రెట్టింపు ఉత్సాహంతో రాజమౌళి.. మరోసారి తప్పదు కాసుల బలి!
on Aug 31, 2021

విషయపరంగా ఎలాంటి కొత్తదనం లేకపోయినా, సమాజానికి ఉపకరించే అంశాలేమీ లేకపోయినా, కేవలం భారీతనం, గ్రాఫిక్స్ మాయాజాలం, ఉచిత మీడియా ప్రచారంతో 'బాహుబలి - ద బిగినింగ్', 'బాహుబలి - ద కన్‌క్లూజన్' తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు సాధించాయనేది నిఖార్సయిన విశ్లేషకుల అభిప్రాయం. ఈ విషయం ఆ చిత్ర దర్శకుడు యస్.యస్. రాజమౌళికీ తెలుసు. ఈ సినిమాతో రాజమౌళికీ, ప్రభాస్‌కూ, కథారచయితగా ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కూ దేశవ్యాప్తంగా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు లభించాయి.
కొంతమందికి ఎంత ప్రతిభ ఉన్నా కాలం కలిసిరాక పేరు రాదు, అవకాశాలూ రావు. కొంతమందికి ప్రతిభను మించి కాలం కలిసిరావడంతో అనూహ్యమైన పేరు వచ్చేస్తుంది. 'బాహుబలి'ని గ్రాఫిక్స్ మినహాయించి, సబ్జెక్ట్ మీద దృష్టి కేంద్రీకరించి చూస్తే, సమాజ పురోగతికి అదే మాత్రమూ ఉపకారి కాదని అర్థమవుతుంది. రాచరికాలు, స్పర్థలు, బానిసత్వం, అర్థంపర్థంలేని యుద్ధాలతో ఆ సినిమా కనిపిస్తుంది. అలాంటి సినిమాలు ప్రప్రంచవ్యాప్తంగా తనకే నమ్మశక్యం కానంతగా వసూళ్లు సాధించడంతో, రెట్టింపైన ఉత్సాహంతో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' మూవీని తయారుచేసే పనిలో పడ్డాడు.
'బాహుబలి' రెండు భాగాలను రాజమౌళి రూపొందించిన విధానం చూశాక, 'ఆర్ఆర్ఆర్' ఎలా ఉండబోతోందో చాలామందికి అర్థమైంది. చారిత్రక వ్యక్తులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లను కల్పిత పాత్రలుగా మార్చేసి, ఆ ఇద్దరూ కలుసుకొని వుంటే ఏం జరిగి ఉండేదనే ఊహాజనిత కథతో 'ఆర్ఆర్ఆర్'ను మనం చూడబోతున్నాం. భీమ్ ఒక ఆంగ్లేయ యువతితో ప్రేమలో పడటాన్ని ఈ సినిమాలో తిలకించబోతున్నాం. ఈ కథను ఎంత ఆసక్తికరంగా చూపించాలో, అంత ఆసక్తికరంగా చూపించడానికి రాజమౌళి కసరత్తులు చేశాడు. సీతారామరాజుగా రామ్‌చరణ్, భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని అలరించడానికి రాబోతున్నారు.
అక్టోబర్ 13న ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలనుకున్నా, ఆలోగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యే చాన్స్ కనిపించకపోవడంతో, సంక్రాంతి సీజన్ లక్ష్యంగా సినిమాని తీసుకు రావాలని భావిస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడికి మించి చాలా ఎక్కువగా బిజినెస్ జరిగినందున నిర్మాతలకు ఎలాంటి టెన్షన్లూ లేవు. ప్రేక్షకుల నుంచి ఎన్ని కోట్లు పిండుకోవాలనే లెక్కల్లో వారున్నారు. 'బాహుబలి' తరహాలోనే 'ఆర్ఆర్ఆర్'కు వద్దన్నా ఆత్రంగా విపరీత ప్రచారం ఇస్తూ వస్తోంది మీడియా. రాజమౌళికి ఇంతకు మించి ఏం కావాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



