వరల్డ్ ఫెయిల్యూర్ లవర్! 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ రివ్యూ
on Feb 14, 2020
సినిమా పేరు: వరల్డ్ ఫేమస్ లవర్
తారాగణం: విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీటే, జయప్రకాశ్, ప్రియదర్శి, కేదార్ శంకర్, శత్రు
కథ, స్క్రీన్‌ప్లే: క్రాంతిమాధవ్
మ్యూజిక్: గోపీసుందర్
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సమర్పణ: కె.ఎస్. రామారావు
నిర్మాత: కె.ఎ. వల్లభ
దర్శకత్వం: క్రాంతిమాధవ్
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
విడుదల తేదీ: 14 ఫిబ్రవరి 2020
తెలుగు చిత్రసీమలో సంచలన కథానాయకుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపే 'వరల్డ్ ఫేమస్ లవర్'గా కనిపిస్తాడనే విషయం తెలిసినప్పట్నుంచీ ఈ సినిమాపై అతని అభిమానులు ఆసక్తి కనపరుస్తూ వచ్చారు. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమా నుంచీ నిన్నటి 'డియర్ కామ్రేడ్' వరకూ విడుదలకు ముందు అతని సినిమాలకు వచ్చిన క్రేజ్, బజ్ ఈ సినిమాకు రాలేదనేది నిజం. అయినప్పటికీ సున్నిత కథాంశాలతో, భావుకత నిండిన సన్నివేశాలతో సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న క్రాంతిమాధవ్ డైరెక్టర్ కావడం, గతంలో ఎన్నో గొప్ప, ఉన్నత స్థాయి సినిమాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'వరల్డ్ ఫేమస్ లవర్'పై చాలామంది నమ్మకం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?.. టైటిల్ రోల్‌లో విజయ్ దేవరకొండ ఆకట్టుకున్నాడా?.. చూద్దాం..
కథ:
గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీ ఖన్నా) కాలేజీలోనే ప్రేమలోపడి సహజీవనం చేస్తుంటారు. తను ఉద్యోగం చేస్తుంటే, రచయిత నవుతానని చెప్పిన గౌతమ్ ఆ పనిచేయకుండా, టైంపాస్ చేస్తూ, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో భరించలేకపోతూ వచ్చిన యామిని ఏడాదిన్నర సహజీవనం తర్వాత బ్రేకప్ చెప్తుంది. అది తట్టుకోలేని గౌతమ్ ఆమెను మళ్లీ తన దగ్గరకు రప్పించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తాడు. కానీ అవి ఫలించవు. ఈ క్రమంలో స్నేహితుడు (ప్రియదర్శి) ఇచ్చిన సలహాతో నవలలు రాయడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తను ఆశించినట్లు గౌతమ్ రైటర్ అవడంతో యామిని తిరిగి వచ్చేసిందా? సువర్ణ (ఐశ్వర్యా రాజేశ్), స్మిత (కేథరిన్ ట్రెసా), ఇజా (ఇజాబెల్లే లీటే)లతో గౌతమ్ ప్రేమాయణాల సంగతేమిటి? అనే విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.
విశ్లేషణ:
సినిమా విడుదలకు ముందే 'వరల్డ్ ఫేమస్ లవర్'లో నాలుగు ప్రేమకథలు కనిపిస్తాయని డైరెక్టర్ క్రాంతిమాధవ్, హీరో విజయ్ దేవరకొండ వెల్లడించారు. అందులో హైదరాబాద్‌లో కాలేజీలో యామినితో ఒక ప్రేమకథ అయితే, ఇల్లెందులో సువర్ణ, స్మితలతో రెండు ప్రేమకథలు, ప్యారిస్‌లో ఇజా అనే అమ్మాయితో ఇంకో ప్రేమకథ అని కూడా విజయ్ చెప్పాడు. దాంతో పాటు వాళ్లు బయటకు వెల్లడించని కోణం కూడా ముందుగానే ప్రచారంలోకి వచ్చింది. అది.. గౌతమ్ ఈ సినిమాలో రైటర్‌గా కనిపిస్తాడనీ, యామిని తప్ప మిగతా హీరోయిన్ల పాత్రలు అతను సృష్టించిన పాత్రలుగా దర్శనమిస్తాయనేది. అది నిజమేనని తేలింది. వీటిని స్క్రీన్‌పై డైరెక్టర్ తీసుకొచ్చిన విధానం ఆకర్షణీయంగా లేకపోవడం ఈ సినిమాని బాగా దెబ్బతీసింది. నిజ జీవితంలో గౌతమ్ ప్రేమకథ ఏమాత్రం ఆకట్టుకోలేదు. రాశీ ఖన్నా పాత్రను తీర్చిదిద్దిన విధానం, ఒక వ్యక్తిత్వం లేకుండా అమె ప్రవర్తించే విధానం మనకు చికాకు తెప్పిస్తుంది. 90 శాతం ఆమె క్యారెక్టర్‌ను ఏడుపులు, పెడబొబ్బలతో నింపడంతో ఆమె కనిపించినప్పుడల్లా విసుగుచెందుతాం.
