హీరో అవుతున్న వినాయక్‌తో మెగాస్టార్ ఏమన్నారు?
on Aug 24, 2019
మాస్ డైరెక్టర్‌గా పలు బ్లాక్‌బస్టర్ మూవీస్ అందించిన వి.వి. వినాయక్ త్వరలో హీరోగా అవతారం ఎత్తనున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మించే ఈ సినిమాకు 'శరభ' ఫేం నరసింహారావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నటించడం కోసం వినాయక్‌కు భారీ పారితోషికాన్నే రాజు అందిస్తున్నట్లు ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు. ఆ కేరెక్టర్ కోసం వినాయక్ తన శరీరాన్ని కష్టపెడుతున్నారు. బరువును తగ్గించుకోడానికి డైట్ ఫాలో అవడమే కాకుండా జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.
వినాయక్ తెరపై కనిపించడం ఇదే తొలిసారి కాదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఠాగూర్'లో వినాయక్ ఒక చిన్న పాత్రలో దర్శనమిచ్చారు. ఆ సినిమాని వినాయక్ డైరెక్ట్ చేసిన విదితమే. ఇప్పుడు హీరో అవుతున్న వినాయక్‌తో చిరంజీవి ఏం చెప్పారు?
"దిల్ రాజు బేనర్‌లో నేను హీరోగా నటించబోతున్నానని తెలిసి అన్నయ్య (చిరంజీవి) చాలా ఆనందించారు. 'వినయ్.. నువ్వు నటించబోతున్నట్లు వచ్చిన ప్రకటనలో నీ ఫొటో చూశాను. నాకు చాలా ఆనందం వేసింది. రాజు చూపించాడు. నువ్వు యాక్టర్‌వి అవుతున్నావనే ఎగ్జైట్‌మెంట్ కంటే కూడా.. ఫస్ట్ నువ్వు బరువు తగ్గుతున్నావు. జిమ్ కెళ్లి కష్టపడుతున్నావ్. బాడీని ఒక షేప్‌లోకి తెచ్చుకుంటున్నావ్. ఈ యాక్టింగ్ ఉంటేనే అది చేస్తావ్. నీ ఇంటికి పెద్దవి నువ్వే. నువ్వు ఎంత హెల్దీగా ఉంటే నీ ఫ్యామిలీ అంత బాగుంటుంది. అది నాకు చాలా ఆనందమేసింది. ఇంకా కష్టపడు. ఇంకా తగ్గు' అని చెప్పారు" అని వినాయక్ తెలిపారు.
ఈ సందర్భంగా 'ఠాగూర్'లో వినాయక్ వేసిన చిన్న రోల్‌ని చిరంజీవి ప్రస్తావించారు కూడా. "వినయ్.. ఇప్పుడు నువ్వు మెయిన్ రోల్ చేస్తున్నప్పటికీ, నిన్ను మొదట యాక్టర్ని చేసింది నేనే" అని సరదాగా అన్నారని వినాయక్ చెప్పారు. "అది నిజమే. ఆయన చెయ్యమంటేనే 'ఠాగూర్'లో ఒక సన్నివేశంలో కనిపించే రోల్ చేశాను. "నీ కళ్లు బాగుంటాయి. ఇది నువ్వు చెయ్యి" అని ఆ రోజు నాచేత బలవంతంగానే ఆయన చేయించారు. ఆ సీనులో నేను బాగా చేశానని ఎవరైనా అన్నారంటే, ఆ క్రెడిట్ అన్నయ్యదే" అని చెప్పుకొచ్చారు వినాయక్.