"ఇంత త్వరగా రాకపోతేనేం? ఎల్లుండి సాయంత్రం వస్తే సరిపోయేదిగా?" అన్నాడు చంద్రయ్య చిరుకోపంతో.

 

    "ఊరుకో నాన్నా! వచ్చీ రాకముందే తమ్ముణ్ణి చిన్నబుచ్చుతావేం? రారా తమ్ముడూ! ప్రయాణం సౌఖ్యంగా ఉందా?" అన్నాడు సత్యం ఆప్యాయంగా.

 

    "రారా నాయనా! ఆ మనిషి తీరే అంత! నీకు తెలియందిమాత్రం ఏముంది!" తల్లి కొడుక్కు ఎదురువస్తూ అంది.

 

    "నేనుమాత్రం ఇప్పుడు వాణ్ణి ఏమన్నాను గనుక? ఇంటిబిడ్డగదా కొంచెం ముందుగా వస్తే బాగుండేది అన్నాను" అన్నాడు చంద్రయ్య సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు.

 

    సూర్యం అన్నీ వినీ విననట్లే లోపలకు నడిచాడు. ఓ క్షణం అన్నివైపులా పరికించాడు. మధుపర్కాలలో సత్యం ఎంతో హుందాగా, అందంగా కనిపించాడు. "అన్నయ్య చాలా చక్కనివాడు. ఆ ఒక్క లోపం లేకపోతే......"

 

    మెల్లగా యింట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న ఆడవాళ్ళు సూర్యాన్ని చూసి గబుక్కున లేచి నిల్చున్నారు. సూర్యం ఉలిక్కిపడి వెనక్కు వచ్చేశాడు. తల్లి సూర్యాన్ని వెనకవాకిలినుంచి ఇంట్లోకి తీసుకెళ్ళింది. ఇల్లంతా సూర్యం మనస్సులాగే అలజడిగా ఉంది.

 

    సూర్యం స్నానంచేసి వచ్చేప్పటికి ఆడవారంతా మెల్లా ఇంట్లోనూ, మగవారంతా సావిట్లోనూ భోజనాలకు కూర్చున్నారు.

 

    "రారా తమ్ముడూ! నువ్వుకూడా అందరితోపాటు కూర్చొని భోజనం చేద్దువుగాని" అంటూ వచ్చాడు సత్యం తమ్ముడి దగ్గిరకు.

 

    "కొంచెం ఉండి భోజనం చేస్తాలే!" అన్నాడు సూర్యం లాల్చీ తొడుక్కుంటూ.

 

    "అయితే అందరూ వెళ్ళాక మనిద్దరం కలసి కూర్చుందాంలే!" అంటూ బయటకు వెళ్ళాడు సత్యం. అతన్ని చూస్తూ నిలబడ్డాడు సూర్యం. దీర్ఘంగా నిట్టూర్చాడు.

 

    యధాలాపంగా దేముడిగది గడపలో కాలుపెట్టిన సూర్యం మంత్రించినట్లు నిలబడిపోయాడు.

 

    సరళను ఆ రోజే పెళ్ళికూతుర్ని చేశారు. ముగ్ధమోహనంగా వున్న ఆ రూపాన్ని కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు సూర్యం. చుట్టూ కూర్చున్న స్నేహితురాండ్రు ఏదో అంటున్నారు. సిగ్గుతో, గులాబిరంగును పులుముకున్న ఆ నున్నని చెక్కిళ్ళు ఆమె కట్టుకున్న లేత గులాబిరంగు బెనారస్ సిల్కుచీరను సవాలు చేస్తున్నాయి. ఆమె ముసిముసినవ్వులు వెదజల్లే కాంతిముందు ఆమె తలలోని బొడ్డుమల్లెలమాల వెలవెలపోతూ ఉంది. మహాశిల్పి దీక్షతో చెక్కిన పాలరాతి విగ్రహంలా ఉన్న ఆ సౌందర్యమూర్తిని మైమరచి చూస్తూ నిలబడిపోయాడు. స్థాణువులా నిలబడిపోయిన యువకుణ్ణి చూసిన సరళ స్నేహితురాళ్ళు తుర్రున పారిపోయారు. సరళ తలెత్తి చూసింది. ఒక్క నిముషం బెదిరిపోయింది. అంతలోనే సూర్యాన్ని గుర్తించి కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది.

