"నెలా... ముఫ్ఫైరోజులు.... ముఫ్ఫై ఒకటి కాకూడదు. ఈ విషయం ఏమాత్రం బయటకు పొక్కినా ముందు నిన్ను చంపేస్తాను. మాట నిలబెట్టుకొనే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. లేనివాళ్ళను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టడం నాకు అన్నిటికంటే ఇష్టమైనపని..."
    
    త్యాగరాజన్ వెన్ను భయంతో కొద్దిక్షణాలు జలదరించింది.
    
    "బరువు తక్కువ పెద్ద కాలిబర్ అక్కర్లేదు. బ్యారెల్ ఎయిట్- ఇంచెస్ పొడవు దాటకూడదు గుర్తుంటాయి కదా...?'
    
    "గుర్తుంటాయి. వర్క్ ఈరోజే మొదలుపెడతాను. ఈరోజు డిజైన్ తయారుచేసుకుంటాను. కానీ..."
    
    "సందేహించక్కర్లేదు అడుగు ఇంకెంతకావాలి?"
    
    "మరో యాభైవేలు...." త్యాగరాజన్ మాటలు పూర్తవుతుండగానే జోహ్రా తనవెంట తెచ్చుకున్న బ్రీఫ్ ని ఓపెన్ చేసి మరో యాభైవేలు తీసి లేత్ మెషిన్ మీద పెట్టాడు.
    
    నిజానికి జోహ్రా కోరినంత చిన్నగా రైఫిల్ ని తయారుచేయటం కష్టమే అయినా లక్షరూపాయల హార్డ్ కేష్ చేతికందటంతో తాత్కాలికంగా ఆ కష్టాన్ని మర్చిపోయాడు త్యాగరాజన్.
    
    "ఏ స్పాట్ లో కాల్చవచ్చు?"
    
    "నుదుటిమీద లేదా గుండెమీద"
    
    "చాన్సెస్ పర్సెంట్?"
    
    "నైంటీ నైన్-"
    
    "సో... దేరీజ్ ఒన్ మిస్సింగ్ ఛాన్స్"
    
    "కావచ్చు."
    
    "అయితే సెకండ్ రౌండ్ కూడా ఎంతో వుపయోగమైంది అవుతుంది. సింగిల్ బ్యారెల్ అయితే ఒక బుల్లెట్ ని ఫెయిర్ చేయగానే రెండో బుల్లెట్ ని లోడ్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. మొదటి బుల్లెట్ ఖాళీ తూటాని తీసివేసి రెండో బుల్లెట్ ని ఇన్సర్టు చేయాలి. బ్రీచ్ ని క్లోజ్ చేయాలి. తిరిగి ఎయిమ్ చేయాలి. ఇవన్నీ కాలయాపనకు గురిచేస్తాయి. పైగా మీరుకోరుకుంటున్న తరహా హేండ్ ఎటాచ్ డ్ రైఫిల్ విషయంలో ఇవి అసలు సాధ్యం కావు. కనుక మీరు కోరుకునే రైఫిల్ కి డబుల్ బ్యారెల్స్ వుండాలి. ఒక్క బ్యారెల్ నుంచి బుల్లెట్ ఫైర్ అవాలి ఏమంటారు...?"
    
    "యూ ఆర్ రైట్.... పనిలో పనిగా సైలెన్సర్ ఒకటి, టెలీస్కోపిక్ సెట్ ఒకటి, రిహార్సల్స్ కి ఉపయోగపడటానికి ఒక యాభై వరకు బుల్లెట్స్ కావాలి. బుల్లెట్ మీద కాని, గన్ మీద కాని మిగతా ఉపకరణాల మీదగాని స్పెసిఫిక్ సింబల్స్ ఏమి ఉండకూడదు."
    
