కళ్యాణ్ రామ్ ని ముంచిన నందమూరి ఫ్యాన్స్!
on Jan 16, 2024
విభిన్న చిత్రాలతో అలరించే నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా 'డెవిల్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టలేకపోయింది. ఎందుకనో నందమూరి అభిమానులు ఈ సినిమాని భుజానికి ఎత్తుకోలేదు. దాంతో రూ.20 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. రూ.10 కోట్ల షేర్ కే పరిమితమై డిజాస్టర్ గా నిలిచింది.
'డెవిల్' సినిమాకి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి అడుగు పెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 14 నుంచి డెవిల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణే లభిస్తోంది. నేరుగా ఓటీటీలో చూసినవారు.. థియేటర్స్ లో ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో.. ఒక మర్డర్ మిస్టరీని మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కోసం బ్రిటిష్ వారు చేసే ప్రయత్నాన్ని ముడిపెడుతూ కథ రాసుకోవాలన్న ఆలోచన బాగుందని, ఈ పీరియడ్ స్పై ఫిల్మ్ కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా రీచ్ కాలేదని, కనీసం నందమూరి ఫ్యాన్స్ ఆదరించి ఉంటే థియేటర్స్ లో ఈ సినిమా మెరుగైన ఫలితాన్ని అందుకొని ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.