 

    సూర్యం గదిలోకి వచ్చాడు. సరళ దగ్గిరగా వచ్చి నిల్చాడు. సరళ తడబాటు చెందింది. ఆమె కళ్ళలోకి లోతుగా, తిరస్కారంగా చూశాడు. ఆ చూపుల్ని ఎదుర్కోలేని సరళ తన చూపుల్ని దాచేసుకుంది. చిన్నబావ! సంతోషం, దుఃఖం మిళితమైన ఏదో అనిర్వచనీయమైన అనుభూతి ఆమె హృదయాన్ని లోబరుచుకుంది. బరువైన రెప్పల్ని ఎత్తి ఓసారి చూసింది. ఆ రెప్పలచాటున దాగివున్న చెమ్మను సూర్యం చూడలేదు.

 

    "సరళ.....కాదు.....వదినగారూ!"

 

    సరళ ఉలిక్కిపడింది. సూర్యం స్వరంలోని వ్యంగ్యం ఆమె గుండెలో కలుక్కున గుచ్చుకుంది. క్షమించమన్నట్లు కళ్ళతోనే ప్రాధేయపడింది.

 

    "నీ సుఖ స్వప్నాన్ని చెరిపివేయలేదుకదా?" ప్రశ్నించాడు సూర్యం.

 

    "బావా!" అంది సరళ ఆర్ద్రతనిండిన స్వరంతో.

 

    ఆ స్వరంలోని ఆర్ద్రతకూ, ఆప్యాయతకూ ద్రవించిపోయింది సూర్యం. హృదయంలోని కాఠిన్యం.

 

    "సరళా! ఎందుకిలా చేశావు? నాకు ఉత్తరం ఎందుకు రాయలేదు? నిజంగా నీకు అన్నయ్య అంటేనే యిష్టం అయితే, నాకు ఆశలు చూపించి ఎందుకు నాలో కోర్కెలు రేకెత్తించావు? ఓ సుందరమైన జగత్తును నా చుట్టూ నిర్మించి, నన్ను మురిపించి, ఎందుకు అక్కడనుంచి నన్ను నిర్దయగా పాతాళంలోకి తోసేశావు?!" ఆవేశంగా అన్నాడు సూర్యం. సరళ గాబరాగా నాలుగువైపులా చూసింది.

 

    "భయపడుతున్నావా ఎవరూ వినటంలేదులే! అన్నయ్య అదృష్టవంతుడు!" నిట్టూర్చాడు సూర్యం.

 

    "బావా!" గద్గదంతో అంది. ముందుకు మాటలు పెగల్లేదు. గొంతులోనే ఉండచుట్టుకొని పోయాయి.

 

    "నీ ఇష్టంతోనే ఈ వివాహం జరుగుతుందా?"

 

    సరళ మాట్లాడలేదు.

 

    "చెప్పు సరళా! నిజం చెప్పు! నీకు మనస్పూర్తిగా అన్నయ్యను వివాహం ఆడటం ఇష్టమేగదూ?"

 

    "నా ఇష్టాయిష్టాలకు విలువ ఏముంది? అసలు నన్ను ఎవరైనా అడిగారు కనుకనా చెప్పటానికి" సరళ కళ్ళలో నీరు తిరిగింది.

 

    "మరి నాకు జాబు రాయాలేదేం?"

 

    సరళ జవాబివ్వలేదు.

 

    "ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. చెప్పు, నీ ఇష్టం లేకపోతే అమ్మతో చెప్పెయ్! నేను అన్నయ్యతో చెప్పేస్తాను."

 

    సరళ బెదురు చూపులు చూసింది. అజ్ఞాత భయంతో ఆమె శరీరం బిగుసుకుపోసాగింది.

 

    "ఇప్పుడు ధైర్యం చెయ్యకపోతే జీవితం అంతా ఏడుస్తావు! ఆ తరువాత నీ ఇష్టం! మధ్యలో ఒకరోజు మాత్రమే ఉంది. ఆలోచించుకో!" ఎవరో వస్తున్నట్లు అలికిడై సూర్యం అక్కడినుంచి గబగబా వెళ్ళిపోయాడు.