    "ఓకే మిస్టర్ జె....నేను ఈ క్షణం నుంచే మీ పనిలోకి దిగిపోతాను. మీరు నా దగ్గరకు వచ్చే ప్రతిసారి కొంచెం వెనుకా ముందు చూసుకొని రండి. ఈ వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నవాడ్ని ఇంతవరకైతే నేను పోలీసుల దృష్టికి రాలేదు. కాని అవసరం వస్తే నన్ను అనుమానించే ప్రమాదం వుంది. అందుకు కారణం నేనింతకు ముందు మిలటరీ ఫెయిర్ ఆర్మ్స్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైరయ్యాను. మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో? ఏ దేశమో ఎక్కడుంటారో తెలీదు. పరిస్థితులు విషమించే పరిస్థితి వస్తే నేను ఇక్కడి నుండి రాత్రికి రాత్రి అదృశ్యమై పోవలసి వస్తుంది. దానిమూలంగా మరి కొన్నాళ్ళు నాకు వ్యాపారముండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మీ అవసరాల్ని చూస్తుంటే చాలా పెద్ద వ్యక్తిని, భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య వుండే వి.ఐ.పి.ని అసాసినేట్ చేయబోతున్నట్లుగా ఊహిస్తున్నాను. నా లెక్క ప్రకారం పోలీసులు కూడా ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తంగా వుంటారు. మీకు తెలుసో లేదో బొంబాయి పోలీసులు ఒకింత సిన్సియారిటీ నిజాయితీ వున్నవాళ్ళు. బొంబాయి నగర పోలీస్ కమీషనర్ సిద్దేశ్వర్ ఓబరాయ్ ఆవలించకుండానే పేగులు లెక్కించే ప్రమాదకరమైన ఆఫీసర్. చాపక్రింద నీరులా అవసరమైన చోటుకు నిశ్శబ్దంగా పాకిపోగల దిట్ట. ఎవరి జాగ్రత్తలో వారుండటం చాలా క్షేమం మీనుంచి నేనాసిస్తున్న రెండు లక్షలు పెద్ద మొత్తమే అయినా శాశ్వతంగా వ్యాపారానికి తిలోదకాలు ఇచ్చే స్థితిలో నేనింకా చేరుకోలేదు. నేను ఒక్కసారి పోలీసుల దృష్టికి వచ్చినా ఏటా నాకొచ్చే పదిలక్షల ఆదాయం చేజారిపోతుంది... నా పరిస్థితి పూర్తిగా అర్ధమైందనుకుంటాను?" త్యాగరాజన్ నెమ్మదిగా తన మనస్సులో ఉన్నదంతా చెప్పేసాడు.
    
    జోహ్రా భుజాల్ని తమాషాగా కదిలిస్తూ "నా నుంచి రెండు లక్షలు ఆశిస్తున్నావన్న మాట? ఓకే.... మరి నేవస్తాను. బైదిబై చిన్న విషయం వుంది. పరిస్థితులు నాకు అనుకూలించక నీ దగ్గరకు రాలేకపోతే నా మనిషిని పంపిస్తాను...."
    
    "అతనే నీ మనిషి అని ఎలా గుర్తించగలను?"
    
    "నేను నీకు ఇప్పటికి ఎంతిచ్చాను?"
    
    "లక్ష"
    
    జోహ్రా తన ప్యాంట్ బ్యాక్ పాకెట్ లోంచి చేతికొచ్చినంత చిల్లర తీసి త్యాగరాజన్ కి అందించాడు.
    
    జోహ్రా ఆ చిల్లరెందుకిచ్చాడో అర్ధంకాక త్యాగరాజన్ ఆశ్చర్యపోతుండగా "ఆ చిల్లర ఎంతో లెక్కవేయ్" అన్నాడు జోహ్రా.
    
    త్యాగరాజన్ ఆ పనిని పూర్తిచేసి "రెండురూపాయల అరవై ఏడుపైసలు" అన్నాడు రెండు పైసల నాణాన్ని వింతగా చూస్తూ.
    
    "నీకింకా నేనెంత ఇవ్వవలసి ఉంటుంది?"
    
    "లక్ష"
    
    "లెక్కలు రావా? అహంభావమా....?" జోహ్రా గద్దించాడు.
    
    త్యాగరాజన్ భయంగా చూసాడు జోహ్రావైపు.
    
    "ఈ చిల్లర నీకు ఉచితంగా ఇవ్వలేదు."
    
    త్యాగరాజన్ కి విషయం అర్ధమయింది.
    
    "ఇంకా మీరు నాకివ్వవలసింది రూ. 99,997-33 పైసలు."
    
    "శెభాష్ మన వృత్తిలో ఉండేవాళ్ళు చాలా షార్ప్ గా ఉండాలి. నేను పంపే వ్యక్తి నీ దగ్గరకు రాగానే నీకింకా రావల్సినదెంతో అతన్ని అడుగు. అతను తడుముకోకుండా చెప్పగలిగితే నా ఐటమ్ ని ఇచ్చి పంపు లేదంటే అతన్ని క్షణాల్లో చంపివేసి, శవాన్ని రాత్రికి రాత్రి మాయం చేసి నిన్ను నువ్వు కాపాడుకో...బై" అంటూ మెట్లకేసి సాగాడు జోహ్రా.
    
                                                             *    *    *    *    *