సినిమాలో ఆకట్టుకొనేది ఒక్క సువర్ణ పాత్ర మాత్రమే అని చెప్పాలి. గౌతమ్ రాసిన ఇల్లెందు ప్రేమకథలో శీనయ్య (విజయ్) భార్యగా సువర్ణ దర్శనమిస్తుంది. ఆమె పాత్రను చక్కగా డిజైన్ చేశాడు క్రాంతిమాధవ్. బొగ్గుగనిలో కార్మికుడిగా పనిచేసే శీనయ్య తనను నిరాదరిస్తూ, బొగ్గుగనికి వెల్‌ఫేర్ ఆఫీసర్‌గా వచ్చిన స్మిత అనే యువతి చుట్టూ తిరుగుతుంటే మౌనంగా భరిస్తూ, ఒక్కసారిగా బరస్ట్ అయ్యే ఆ పాత్రలో సహజత్వం కనిపించడంతో మనం కనెక్టవుతాం. సువర్ణ బాధ మన బాధగా ఫీలవుతాం. ఆమె భావోద్వేగాలతో సహానుభూతి చెందుతాం. ఆ ఒక్క పాత్ర మినహా మిగతా ఏ పాత్రతోనూ.. ఆఖరుకి కథానాయకుడైన గౌతమ్ పాత్రతోనూ మనం కనెక్టవలేం. సువర్ణ బాధకు కారణమైన స్మిత పాత్రనూ, ఆమె వెంటతిరిగే శీనయ్యనూ ద్వేషిస్తాం. ప్యారిస్ లవ్ స్టోరీలో గౌతమ్ ప్రవర్తించే తీరు కూడా మనకు నచ్చదు. ఆ కథలోని ట్విస్ట్‌కు కూడా మనం కనెక్ట్ కాలేం. ఇక క్లైమాక్స్ చూశాక.. యామిని క్యారెక్టరైజేషన్‌కు జాలిపడతాం. ఆ ముగింపును కూడా మనం మెచ్చుకోలేం.
సాంకేతిక అంశాల్లో గోపీసుందర్ సంగీతంలో మెరుపులు లేవు. 'బొగ్గుగని' పాట తప్ప మిగతా పాటలేవీ ఆకర్షణీయంగా కనిపించలేదు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ క్లాస్‌లో ఉంది. ఎడిటింగ్‌లో క్రిస్పీనెస్ లేదు. ఓవరాల్‌గా క్రాంతిమాధవ్ టేకింగ్‌లో ఆకర్షణ లేదు.
ప్లస్ పాయింట్స్:
ఇల్లెందు ఎపిసోడ్
ఐశ్వర్యా రాజేశ్ క్యారెక్టర్, ఆమె ఉన్నతస్థాయి నటన
సినిమాటోగ్రఫీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
బోరింగ్ స్క్రీన్‌ప్లే
సరైన వ్యక్తిత్వం లేని గౌతమ్, యామిని పాత్రలు
రాశీ ఖన్నా నటన
విసుగుతెప్పించే సన్నివేశాల చిత్రణ
ఇంప్రెసివ్‌గా లేని క్లైమాక్స్
నటీనటుల అభినయం:
సినిమా మొత్తమ్మీద ఆకట్టుకున్నది సువర్ణ పాత్రధారి ఐశ్వర్యా రాజేశ్. మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఆమెది డీగ్లామరస్ రోల్ అయినా సహజాతి సహజంగా భావోద్వేగాలు పలికించి మన మనసుల్ని గెలుచుకుంటుంది. ఆమె పాత్రకు ఇచ్చిన ముగింపు మన హృదయాల్ని స్పృశిస్తుంది. ఆమె పాత్ర ఇంకా ఉన్నట్లయితే సినిమాకు సేవియర్‌గా మారేదనిపిస్తుంది. పాత్ర తీరును పక్కనపెడితే, ఒక బొగ్గుగని కార్మికుడు శీనయ్య పాత్రలో విజయ్ బాగా రాణించాడు. అదే గౌతమ్ క్యారెక్టర్ విషయానికొస్తే మనల్ని ఒకింత అసంతృప్తికి గురిచేస్తాడు. కొన్ని సన్నివేశాల్లో మినహాయిస్తే, ఎక్కువ శాతం ఆ పాత్ర తీరు మనకు 'అర్జున్ రెడ్డి' క్యారెక్టర్‌నే గుర్తుచేస్తుంది. దాంతో ఇదివరకే చేసిన పాత్రను విజయ్ మళ్లీ చేశాడనే ఫీలింగ్ కలుగుతుంది. ప్యారిస్ ఎపిసోడ్‌లోనూ అతడిని మనం ప్రేమించలేం.
సినిమాలో బాగా డిజప్పాయింట్ చేసిన ఆర్టిస్ట్ రాశీ ఖన్నా అని చెప్పాలి. ఆ పాత్ర తీరూ మనను ఆకట్టుకోదు, ఆ పాత్రలో రాశీ ప్రదర్శించిన హావభావాలు, ఆమె డైలాగ్ డిక్షనూ మనల్ని మెప్పించవు. స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఏడుస్తూ కనిపించడం చికాకు కలిగిస్తుంది. కేథరిన్, ఇజాబెల్లే పాత్రల పరిధి మేరకు నటించారు. యామిని తండ్రిగా జయప్రకాశ్, గౌతమ్ ఫ్రెండుగా ప్రియదర్శి, బొగ్గుగనిలో శీనయ్య ప్రత్యర్థి పట్నాయక్‌గా శత్రు తమవంతు బాధ్యతల్ని నిర్వర్తించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
ఒక్క మాటలో చెప్పాలంటే 'వరల్డ్ ఫేమస్ లవర్' అనేది వ్యక్తిత్వం లేని పాత్రలతో, విసుగెత్తించే సన్నివేశాలతో నడిచే సినిమా. ప్రేమలో పడితే ఎంత బాధను అనుభవించాల్సి వస్తుందో చెప్పాలనుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' అంతకంటే ఎక్కువ బాధను ప్రేక్షకులకు కలిగించాడు.
రేటింగ్: 2.25/5
- బుద్ధి యజ్ఞమూర్తి