 

    సరళ ప్రశాంత మానస సరోవరంలోకి ఓ రాయి విసిరి వెళ్ళిపోయాడు సూర్యం. హృదయంలో కల్లోలం బయలుదేరింది. సరళ అశాంతిగా లేచి నిల్చుంది. ఎక్కడకు వెళుతుంది? తను పెళ్ళికూతురు. ఇంటినిండా జనం. మళ్ళీ అక్కడే కూలబడింది. రకరకాల ఆలోచనలతో బుర్ర బద్దలైపోతూంది.


                                         4


    భోజనాలయాక బంధువులంతా వారికోసం ప్రత్యేకించి యేర్పాటు చేయబడిన బసలకు వెళ్ళారు.

 

    సూర్యం సత్యంతోపాటు భోజనానికి కూర్చున్నాడు. సత్యం ఉత్సాహంగా తమ్ముడ్ని ఏమేమో అడుగుతున్నాడు. అన్నింటికి అన్యమనస్కంగా అవును- కాదు అంటూ జవాబిస్తున్నాడు సూర్యం. తమ్ముడు ఎందుకంత పరధ్యాన్నంగా వున్నాడో అర్ధంగాలేదు సత్యానికి. ఎక్కువ మాట్లాడకుండా భోజనంచేసి లేచి వెళ్ళిపోయాడు. తమ్ముడు ఏమిటీ రానురాను ఇలా తయారవుతున్నాడు? పట్నవాస జీవితం, పెద్ద చదువులు మనుషుల్లోని మమకారాల్ని చంపివేయడం లేదు గదా! ప్రేమే మనిషిని మనిషిగా చేస్తుంది. భయం మనిషిని సంఘ జీవిగా చేస్తుంది. అహంకారం మనుషులచేత సామ్రాజ్యాలను నిర్మింప చేస్తుంది. కానీ రానురాను మనిషిలోని మమకారం చచ్చిపోతుంది. చివరికి మనిషిలోని మానవత్వం మిగలదేమో! మనిషికూడా మరో పశువులా జీవిస్తాడేమో! సత్యం అశాంతిగా తన గదిలో తిరుగుతున్నాడు.

 

    సూర్యం భోజనం అయిందనిపించి తన మంచంమీద నడుంవాల్చాడు. ప్రయాణం బడలికవల్ల వెంటనే నిద్రపోయాడు.

 

    సరళ తలనొప్పిగా ఉందని అన్నం తినకుండా పడుకుంది. శాంతమ్మ అన్ని పనులు ముగించుకొని పదకొండు ఆ ప్రాంతంలో సరళ గదిలోకి వచ్చింది చంద్రయ్య విడిది ఇళ్ళలోవున్న బంధువులకు అన్ని సౌకర్యాలు లభించాయో లేదోనని చూట్టానికి వెళ్ళాడు.

 

    "సరళా! లేమ్మా! ఈ పాలన్నా త్రాగి పడుకో!" అంటూ సరళను తట్టి లేపింది శాంతమ్మ.

 

    సరళ విసురుగా లేచి కూర్చుంది. కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. చెక్కిళ్ళమీద ఎండిన కన్నీటి చారలు స్పష్టంగా చెబుతున్నాయి ఆమె అంతవరకూ ఏడుస్తూన్నట్లు. శాంతమ్మ సరళ ముఖంలోకి ఓ క్షణం చూసింది.

 

    "ఏమిటమ్మా! ఏడుస్తున్నావా? అమ్మ గుర్తొచ్చిందా?" అంది ఆప్యాయంగా తల నిమురుతూ.

 

    శాంతమ్మ అనునయ వచనాలకు నిండుకుండ బ్రద్ధలయినట్లు సరళ ఒక్కసారిగా బావురుమంది. వెక్కివెక్కి ఏడుస్తున్న సరళను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది శాంతమ్మ.

 

    "ఊరుకో తల్లీ! పెళ్ళికూతురివి. ఏడవడం శుభం కాదు-" అంది శాంతమ్మ సరళ కన్నీటిని తుడుస్తూ.

