శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము -1
Sri Venkateswara Vratha Kalpam -1
సాక్షాత్తూ శ్రీ స్వామివారిచే అనుగ్రహించబడిన అద్భుత వ్రత కల్పము
తిమ్మరాజు విశ్వపతి రామకృస్ణమూర్తి
నివేదన
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వెంకటేశ నమోదేవో నభూతో నభవిష్యతి
ఈ బ్రహ్మాండంలో వేంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. శ్రీ వేంకటేశ్వరునితో సమానమైన దైవం ఇంతకు ముందు లేదు, ఇక తర్వాత ఉండబోదు. సాక్షాత్తూ ఆ వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరినీ అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించాడు.
ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం, నమ్మినవారికి కొంగుబంగారం, అనంతుడు, ఆపదమొక్కులవాడు. తరతరాలుగా స్వామి తనను నమ్మినవారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు.
నా తల్లిదండ్రులైన కీ.శే. బ్రహ్మశ్రీ తిమ్మరాజు లక్ష్మీ నరసింహారావుగారు, తల్లి శ్రీమతి నాగరత్నాంబగారు ఆ శ్రీనివాసుని ఎన్నోవిధాల సేవించి తమ జీవితం ధాన్యం చేసుకున్నారు. నా చిన్నతనంలో మా తండ్రిగారు రోజూ చదివే శ్రీవారి సుప్రభాతం నాలో స్వామిపై భక్తిని ప్రేరేపించింది. అది మొదలు ఆ స్వామియే నాకు సర్వస్వం. చదివింది ఇంజనీరింగ్ అయినా మనసెప్పుడూ వేద శాస్త్రాల మీదనే ఉండేది. ఎల్లప్పుడూ శ్రీనివాసుడే నా మదిలో మెదిలేవాడు.
నేను ఏలూరు తాలూకా, పోతునూరు గ్రామంలో 1956 లో మాతామహుల ఇంట్లో జన్మించాను. నా విద్యాబ్యాసం అంతా పోతునూరు, నాగార్జునసాగర్, హైద్రాబాదు, వరంగల్ ప్రాంతాల్లో జరిగింది. 1983లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్ నుంచి ఎం.టెక్. చదివిన నేను 1988 దాకా ఆల్విన్ కంపెనీలో, అటు తర్వాత 1998 వరకూ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఉద్యోగం చేశాను. అప్పటినుంచి వివిధ బిజినెస్ సంస్థలకు ''శ్రీ డిజైన్స్'' పేరుతో వేద శాస్త్రాల ఆధారంగా కంపెనీల పేర్లు సూచించడం, లోగోలు డిజైన్ చేయడంలో నిమగ్నమయ్యాను. అన్ని సంస్థలు ఎంతో అభివృద్ధి చెంది వివిధ రంగాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నాయి. ఇదంతా ఆ శ్రీనివాసుని అనుగ్రహం తప్ప వేరొకటి కాదు.
ఆ శ్రీనివాసునికి తన భక్తులంటే ఎనలేని ప్రేమ. మనం అహంకారాన్ని, ఇహలోక విషయాలపై మమకారాన్ని వదిలి ఆ స్వామిని ప్రార్ధిస్తే అన్నీ తనే చూసుకుంటాడు. కలియుగంలో ఇంతకుమించిన దైవం లేదు. అందుకే తిరుమలను రోజూ కొన్నివేలమంది దర్శిస్తూ స్వామివారిని సేవిస్తున్నారు.
ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో గతంలో 2002 సంవత్సరంలో నేను ''శ్రీ శ్రీనివాస మాహాత్మ్యం'' అనే పుస్తకం రచించాను. నా పూర్వజన్మ పుణ్యఫలం చేత రాసిన ఈ పుస్తకం శ్రీవారి కరుణాకటాక్షాలతో ఎంతో ప్రజాదరణ పొందింది. ఎంతోమందికి నిత్యపారాయణ గ్రంధం అయింది. రాసింది నేనే అయినా నాతో రాయించింది ఆ స్వామివారే. కేవలం కలం మాత్రం నేను పట్టుకున్నాను. అంతే.. సాక్షాత్తూ స్వామివారే ప్రతి అక్షరానికి ప్రేరణ. ప్రతి పదం శ్రీనివాసుని నామాలే. ఆ పుస్తకం కావలసినవారు నాకు లేఖ రాస్తే తప్పక పంపగలను.
శ్రీనివాసుని లీలలు అద్భుతం. స్వామిని మనసారా కొలిస్తే అంతటి మహత్తర దేవుడు మరొకరు మనకు కనబడరు. శ్రీ వేంకట తత్వాన్ని అర్ధం చేసుకుంటే అంతకు మించిన బ్రహ్మానందం మరొకటి ఉండదు.
శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం పుస్తకాన్ని స్వామివారి ఆజ్ఞ, అనుజ్ఞ, అనుగ్రహంతో రాశాను. ఈ కలియుగంలో అందరూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. ఆ బాధల నుండి బయటపడేందుకు ఈ వ్రతం ఒక్కసారి ఆచరిస్తే చాలు. అన్ని కష్టాలూ తొలగిపోతాయి.
ఈ వ్రతం మొదటి అధ్యాయం పవిత్ర తిరుమల కొండపైన రచించాను. ఈ వ్రతం గురించి రాసే పుణ్యఫలం నాకు అందించిన శ్రీనివాసుని ఎంత కీర్తించినా తక్కువే. ఈ సృష్టి మొత్తం తాను అయిన స్వామికి నేను ఏమివ్వగలను? ఏమిచ్చినా ఆ స్వామిదే. మళ్ళీ తిరిగి ఆయనకే సమర్పించడంగా ఉంటుంది.
ఈ వ్రతంలో మొదటి అధ్యాయం సాక్షాత్తూ స్వామివారే అనుగ్రహించారు. మిగిలిన నాలుగు అధ్యాయాలు మహా తపస్వులైన విశ్వామిత్ర, భరద్వాజ, వశిష్ట, అత్రి తదితరుల అనుగ్రహంతో రచించాను. వారి అనుగ్రహం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను.
ఈ అధ్యాయాలు రాస్తున్నప్పుడు నాకు కలిగిన అనుభూతులు అద్భుతం. రాస్తున్నంతసేపూ ఆ దేవదేవుని దివ్య చరణాలు, మహామునుల పవిత్ర పాదాలే నా మదిలో స్మరిస్తూ ప్రార్ధిస్తూ రచన సాగించాను.
తిరుమల అద్భుత పవిత్ర ప్రదేశం. తిరుమలలో మనం ఏకాంతంగా ఏ ప్రదేశంలో నయినా కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంత చిత్తంతో ధ్యానిస్తే ఓంకారనాదం స్పష్టంగా వినిపిస్తుంది. మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది. అంతేకాక వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాల విశేషాలు వినిపిస్తాయి. ఇప్పటికీ ముక్కోటి దేవతలు, మహా మునులు అనేక దివ్య రూపాలతో సంచరిస్తున్న పవిత్ర ప్రదేశం తిరుమల. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే తిరుమలపై కాలు పెట్టే భాగ్యం శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది.
ఈ వ్రతం ఆచరించడం ఎంతో సులభం. సాక్షాత్తూ శ్రీనివాసుడే అనుగ్రహించినట్లుగా ఎవరి శక్తి కొలదీ వారు ఈ వ్రతం ఆచరించవచ్చు. ఎంతటి కష్టమైనా ఈ వ్రతం ఆచరించిన వెంటనే తొలగిపోతుంది. అయితే ఆచరించేటప్పుడు మాత్రం భక్తి ప్రధానం. ప్రశాంత చిత్తంతో పూర్తిగా మనసు లగ్నం చేసి స్వామివారి వ్రతం ఆచరిస్తే అద్భుత ఫలితాలు గ్రహించగల్గుతారు.
కలియుగ వాసులైన మన కష్టాలు, మనకున్న పరిమితులు, వసతులు అన్నీ ఆ శ్రీమన్నారాయణుడికి తెలుసు. అందుకే ఆ శ్రీనివాసుని ప్రసన్నం చేసుకోడానికి అత్యంత సులువైన మార్గాన్ని మనకు ఉపదేశించారు స్వామివారు. ఈ వ్రతం ఆచరించిన వారికి వ్రత కథను విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి ఆ స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వారి వారి కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఈ వ్రత రచన ఒక మహా యజ్ఞంలా సాగింది. అతి సామాన్యమైన నాకు ఈ మహాభాగ్యం సాక్షాత్తూ శ్రీనివాసుని అనుగ్రహం ముక్కోటి దేవతలు మహా తపస్సంపన్నులైన మునీశ్వరుల ఆశీర్వాదబలం తప్ప మరొకటి కాదు.
ఈ పుస్తక రచనకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ వ్రతకల్పం ఆచరించిన మీరు, వ్రత కథలు విన్నవారికి, ప్రసాదం స్వీకరించిన వారికి సకల ఆయురారోగ్య సౌభాగ్యాలు కలగాలని, ఆ శ్రీలక్ష్మీ శ్రీనివాసులను ప్రార్ధిస్తున్నాను.
తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి
sri venkateswara vratha kalpam, sri venkateswara vratham, sri venkateswara vratha vidhanam, sri venkateswara vratham in telugu, powerful book sri venkateswara vrata kalpam