ఎన్టీఆర్ కి తెలిసే జరుగుతుందా.? ఫ్యాన్స్ ఊరుకుంటారా.?
on Apr 4, 2025
తెలుగు హీరోలలో కల్ట్ ఫ్యాన్ బేస్ వున్న హీరో ఎన్టీఆర్. ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ఈవెంట్స్ నే క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఎన్టీఆర్ పాల్గొనే ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ కి పరిమితులు విధించటం ఏంటి.? ప్రపంచం అంతా ఎన్టీఆర్ స్పీచ్ కోసం ఎదురు చూస్తారు. ఓన్లీ టీవీ ఛానల్స్ కి మాత్రమే పరిమితం చేస్తే, వివిధ డిజిటల్ మాధ్యమాలలో చూసే అభిమానుల పరిస్థితి ఏంటి? ఈ తెలివితక్కువ ఐడియా ఎవరిది.? అన్నీ నిస్సంకోచంగా మాట్లాడే నాగవంశీ స్వతహాగా నిర్ణయం తీసుకున్నాడా.? లేక ఎవరన్నా ప్రభావితం చేశారా? అనే అనుమానం రాకమానదు.
ఇప్పుడు నిర్మాత నాగవంశీ ఇలాంటి పరిమితులు పెట్టుకుంటే.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా విస్తృతంగా వ్యాపించిన తరుణంలో రాబోవు రోజుల్లో ఎలా ఎదుర్కుంటారు. మీకు ఇబ్బంది కలిగించిన సోకాల్డ్ పర్సన్స్ పేరు చెప్పి సదరు వ్యక్తులు చేస్తున్న డామేజ్ ఏంటో ప్రజలకి చెప్తే.. ప్రజలు, ప్రేక్షకులు ఆ వెబ్సైట్లు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ చూడరు, ఫాలో అవ్వరు కదా. ఒక్కళ్ళిద్దరు కోసం ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఎన్టీఆర్ కి ఈవెంట్ టెలికాస్ట్ కొన్ని మాధ్యమాలకే పరిమితి చేసిన విషయం తెలిస్తే, ఎన్టీఆర్ రియాక్షన్ వేరేలా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు
2023 లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్'కి సీక్వెల్ గా సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మించిన 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం, మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.70 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సక్సెస్ మీట్ ని నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. అయితే, ఈ ఈవెంట్ లైవ్ విషయంలో మేకర్స్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
తమ సినిమాని వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతో టీవీ ఛానల్స్, డిజిటల్ మీడియా అనే తేడా లేకుండా అందరికీ లైవ్ ఇస్తుంటారు మేకర్స్. 'మ్యాడ్ స్క్వేర్' కూడా ఇందుకు మినహాయింపు కాదు. విడుదలకు ముందు పలు ఈవెంట్లు జరగగా.. టీవీ ఛానల్స్ సహా డిజిటల్ మీడియాకి కూడా లైవ్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు సక్సెస్ మీట్ విషయంలో మాత్రం.. టీవీ ఛానల్స్ కి మాత్రమే లైవ్ అంటూ, డిజిటల్ మీడియాకి షాకిచ్చారు.
విడుదలకు ముందు 'మ్యాడ్ స్క్వేర్' ప్రమోషన్స్ కోసం డిజిటల్ మీడియా కూడా కావాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు సినిమా సక్సెస్ అయ్యేసరికి వాటి అవసరం లేకుండా పోయిందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లేదా ఎన్టీఆర్ బ్రాండ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ స్పీచ్ లకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఆయన ఏదైనా ఈవెంట్ కి వస్తున్నారంటే.. లైవ్ లో ఆ ఈవెంట్ ని చూడటానికి ఎందరో ఆసక్తి చూపిస్తుంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. డబ్బు కోసం లైవ్ కవరేజ్ ని టీవీ ఛానల్స్ కి అమ్మేసుకున్నారా? అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. అయితే నిర్మాత నాగవంశీ డబ్బు కోసం అలా చేసే వ్యక్తి కాదని.. ఆయనను అంతో ఇంతో ఫాలో అయ్యేవారికి కూడా అవగాహన ఉంది. మరి అలాంటి వంశీ, 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ లైవ్ విషయంలో తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక వేరే ఏదైనా బలమైన కారణం ఉందా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఇటీవల డిజిటల్ మీడియాపై నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఇచ్చిన రివ్యూలకు భిన్నంగా.. మ్యాడ్ స్క్వేర్ భారీ వసూళ్లు రాబడుతుండటంతో.. అది చూసి తట్టుకోలేని వారు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారని వంశీ ఫైర్ అయ్యారు. మీతో మాకు అవసరం లేదని, కావాలంటే మా సినిమాలను బ్యాన్ కూడా చేసుకోవచ్చని నాగవంశీ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ లైవ్ విషయంలో నాగవంశీ ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే నాగవంశీకి మొత్తం డిజిటల్ మీడియా మీద కోపం లేదు. పనిగట్టుకొని తమ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారనే ఉద్దేశంతో.. ఒకరిద్దరిపైనే ఆయన మండిపడ్డారు. మరి ఒకరిద్దరిపై ఉన్న కోపాన్ని.. ఇలా అందరిపై చూపించడం ఎంతవరకు సబబు. నిజానికి నాగవంశీకి ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. మనసులో ఒకటి, పైకి ఒకటి అన్నట్టు కాకుండా.. ఉన్నది ఉన్నట్టు నిజాయితీగా ముఖం మీదే చెప్పేయడం ఆయనకు అలవాటు. ఆలాంటి వంశీ.. తనకు సమస్య ఉన్న ఆ ఒకరిద్దరిని, తమ ఈవెంట్స్ కి రావద్దని డైరెక్ట్ గా చెప్పాలి కానీ.. దానికి బదులుగా ఇలా అందరినీ బ్యాన్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్?. మరి 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ లైవ్ ని టీవీ ఛానల్స్ కి మాత్రమే ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణమా ఇదేనా? లేక మరేదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