 

    "అత్తయ్యా!" వెక్కిళ్ళ మధ్యలోనుంచి వచ్చిన ఆ పిలుపు అతి దీనంగా ఉంది.

 

    "ఏం తల్లీ?"

 

    "నాకీ పెళ్ళి ఇష్టంలేదు. నేను చేసుకోను" దుఃఖంనే దృఢత్వం గోచరించింది.

 

    శాంతమ్మకు ఆ మాటలకు అర్ధం వెంటనే అర్ధం కాలేదు. అర్ధం అయాక ఆలోచించే శక్తిని కోల్పోయింది. కొయ్యబారిపోయి సరళ ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. శాంతమ్మ ముఖం నలుపురంగును పులుముకుంది. అప్పుడే ప్రాణంపోయిన శరీరంలా బిగుసుకొనివున్న శాంతమ్మను చూసి సరళ భయపడిపోయింది.

 

    "అత్తయ్యా! అత్తయ్యా!" అంటూ కుదుపుతూ ఆదుర్దాగా పిల్చింది.

 

    క్రమంగా ఘనీభవించిన శాంతమ్మలోని చైతన్యం ద్రవించసాగింది. వెర్రిచూపులు చూస్తున్నది. తను విన్నది ఏమిటి? ఆ మాటలంది సరళేనా? చిన్నప్పటినుంచి సరళను సత్యం భార్యగానే చూసిన శాంతమ్మకు మతిపోయినట్లయింది.

 

    "అత్తయ్యా!" ఆత్రంగా కదిపింది సరళ.

 

    "సరళా! నువ్వు నిజంగా అలా అన్నావా లేక నాకు ఏమైనా భ్రమ కలిగిందా?" కలలో మాట్లాడుతున్నట్లు గొణిగింది శాంతమ్మ.

 

    సరళ ఓ నిమిషం మౌనంగా తలవంచుకొని ఆలోచించసాగింది. అంతలోనే ఆమె ముఖం గాంభీర్యంగా మారింది. శాంతమ్మ సరళ ముఖంలోకి భయం భయంగా చూస్తూ కూర్చుంది.

 

    "అవునత్తయ్యా! నేను పెద్దబావను చేసుకోను, చిన్నబావనే చేసుకుంటాను."

 

    శాంతమ్మ కోపంతో బుసలు కొట్టింది.

 

    "వాడు అలా అనమని నీకు బోధించాడటే?"

 

    "ఒకళ్ళు బోధించేదేమిటి? నేను కుంటివాణ్ణి చేసుకొని ఏం సుఖపడతాను?"

 

    వాక్యం పూర్తికాకుండానే సరళ కళ్ళకు జిగేల్ మని మంట కనిపించింది. చెక్కిలి మంట పుట్టింది.

 

    "మీరు కొట్టినా, చంపినా నేను ఆ కుంటివాణ్ణి చేసుకోను. మీరంతా స్వార్ధపరులు. అందుకే నన్ను అంత ప్రేమగా పెంచారు-" గొంతు పెద్దది చేస్తూ అంది సరళ. ఆమె స్వరంలో కోపం, దుఃఖం నేను ముందంటే నేను ముందని పోటీ పడుతున్నాయి.

 

    "ఎంతమాట అన్నావే దెష్టపుకుంకా! కన్నతల్లికంటే ఎక్కువగా కడుపులో పెట్టుకొని కాపాడామే! నీ పెద్దబావ నిన్ను కళ్ళలో పాపలా కనికరించాడే? వాడు కుంటివాడా? వాడు కుంటివాడెందుకయాడు? వాడు కుంటివాడు కాకుండా వుంటే ఎంత గొప్పవాడయేవాడు! వాడు ఇలా అవటానికి కారణం ఎవరు? వాడు నువ్వన్నమాటే వింటే నిన్ను చస్తే చేసుకుంటాడా! నిన్ను ఈ ముహూర్తానికే నువ్వు కోరినవాడి కిచ్చి చెయ్యడూ! రేపు రాత్రికి పెళ్ళయితే ఇప్పుడు నేను చేసుకోనంటావా? నేనూ- మీ మామయ్యా బ్రతకటం నీకు ఇష్టం లేదా? నోరు మూసుకొని పడివుండు" అంటూ కళ్ళు వత్తుకుని లేచింది శాంతమ్మ. బయట ఎవరో గబగబా వెళుతున్నట్లు అడుగుల శబ్దం వినిపించి బయటకు వచ్చింది. ఎవరూ కనిపించలేదు. కాని ఎవరో సత్యం గదిలోకి వెళ్ళినట్లయి శాంతమ్మ వణికిపోయింది. సత్యం వినలేదు కదా? గబగబా సత్యం గది దగ్గిర కెళ్ళింది. గదిలో దీపం లేదు. సత్యం మంచి నిద్రలో ఉన్నాడు. శాంతమ్మ తేలిగ్గా నిట్టూర్చింది.

