురుపడిన మెట్లన్నింటినీ అనాయాసంగా ఎక్కేశారు. త్రిసూర్‌లో బీటెక్‌, పుణెలో ఎంటెక్ పూర్తిచేశారు. టెస్సీ కూడా తన తండ్రిలాగానే సివిల్‌ సర్వీసులో చేరుతుందని అందరూ ఆశించారు. కానీ ఆమెకి చిన్నప్పటి నుంచి అంతరిక్ష పరిశోధనలంటే మహా ఆసక్తిగా ఉండేది. అందుకే ఆమె ఎంటెక్‌లో ‘గైడెడ్‌ మిసైల్‌ టెక్నాలజీ’ పాఠ్యంశాన్ని ఎన్నుకొన్నారు. అదే ఆసక్తితో 1988లో భారతీయ రక్షణ పరిశోధనా సంస్థ అయిన DRDOలో శాస్త్రవేత్తగా కాలుమోపారు.

 

 

అగ్నిలో అడుగు

టెస్సీ పనితీరుని గమనించిన అబ్దుల్‌ కలాం ఆమెను ‘అగ్ని’ క్షిపణులకి సంబంధించిన ప్రాజెక్టులోకి తీసుకున్నారు. అలా భారతీయ క్షిపణిరంగంలోకి ప్రవేశించిన తొలి మహిళా శాస్త్రవేత్తగా టెస్సీ రికార్డు సాధించారు. అయితే టెస్సీ ఆ ప్రాజెక్టులో ఒక సాధారణ శాస్త్రవేత్తగా మిగిలిపోలేదు. ఆమె అగ్నిలో అడుగుపెట్టే సమయానికి ప్రాజెక్టు ముందు ఎన్నో సవాళ్లు సిద్ధంగా ఉన్నాయి. పైగా 2006లో ఎన్నో అంచనాలతో ప్రయోగించిన అగ్ని-III మిసైల్ వైఫల్యం చెందడంతో, మన రక్షణ రంగపు సామర్థ్యం మీద సందేహాలు తలెత్తాయి. కానీ పది నెలలు తిరగకుండానే అదే అగ్ని-III మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించగలిగారు శాస్త్రవేత్తలు.

 

 

మరింత ముందుకు

అగ్ని-III విజయంలో టెస్సీ పాత్ర ముఖ్యమని గమనించడంతో, అగ్ని-IVకు ఆమెనే ప్రాజెక్టు డైరక్టరుగా నియమించింది ప్రభుత్వం. అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు, వాటిని వీలైనంతగా ఉపయోగించుకోవడమూ టెస్సీకి తెలుసు. అందుకే అగ్ని-IVనీ ఆ తరువాత అగ్ని-Vనీ విజయవంతంగా పూర్తిచేశారు. ప్రస్తుతానికి అగ్ని క్షిపణి ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల ఒక దివ్యాస్త్రం. ఖండాలను దాటుకుని అణ్వాయుధాలను మోసుకువెళ్లగల సామర్థ్యం అగ్ని సొంతం.

 

 

కుటుంబంలోనూ

టెస్సీ పుణెలో చదివే రోజుల్లో తన తోటి విద్యార్థి సరోజ్‌కుమార్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరి మతాలూ వేర్వేరైనా కూడా అది వారి వివాహానికి కానీ దాంపత్యానికి కానీ అడ్డురాలేదు. సరోజ్‌కుమార్‌ భారతీయ నౌకాదళంలో ఉన్నతశ్రేణి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఆయన ఇంటికి దూరంగా ఉండటంతో వారి కొడుకు తేజస్‌ పూర్తి బాధ్యత కూడా టెస్సీ మీదే ఉండేది. ఒక పక్క ఒత్తిడితో కూడిన ఉద్యోగం, మరో పక్క తల్లిగా విస్మరించలేని బాధ్యత. ఈ రెండు పాత్రలనూ సమర్థవంతంగా నిర్వహించారు టెస్సీ. తేజస్‌ కూడా ఇప్పుడు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

 

క్షిపణి రంగంలో టెస్సీ కృషికిగాను ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులూ దక్కాయి. లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అవార్డు, నాయుడమ్మ అవార్డు, గ్వాలియర్‌ ITM విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ వంటి గుర్తింపులు చాలానే లభించాయి. కానీ టెస్సీ మాత్రం తన విజయాలతో పొంగిపోరు.  దేశానికి ఎంత చేసినా కూడా తక్కువేనన్నది ఆమె అభిప్రాయం. టెస్సీ తల్లిదండ్రులకి మదర్‌ థెరిసా అంటే చాలా ఇష్టం. ఆ కారణంగానే వారు ఆమెకు టెస్సీ అన్న పేరు పెట్టారు. టెస్సీ మదర్‌ థెరిసాలాగా పేదలకు సేవ చేసి ఉండకపోవచ్చు. కానీ దేశం గర్వించదగ్గ మనిషిగా మాత్రం తప్పకుండా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

 

 

- నిర్జర.