మిల్లర్ తెలివి తేటలకి అబ్బుర పడ్డాడు. "మరి... మరి... నేను షూట్ చేసింది?" జోహ్రా ప్రశ్న మధ్యలోనే ఆగిపోయింది.
    
    "నువ్వు షూట్ చేసింది మరెవరినో అయుంటుంది" హాన్ ఆవేపు నుంచి ఫోన్ ని కట్ చేసాడు. జోహ్రా మొఖం అవమానంతో ఎర్రబడి పోయింది.
    
                                                *    *    *    *    *
    
    "మైడియర్ కమెండోస్... మీరు మాస్టర్ ప్రాణంపట్ల ఎంత ఆందోళన చెందుతారో నాకు తెలుసు. బట్.... డోంట్ వర్రీ... మాస్టర్ కేం కాలేదు. మాస్టర్ ఇంతక్రితమే పూజలు ముగించుకొని విక్రోలి బంగ్లాకేసి వస్తున్నారు. మిషిన్ గన్ కి గురయింది ఒక డమ్మీ" మిల్లర్ మాటల్ని వైర్ లెస్ సెట్స్ ద్వారా విన్న కమెండోస్ గుండెల నిండా ఊపిరి తీసుకున్నారు.
    
    మిల్లర్ అమోఘమయిన మేధస్సుకి మనస్సులోనే ప్రణామాలర్పించారు.
    
                                                  *    *    *    *    *
    
    "యాభై లక్షలు... ఒకటి కాదు, రెండు కాదు... యాభై... ఫైవ్ మిలియన్స్?" ఇస్కాన్ ప్రతినిధి కంఠంలో ప్రపంచ వింత గురించి మాట్లాడుతున్నప్పుడు కలిగే ఉద్వేగం తొంగి చూసింది.
    
    "దటీజ్ మాస్టర్" అన్నాడు మరో ప్రతినిధి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.
    
    "సంవత్సరానికి యశోధరగారు కనీసం రెండుసార్లన్నా ఇస్కాన్ కి వస్తే బావుండు" అన్నాడు మరో ఇస్కాన్ ప్రతినిధి.
    
    "ఎలా వచ్చాడో? ఏ వేపు నుంచి వచ్చాడో! ఎలా తిరిగి వెళ్ళాడో! ఎలా అదృశ్యమయిపోయాడో? అంతా చిత్రం" అన్నాడు మరో ప్రతినిధి.
    
                                                  *    *    *    *    *
    
    తమ కళ్ళ ముందే మాస్టర్ రోల్స్ రాయిస్ ఎక్కారు.
    
    తమ వెహికల్స్ కి మధ్య ఉంటూ తమతో సాగి ముందుకి వచ్చారు.
    
    ట్రిగ్గర్ మెన్ ఎవరో దేవానంద్ ఇంటి కార్నర్ లో గురిచూసి కాల్చటం జరిగింది. ఇంకెలా మాస్టర్ తప్పించుకున్నారు? పైపెచ్చు తమ వెహికల్స్ ఏమీ ఇస్కాన్ కేసి తిరగలేదు. చందనా థియేటర్ దగ్గర కుడివేపుకి తిరగవలసిన వెహికల్స్ మిల్లర్ ఆదేశాల మేరకు ఎడంవేపుకి తిరిగి సరాసరి విక్రోలి ఎస్టేట్ కేసి సాగివచ్చాయి. ఇంకెలా మాస్టర్ తప్పించుకున్నట్లు? ఒకింత సేపటికి వెహికల్స్ అన్నీ విక్రోలీ బంగ్లాకేసి వెళ్ళిపోయాయి. మెయిన్ గేట్ క్లోజ్ అయిపోయింది. జలసమాధిలో రగిలే అగ్నిపర్వతంలా, అంతా పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోలోపల ఏదో జరిగిందని జరుగుతోందని కమెండోలు పసిగట్టారు.
    
                                                 *    *    *    *    *
    
    అరగంటకి ఎల్ ఆర్ ఎఫ్ బీలు తమకు కేటాయించిన క్వార్టర్సు లో కలుసుకున్నారు. "డియర్ ఫ్రెండ్స్....అసలేం జరిగిందో నీకు మాత్రమే తెలుసు. వీలయితే చెప్పకూడదా? మేం ఆతృతను అణచుకో లేకపోతున్నాం.... ప్లీజ్..." ఎఫ్ ని మిగతా ముగ్గురూ అర్ధించారు.
    
    కొద్దిక్షణాల మౌనం తర్వాత ఎఫ్ చెప్పటం ప్రారంభించాడు.
    
    "మిల్లర్ జీనియస్... ప్రతి ఒక్కరూ ఒప్పుకు తీరవలసిన నగ్నసత్యం. మాస్టర్ పై హత్యాప్రయత్నం జరగనున్నదని మాస్టర్ ముందే పసిగట్టారు. ఎలా అన్నది ఆ పాలాక్షుడికే తెలియాలి.
    
    ఎప్పుడూ లేనిది మిల్లర్ అంబులెన్స్ డ్రైవింగు సీటుని అధిష్టించారు ఎందుకని? తెలీదు. ఆ తరువాత అంధేరి నుంచి జుహుకి స్ట్రెయిట్ రోడ్ వుంది. నిజానికి వెళ్ళవలసింది కూడా ఆ రూటులోనే అయితే అంధేరి టూ జుహూ రహదారికి లింక్ అయ్యే దేశ్ ముఖ్ మార్గ అనే చిన్నవీధిలోకి పైలట బైక్సు సడన్ గా మలుపు తిరిగాయి. తప్పని పరిస్థితుల్లో మనమూ మన వెహికల్ ఆ వీధిలోకి మలుపుతిప్పాం. అంటే బైక్సు మీద ముందుగా వెళ్ళే ఆ కమెండోస్ కి (ఫైలట్సు) మాత్రమే మిల్లర్ నుంచి ఆదేశాలు వెళ్ళి వుంటాయి.
    