 

    సరళ ఆలోచనలో పడిపోయింది. హృదయం అట్టడుగున పూడుకుపోయిన గతస్మృతులు ఒక్కొక్కటీ లేచివచ్చి కళ్ళముందు నిలిచాయి....


                                         5


    ఊరవతల నల్ల చెరువుగట్టు. గట్టుమీద అన్నదమ్ములు ఇద్దరు బొమ్మరిళ్ళు కడుతున్నారు. ఐదేళ్ళు దాటిన అత్తయ్య కూతురు మార్చిమార్చి ఇద్దరూ కడుతున్న బొమ్మరిళ్ళను చూస్తూ కూర్చుంది. ఇద్దరు బాలురూ పోటీపడి బొమ్మరిళ్లు కడుతున్నారు. చిన్నవాడు కాలు లాగాడు. బొమ్మరిల్లు పడిపోయింది. మళ్ళీ కట్టటానికి సతమత మవుతున్నాడు. పెద్దవాడు ఎలాగో కట్టాడు. బొమ్మరిల్లు చక్కగా నిల్చింది. చిన్నవాడుకూడా ఎలాగో కట్టాడు. కాని అంత బాగా కుదరలేదు. ముందు కూలిపోయింది కొంచెంగా బొమ్మరింటి ఆకారం మాత్రం నిల్చింది.

 

    "ఎవరి ఇల్లు బాగుంది?" చిన్నవాడు ప్రశ్నించాడు. అత్తయ్య కూతురు పెద్దవాడు కట్టిన బొమ్మరిల్లు చూపించింది.

 

    "నువ్వు ఏ ఇంట్లో కూర్చుంటావు?" చిన్నవాడే మళ్ళీ రెట్టించాడు. పెద్దవాడు మౌనంగా బాలికదెస చూశాడు.

 

    "పెద్దబావ ఇల్లే బాగుంది. నేను అందులోనే ఉంటాను!" అంటూ వెళ్ళి పెద్దబావ కట్టిన ఇంటిముందు కూర్చుంది.
    పెద్దవాడు బొద్దుగా చామనచాయకంటే ఒక చాయ ఎక్కువగా ఆకర్షణీయంగా ఉన్నాడు. చిన్నవాడు పీలగా, సన్నంగా, చామనచాయగా ఉన్నాడు. వాళ్ళిద్దరు రూపంలో, గుణంలో కూడా అన్నదమ్ములలా అనిపించరు.

 

    బాలిక మాటలకు కోపగించుకుని చిన్నవాడు తను కట్టిన ఇంటికి కసిగా కాళ్ళతో తొక్కసాగాడు.

 

    చిన్నవాడు దగ్గరలో ఉన్న ఒక రాతిమీద కూర్చొని గడ్డిపరకను కసిగా కొరుకుతున్నాడు. బాలిక ఆ బాలుణ్ణిచూసి తొర్రిపళ్ళు చూపిస్తూ నవ్వింది.

 

    "తొర్రిపళ్ళలో తొండ చిక్కిందీ!" అంటూ ఏదో పాట పాడుతూ బాలికను ఉడికించటానికి ప్రయత్నిస్తున్నాడు చిన్నవాడు.

 

    "చూడు పెద్దబావా, చిన్నబావ ఏమంటున్నాడో!" అంది.