దిల్ రాజు బ్యానర్‌లో విజయ్!
on Dec 18, 2019
దిల్ రాజు బ్యానర్‌లో నటించేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రెండేళ్ల నుంచీ విజయ్‌తో సినిమా తీసేందుకు రాజు ప్రయత్నిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సినిమా వాస్తవ రూపం దాల్చబోతోంది. 'నిన్నుకోరి', 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నది. ప్రస్తుతం శివ 'టక్ జగదీష్' సినిమాని నాని హీరోగా తీస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక విజయ్‌ను అతను డైరెక్ట్ చేయనున్నాడు. అంటే 2020 సెకండాఫ్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
ఈలోగా విజయ్ సైతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'ఫైటర్' మూవీ చేయనున్నాడు. ఇది విజయ్‌కు పదకొండవ చిత్రం. అంటే శివతో చేసేది అతనికి 12వ సినిమా అవుతుందన్న మాట. మునుపటి మూవీ 'డియర్ కామ్రేడ్' ఆశించిన రీతిలో ఆడకపోవడంతో డైరెక్టర్ల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ వస్తున్నాడు విజయ్. ఒక సినిమాని డాషింగ్ డైరెక్టర్‌తో మరో సినిమాని సెన్సిబుల్ డైరెక్టర్‌తో ప్లాన్ చేసుకున్నాడు.