శ్యామ్ కె నాయుడిపై కేసు పెట్టిన సాయిసుధ ఎవరు?
on May 27, 2020

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ నటి సాయిసుధ పోలీసు కేసు పెట్టడం టాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్‌లోని సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ప్రకారం పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, సహజీవనం చేసేలా ఒత్తిడి చేసిన శ్యామ్ కె నాయుడు తర్వాత మోసం చేశాడని ఆమె ఆరోపించారు. ఐదేళ్ల నుంచీ తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామనీ, పెళ్లి చేసుకొమ్మని గట్టిగా అడుగుతుంటే బతిమలాడుతూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సాయిసులధ చెప్పారు. ఇప్పుడు తను తన భార్యతోనే ఉంటానని అంటున్నాడనీ, అందుకే కేసు పెట్టాననీ ఆమె అన్నారు. శ్యామ్‌తో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పడానికి తనవద్ద అనేక ఆధారాలున్నాయని ఆమె తెలిపారు. కాల్ రికార్డ్స్, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయని ఆమె చెప్పారు.
శ్యామ్ కె. నాయుడు ఎవరో కాదు, స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడుకు స్వయానా తమ్ముడు. స్వయంగా మంచి పేరున్న సినిమాటోగ్రాఫర్. చాలా కాలం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నాడు. 'ఇడియట్' సినిమా నుంచి మొదలైన ఆ ఇద్దరి కాంబినేషన్.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, నేనింతే, ఏక్ నిరంజన్, కెమెరామన్ గంగతో రాంబాబు, టెంపర్ మూవీస్ దాకా కొనసాగింది. ఇవే కాకుండా అల్లు అర్జున్‌తో 'జులాయి', వెంకటేశ్‌తో 'బాడీగార్డ్', నాగార్జునతో 'రాజన్న', 'మాస్' వంటి సినిమాలకు చక్కని విజువల్స్ ఇచ్చి పాపులర్ అయ్యాడు.
అన్నయ్య చోటా కె. నాయుడు ముక్కుసూటి మనస్తత్వం ఉన్న మనిషిగా, ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటే, తమ్ముడు శ్యామ్ అందుకు భిన్నంగా లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేస్తూ వచ్చాడు. సినిమా వేడుకల్లో శ్యామ్ మాట్లాడటం చాలా తక్కువ. చూడ్డానికి చాలా మెతకమనిషి అనే పేరు తెచ్చుకున్నాడు. అలాంటివాడు ఒక నటిని పెళ్లిపేరుతో మోసం చేశాడనే ఆరోపణలు ఎదుర్కోవడం ఇండస్ట్రీ వర్గాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇంతకీ శ్యామ్ తనను మోసం చేశాడంటూ ఆరోపిస్తోన్న సాయిసుధ ఎవరు? అంటూ అంతా ఆరాలు తీయడం ప్రారంభించారు. ఇప్పటి దాకా నలభైకి పైగా సినిమాల్లో వివిధ రకాల పాత్రలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయిసుధకు కెరీర్ పరంగా బ్రేక్ లభించలేదు. 'అర్జున్‌రెడ్డి' మూవీలో హీరో విజయ్ దేవరకొండతో స్టార్టింగ్‌లో ఒక ఇంటిమేట్ సీన్‌లో కనిపించేది సాయిసుధే. అదివరకు దమ్ము, బాడీగార్డ్, అవును, ఎవడే సుబ్రమణ్యం వంటి సినిమాల్లో ఆమె నటించారు.
సాయిసుధ తండ్రి ఒక బిల్డర్. తల్లిదండ్రుల అభీష్టానికి విరుద్ధంగా ఆమె ఇండస్ట్రీలోకి వచ్చారు. దాంతో మొదట్లో కుటుంబం ఆమెను దూరం పెట్టింది. అందువల్ల ఆమెకు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. చేసేది చిన్న పాత్రలు కావడంతో, దాంతో వచ్చిన రెమ్యూనరేషన్‌తోటే ఆమె జీవనం సాగిస్తూ వచ్చారు. కొంత కాలం తర్వాత కుమార్తె పట్టుదలను చూసి, తిరిగి తల్లిదండ్రులు ఆమెకు చేరువయ్యారు.
సాయిసుధ చెప్పిన దాని ప్రకారమైతే.. తన ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటూ శ్యామ్ కె. నాయుడు ఆమెకు దగ్గరయ్యాడు. తమ మధ్య బంధం గురించి చోటా కె. నాయుడుకు కూడా తెలుసనీ, అప్పట్లో ఆయన తమకు సపోర్ట్ చేశారనీ కూడా సాయిసుధ చెప్పారు. ఫ్యామిలీలో డిస్టర్బెన్స్‌లు తొలగించుకొని శ్యామ్ తన దగ్గరకు వస్తాడని చోటా చెప్పినట్లు ఆమె తెలిపారు.
గతంలో శ్రీరెడ్డి విషయంలో ఆమెనే సాయిసుధ తప్పు పట్టారు. శ్రీరెడ్డి చేస్తోంది తప్పని ఆమె అభిప్రాయపడ్డారు. తన సొంత ప్రాబ్లెమ్‌తో ఇండస్ట్రీ అంతా బ్యాడ్ అనే అభిప్రాయాన్ని శ్రీరెడ్డి క్రియేట్ చేసిందని ఆమె అన్నారు. ఇప్పుడు శ్యామ్ కె నాయుడు విషయంలో సాయిసుధకు ఎలాంటి న్యాయం జరుగుతుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