    ఇకపోతే మన ఎస్టేట్ వెహికల్స్ అన్నీ పెట్రోలు ఇంధనంగా నడిచేవే. ఎప్పుడూ ఫుల్ కండీషన్ లో వుంటాయి. అలా వుంచుతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రబుల్ ఇవ్వవు. ఎక్కడా అర్ధాంతరంగా ఆగిపోవు. కాని మనం మన ముందున్న బైక్స్ దేశ్ ముఖ్ రోడ్ లోకి వెళ్ళిన అరనిమిషానికి కాని మిల్లర్ సాబ్ డ్రైవ్ చేసే అంబులెన్స్ రాలేదు.
    
    మరో మలుపులోనే ఫైలట్స్ బైక్స్ తిరిగి అంధేరి మెయిన్ రోడ్ లోకే వచ్చేసాయి. ఎందుకలా జరిగిందో నాకు అర్ధం కావటం లేదు.
    
    ఇకపోతే ఇద్దరు గొరిల్లా కమెండోస్ అంబులెన్స్ వెనుక ఫాలో అయ్యే సెక్యూరిటీ వెహికల్ నుంచి క్రిందకు దూకేశారు. వాళ్ళు అలా వేగంగా వస్తున్న కారులోంచి దూకి ఎటువెళ్ళారో తెలీదు.
    
    మరికొద్ది క్షణాలకి మనం దేవానంద్ ఇంటిమలుపు తిరగబోతామనగా విక్టరీకోర్టు అపార్టుమెంట్స్ టెర్రస్ మీంచి ఒక మనిషి వచ్చి దబ్బున కింద పడ్డాడు. బహుశా స్పాట్ డెత్ కి గురయి ఉండవచ్చు. అతనెవరు? అతని చావుకి సెక్యూరిటీ కారులోంచి తప్పుకున్న ఇద్దరు గొరిల్లా కమెండోస్ కి ఏమైనా సంబంధముందా? అదీ తెలీదు.
    
    ఫైనల్ గా మనం ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళలేదు.
    
    ఒక ప్రోగ్రామ్ నిర్ణయించబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ అది మార్చబడదు. అది మిల్లర్ స్టాండింగ్ డెసిషన్. గుడికి వెళ్ళకుండానే చందనా థియేటరు వద్ద కుడివేపుకి తిరగవలసిన ఫైలట్స్ ఎడంవేపుకి తిరిగి థియేటర్ ముందు నుంచి దూసుకుపోయాయి.
    
    రూట్ మారినప్పుడల్లా మనకి ముందుగానే వెళ్ళే పైలట్స్ ఒక్క క్షణం కన్ ఫ్యూజ్ అవటాన్ని గమనించాన్నేను. దీన్నిబట్టి బైక్స్ మీద ముందుగా దారితీసే పైలట్స్ కి ఆఖరి క్షణం వరకు ఎటు వెళ్ళవలసింది మిల్లర్ సాబ్ ఆదేశాలివ్వలేదు.
    
    మన వెహికల్స్ లో అరేంజ్ చేసిన వైర్ లెస్ సెట్స్ ఆఫ్ చేశారు మిల్లర్." ఎఫ్ తనకు తెలిసినంతవరకు సమీక్షించుకుంటూ వెళ్ళాడు.
    
    ఎల్ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా బంగ్లా మెయిన్ గేట్ తెరుచుకోవటం వెంటనే రోల్స్ రాయిస్ లోపలకు రావడం జరిగింది.
    
    సరిగ్గా వాళ్ళు కూర్చున్న స్థలానికి ఎదురుగా బంగ్లా మెయిన్ గేటు ఉండటంతో ఆ దృశ్యం వారికంట పడింది.
    
    ఎఫ్ కళ్ళు అప్పుడు మెరిశాయి. "మన వెనుక వచ్చి రోల్స్ రాయిస్ లో మాస్టర్ లేరు. మాస్టర్ వజ్ రీప్లేస్ బై మిల్లర్ సాబ్. విధి తప్పకనే మాస్టర్ ఇస్కాన్ టెంపుల్ ని దర్శించుకుని వస్తున్నారు. ఎట్ లాస్ట్.... మాస్టర్ ఈజ్ ఎలైవ్....థేంక్ గాడ్. బట్ మిస్టరీ బిహైండ్ ఇట్ విల్ రిమైన్స్ మిస్టరీ- రెండో రోల్స్ రాయిస్ ఎప్పుడు ఎస్టేటు నుంచి బయటకు వెళ్ళిందో ఎవరికీ తెలీక పోవటమే మిల్లర్ అమోఘమయిన మేధస్సుకి నిదర్శనం- ఏది ఏమైనా బొంబాయి ట్రిగ్గర్ మెన్ మిల్లర్ ని రెచ్చగొట్టారు. ఆయన అహాన్ని నిద్రలేపారు. సో.... వార్ని మృత్యువు అంచులకు తీసుకువెళ్ళందే మిల్లర్ నిద్రపోరు వీధి రౌడీలు, గూండాలు, కిల్లర్స్, మిల్లర్ వ్యూహాన్ని ఛేదించటం ఒక జోకే...." ఎఫ్ గర్వంగా అన్నాడు.