పాపం టిల్లుకి ఎంత కష్టం వచ్చింది!
on Jan 16, 2024
2022లో 'డీజే టిల్లు' సినిమాతో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టిల్లుగా అతను చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' రూపొందుతోంది. అయితే ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది.
'టిల్లు స్క్వేర్'ని 2022 జూన్ లో ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాని సిద్ధు చెక్కుతూనే ఉన్నాడు. 'డీజే టిల్లు'కి దర్శకుడు విమల్ కృష్ణ కాగా, అతన్ని పక్కన పెట్టి 'టిల్లు స్క్వేర్' కోసం మల్లిక్ రామ్ ని దర్శకుడిగా తీసుకున్నారు. అయితే పేరుకి మల్లిక్ రామ్ డైరెక్టర్ అయినప్పటికీ సిద్ధునే అంతా తానై చూసుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్. 'డీజే టిల్లు'ని మించిన విజయాన్ని సాధించాలన్న ఉద్దేశంతో సిద్ధు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ సీక్వెల్ ని చెక్కుతున్నాడట. అందుకే ఈ సినిమా ఆలస్యమవుతుందని అంటున్నారు.
నిజానికి 'టిల్లు స్క్వేర్' మూవీ 2023 మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కానీ మార్చి నుంచి సెప్టెంబర్ కి, సెప్టెంబర్ నుంచి నవంబర్ కి వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఏకంగా 2024 ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. అయితే సంక్రాంతి సినిమాల కోసం 'ఈగల్' త్యాగం చేయడంతో.. 'ఈగల్' కోసం ఫిబ్రవరి 9 డేట్ ని 'టిల్లు స్క్వేర్' త్యాగం చేయాల్సి వచ్చింది. నిజానికి 'ఈగల్'తో సంబంధం లేకుండానే ఫిబ్రవరి 9 కి రావడానికి 'టిల్లు స్క్వేర్' సిద్ధంగా లేదనే ప్రచారం ఉంది. ఇక ఇప్పట్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. 'టిల్లు స్క్వేర్'ని నిర్మిస్తున్న సితార సంస్థ నుంచి వస్తున్న మరో సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మార్చిలో విడుదల కానుంది. ఇక ఏప్రిల్ లో 'దేవర' వంటి భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఈ లెక్కన 'టిల్లు స్క్వేర్' మేకి వాయిదా పడినా ఆశ్చర్యంలేదు. 'డీజే టిల్లు' కారణంగా 'టిల్లు స్క్వేర్'పై ప్రకటనతోనే మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఆలస్యం కారణంగా ఈ బజ్ తగ్గుతూ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read