కాన్పు కోసం తొందర వద్దు. ఎందుకంటే...

 

 

తల్లి కడుపులో బిడ్డ 40 వారాలు ఉంటే మంచిదని చెబుతుంటారు వైద్యులు. ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అనుకుంటే కనీసం 37 వారాల పాటు వేచి చూడమంటారు. 37 వారాల లోపుగానే బిడ్డను బయటకు తీయవలసి వస్తే ఆ శిశువును premature/ preterm babyగా పేర్కొంటారు.

బిడ్డ ఎదుగుదలలో చివరి వారాలు చాలా కీలకం. వారిలోని ఊపిరితిత్తులు, కాలేయం ఆ సమయంలోనే బలాన్ని పుంజుకుంటాయి. అలాంటి సమయంలో బిడ్డను బయటకు తీయడం వల్ల తనకు లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయం చాలామందికి తెలిసిందే! బిడ్డ సంగతి అలా ఉంచితే... అటు తల్లి ఆరోగ్యానికి కూడా ఈ తరహా కాన్పు ఏమంత క్షేమం కాదంటున్నారు.

బిడ్డకు ముందస్తుగా జన్మని ఇవ్వడానికీ, తల్లిలో గుండె సంబంధ వ్యాధులకూ మధ్య ఏమన్నా కారణం ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. దీనికోసం 70,182 మంది స్త్రీల ఆరోగ్యాన్ని గమనించారు. వారిలో 37 వారాలకంటే ముందుగా బిడ్డకు జన్మనిచ్చినవారిలో గుండెసంబంధ వ్యాధులు వచ్చే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక 32 వారాలకంటే ముందుగానే జన్మనిచ్చిన ఆడవారిలో ఈ ప్రమాదం మరింత మెండుగా కనిపించింది. అంతేకాదు! వీరు ఎంతమంది పిల్లలకు ఇలా ప్రీమెచ్యూర్‌గా జన్మనిస్తే, గుండెజబ్బుల ప్రమాదం అంతకంతా పెరగడాన్ని గమనించారు.

గుండెజబ్బులకీ ముందస్తు కాన్పుకీ మధ్య సంబంధం ఉందని బలంగా తేలిపోయింది. కాబట్టి ఇకమీదట ఇలాంటి తల్లులు తమ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనీ, భవిష్యత్తులో గుండెజబ్బులు రాకుండా తగిన ఆరోగ్యసూత్రాలు పాటించాలనీ సూచిస్తున్నారు. కానీ వీరిలో గుండె జబ్బులు రావడానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. రక్తపోటు, ఊబయాకం వంటి పరిస్థితులు బిడ్డలను కనేందుకు సమస్యలు సృష్టిస్తాయి. అవే పరిస్థితులు గుండెజబ్బుకి కూడా దారితీస్తాయి. అంతేకాదు! ముందస్తుగా పుట్టిన పిల్లలతో తల్లులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారి ఆరోగ్యం తల్లిని నిరంతరం కలవరపరుస్తుంది. అది కూడా తల్లి గుండెకు భారంగా పరిణమిస్తుందని భావిస్తున్నారు.

సిజేరియన్ అందుబాటులోకి వచ్చినతరువాత ముందస్తు కాన్పులు చాలా ఎక్కువైపోతున్నాయన్న ఆరోపణ ఉంది. దాదాపు పదిశాతం కాన్పులన్నా 37 వారాలకంటే ముందుగానే జరుగుతున్నాయని కొందరి అంచనా! ఈ నేపథ్యంలో ముందస్తు కాన్పులు తల్లి గుండెజబ్బుకి దారితీస్తాయనే హెచ్చరికని పెడచెవిన పెట్టడానికి వీల్లేదు. తస్మాత్‌ జాగ్రత్త!

- నిర్జర.